శనివారం 28 నవంబర్ 2020
Agriculture - Oct 22, 2020 , 01:25:59

నిర్వహణతోనే నియంత్రణ

నిర్వహణతోనే నియంత్రణ

దేశవ్యాప్తంగా డెయిరీలు, గోశాలల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక దృష్టి పెట్టింది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో తలెత్తే గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు పలు సూచనలను అందించింది. ఈ మేరకు పాడి పశువుల పేడ, మూత్రంలాంటి వాటితో పర్యావరణ సమస్యలు ఉత్పన్నం కాకుండా మార్గదర్శకాలను విడుదల చేసింది. 

ఒక పాడి పశువు  రోజూ 15 నుంచి 20 కేజీల పేడ, మూత్రం విడుదల చేస్తుంది. వీటిని యజమానులు డ్రైనేజీలు, కాలువల్లోకి వదలుతుండటంతో అవి సమీపంలోని నదుల్లోకి చేరి, నీటిని కలుషితం చేస్తున్నాయి. అంతేకాకుండా,  ఈ వ్యర్థాలు స్థానికంగా నిలువ ఉండటంతో దోమల ఉత్పత్తికి ఆవాసాలుగా మారుతున్నాయి. ఫలింతంగా,  ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. ఘన వ్యర్థాల నుంచి కార్బన్‌ డై ఆక్సైడ్‌, అమోనియా, హైడ్రోజన్‌, సల్ఫైడ్‌, మిథైన్‌లాంటి వాయువులు ఉత్పత్తి అవుతూ, శ్వాస సంబంధ అనారోగ్యాలు సంభవిస్తున్నాయని తెలిపింది.  అయితే, ఆవు పేడతో అనేక ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో..వాటిని సమర్థంగా  వినియోగించేలా చూడాలని సూచించింది. ఆవు పేడను బయోగ్యాస్‌గా, భూసారాన్ని పెంచే ఎరువుగా వాడాలనీ,  గోడలను శుభ్రం చేయడానికి, చేపలకు ఆహారంగా  కూడా  ఉపయోగించాలని సూచించింది.


కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలు

 • డెయిరీలు, గోశాలల్లో పశువులు ఉత్పత్తి చేసే ద్రవ, ఘన వ్యర్థాల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలి.
 • పట్టణాలు, నగరాలు, గ్రామాలకు 200 మీటర్ల దూరంలోనే డెయిరీలు, గోశాలలను ఏర్పాటు చేయాలి. నివాసాలకు కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలి. ముంపు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయరాదు. 25 సంవత్సరాల సగటు వరదలను పరిగణనలోకి తీసుకొని, ముంపు ప్రాంతాలను గుర్తించాలి. 
 • పశువులు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా జాతీయ రహదారులకు 200 మీటర్లు, రాష్ట్ర రహదారులకు 100 మీటర్ల దూరంలో డెయిరీ ఫామ్‌లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 500 మీటర్ల దూరంలో మంచినీటి వనరులు ఉండేలా చూసుకోవాలి. 
 • ఒక పశువుకు, మరో పశువుకు మధ్య కనీసం 2.5 మీటర్ల దూరం ఉండాలి. 
 • రోజూ పేడను ఎత్తివేసి, నేలను శుభ్రంగా ఉంచాలి.
 • డెయిరీని, పరిసరాలను నిత్యం శానిటైజ్‌ చేయాలి.
 • డెయిరీలు, గోశాలలను కడిగిన నీటిని డ్రైనేజీల్లోకి వదల కూడదు. 
 • వ్యర్థాలు డ్రైనేజీలోకి రాకుండా స్థానిక సంస్థలు పర్యవేక్షించాలి. 
 • ద్రవ వ్యర్థాల నిర్వహణను సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా డెయిరీలు, గోశాలల నిర్మాణ సమయంలోనే ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలి.
 • ద్రవ వ్యర్థాల నిల్వకు ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు  నిర్మించాలి. 
 • పశువుల మందులు, ఇంజక్షన్లకు సంబంధించిన వ్యర్థాల నిర్వహణ కోసం 2016 సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనలు పాటించాలి. 
 • ఘన, ద్రవ వ్యర్థాలను వర్మీకంపోస్టు, బయోగ్యాస్‌ తయారీలో వాడుకోవాలి.
 • ఆవుపేడతో పిడకలు తయారు చేసి, వంట చెరుకుగా ఉపయోగించుకోవచ్చు. గృహ అవసరాలకు ఉపయోగపడేలా పలు వినియోగ వస్తువులనూ తయారు చేసుకోవచ్చు. 
 • ఆవులు, బర్రెలకు తాగునీటి కోసం, ప్రాంగణాల శుభ్రత కోసం రోజుకు 150 లీటర్ల నీటిని మాత్రమే వినియోగించాలి.
 • భూగర్భ జలాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలి.
 • గోశాలలు, డెయిరీల్లో పశువులకు గాలి, వెలుతురు సక్రమంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలి. 
 • పశువులకు ఉక్కపోత రాకుండా, చుట్టూ దుర్వాసనలు లేకుండా చూసుకోవాలి.
 • గోశాలలు, డెయిరీల నిర్వహణకు సంబంధించి.. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, స్థానిక పాలనా సంస్థల ఆధ్వర్యంలో నిర్వాహకులకు ఎప్పటికప్పుడూ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.

....మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి