శుక్రవారం 23 అక్టోబర్ 2020
Agriculture - Oct 08, 2020 , 00:07:19

బోలెడు లాభాల బోడకాకర

బోలెడు లాభాల బోడకాకర

‘పుస్తెలు అమ్మయినా పులస తినాలి’ అని గోదావరి జిల్లాల నానుడి. మరి మన తెలంగాణలో? ఒక్క ‘బోడ కాకర’కు మాత్రమే అంతటి గిరాకీ! తింటే ఆరోగ్యం. పండిస్తే ఆదాయం.కాబట్టే, బోడ కాకర.. పంటల్లో రారాజుగా వెలుగొందుతున్నది. ఒకప్పుడు అడవులు, తుప్పల్లో సహజసిద్ధంగా పెరిగిన బోడ కాకర, ఇప్పుడు వ్యవసాయ క్షేత్రాల్లో విరివిగా సాగవుతున్నది. రుచికివగరే అయినా.. రైతులకు మాత్రం లాభాల తీపిని అందిస్తున్నది.

కూరగాయల సాగు అనేది కత్తిమీద సాములాంటిది. గిరాకీ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఉండదో అర్థంకాని పరిస్థితి. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, మార్కెట్లలోనో.. రోడ్లపైనో పారబోసిన సందర్భాలు అనేకం. మామూలుగానే కూరగాయల సాగులో రైతుకు కష్టం ఎక్కువ.. లాభం తక్కువ అనే భావన ఉంటుంది. అయితే, ‘బోడ కాకర’ మాత్రం ఇందుకు భిన్నమైనది. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం సమకూర్చుతున్నది. నష్టమనే పదాన్ని రైతు దరిదాపులకు కూడా రానివ్వకుండా చేస్తున్నది. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన బోడ కాకరకు, మార్కెట్లోనూ మంచి డిమాండ్‌ ఉన్నది. 

విత్తనాల లభ్యత తక్కువే

బోడ కాకర సాగులో విత్తనాల సేకరణ ఎంతో కీలకమైనది. మిగతా కూరగాయల మాదిరిగా ఈ విత్తనాలు ఎక్కడపడితే అక్కడ దొరకవు. మార్కెట్లోనూ లభ్యత చాలా తక్కువ. పంటను సాగు చేసే రైతుల వద్దే బోడ కాకర విత్తనాలు ఎక్కువగా లభిస్తాయి. రైతులు కొన్ని కాయలను చెట్టుపైనే ఉంచేస్తారు. అవి పూర్తిగా పండిన తర్వాత తెంపి, వాటి నుంచి విత్తనాలను సేకరిస్తారు. ఆసక్తి ఉన్న రైతులు జిల్లా ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదిస్తే, వారే సాగు మెలకువలను వివరిస్తారు. బోడ కాకరను సాగు చేసే రైతుల వివరాలను కూడా అందిస్తారు. వారిని నేరుగా సంప్రదించి విత్తనాలను తీసుకోవచ్చు. సాగు అనుభవాలను కూడా తెలుసుకోవచ్చు. 


ఔషధ గుణాలు అపారం: బోడ కాకరలో అపార ఔషధ 

గుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  మధుమేహ బాధితులకు మంచి ఆహారం. శరీరంలో ఇన్సులిన్‌ స్థాయిని పెంచి, చక్కర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. గర్భిణులు వీటిని తినడం వల్ల శిశువు ఎదుగుదల బాగుంటుంది. శరీరంలోని క్యాన్సర్‌ కారకాలను నాశనం చేయడంలోనూ ఉపయోగపడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే బోడ కాకర సకలరోగ నివారిణిగా పని చేస్తుంది. 

మార్కెట్లో భారీ డిమాండ్‌: మార్కెట్లో బోడ కాకరకు ఎప్పటికీ డిమాండ్‌ ఉంటుంది. అరుదైన పంట కావడం, ఎన్నో పోషక విలువలు ఉండటమే దీనికి కారణం. తొలికాపు సమయంలో హోల్‌సేల్‌గానే రూ.150 నుంచి రూ. 200 వరకు కేజీ ధర పలుకుతుండటం విశేషం. ఆ తర్వాత పంట దిగుబడి పెరిగినా, ధర కూడా తక్కువగానే తగ్గుతుంది. అయినా కేజీ కనీస ధర రూ.100 నుంచి రూ. 120 దాకా పలుకుతుంది. కొందరు వ్యాపారులు అయితే చేను వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా సేంద్రియ సాగు చేసే రైతుకు  కేజీకి రూ.150 నుంచి రూ. 180 వరకు చెల్లిస్తున్నారు. ఒకవేళ రైతు ఇంకా ఎక్కువ ధర కావాలనుకుంటే నేరుగా మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకోవచ్చు. దీని వల్ల అధిక లాభాలు కూడా పొందవచ్చు.

కనీస ఆదాయం రూ.4 లక్షలు

ఇతర కూరగాయల సాగుతో పోలిస్తే బోడ కాకరలో ఆదాయం భారీగా ఉంటుంది. ఒక ఎకరంలో సాగు చేసే రైతుకు 4 నుంచి 6 నెలల కాలంలో కనీసం రూ. 4లక్షల రాబడి వచ్చే అవకాశం ఉంది. దిగుబడి పెరిగితే ఈ ఆదాయం రూ. 6 లక్షల వరకూ చేరుతుంది. ఒక ఎకరానికి కనీసం 40-50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కేజీ ధర కనీసం రూ.100గా లెక్కించినా, రైతుకు 40 క్వింటాళ్లకు రూ.4 లక్షల ఆదాయం సమకూరుతుంది. బోడ కాకర కాయలతోపాటు విత్తనాలకు కూడా మంచి డిమాండ్‌ ఉంది. కాబట్టి ఈ పంట సాగు చేసే రైతులు విత్తనాల తయారీపై కూడా దృష్టి పెట్టాలి. తద్వారా అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. 

ఎకరానికి ఆరు కేజీల విత్తనం: బోడ కాకర సాగులో విత్తనాల అవసరం అధికం. ప్రతి ఎకరానికి 4 నుంచి 6 కేజీల విత్తనాలు వేయాల్సి ఉంటుంది. పెట్టిన విత్తనాల్లో కేవలం 30 నుంచి 50 శాతం మాత్రమే మొలకెత్తుతాయి. అందువల్ల ఒకే దగ్గర ఎక్కువ విత్తనాలను విత్తాల్సి ఉంటుంది. ఒక చిన్న గుంతలో 5 నుంచి 10 విత్తనాలు పెట్టాలి. కేజీ విత్తనం ధర ప్రాంతాన్ని బట్టి రూ. 2 వేల నుంచి రూ. 3,500 వరకు పలుకుతుంది. అంటే ఒక ఎకరం సాగుకు రైతు విత్తనాల కోసమే రూ. 10 వేల నుంచి రూ. 20వేల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది. విత్తనాలు వేసే సమయంలో గుంతకు గుంతకు మధ్య కనీసం 1.5 నుంచి 2 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

పందిరితోనే దిగుబడి: ఇది పందిరి పంట. పందిరి ఎంత బాగుంటే దిగుబడి అంత ఎక్కువగా వస్తుంది. సిమెంటు లేదా రాతి కనీలను భూమిలో పాతి, వీటిపై వైరుతో పందిరి వేసుకోవాలి. కనీల మధ్య లేదా కాలువల మధ్య 10 అడుగుల ఎడం ఉండేలా చూసుకోవాలి. ప్రతి ఎకరానికి 170 నుంచి 200 వరకు కనీలు అవసరమవుతాయి. బోడ కాకర సాగులో రైతుకు పందిరి ఖర్చే అధికంగా ఉంటుంది. కనీలు, తీగ కొనుగోలు, వాటిని పాతేందుకు.. ఇలా రైతు కనీసంగా రూ. 1.5 లక్షల నుంచి రూ. 2లక్షల వరకు వెచ్చించాల్సి వస్తుంది. 

తక్కువ నీటితోనే : ఏప్రిల్‌ నెలలో విత్తనాలు పెట్టినప్పుడు ప్రతి అర్ధగంటకూ నీరు పెట్టాల్సి ఉంటుంది. మొలకెత్తిన తర్వాతి నుంచి కాస్త తడిగా ఉండేలా చర్యలు తీసుకుంటే సరిపోతుంది. సాగునీరు అందించేందుకు డ్రిప్‌ విధానాన్ని ఎంచుకుంటే మంచిది. తద్వారా మొక్కకు కావాల్సిన నీటిని, ఎరువులను కచ్చితమైన కొలతల్లో సరఫరా చేయవచ్చు.

ఏప్రిల్‌, మే నెలలే బెస్ట్‌: బోడ కాకర సాగుకు ఏప్రిల్‌, మే నెలలు అనువైనవి. ముఖ్యంగా ఏప్రిల్‌ మధ్య నుంచి మే నెల మొదటి వారంలోగా విత్తనాలు వేసుకోవాలి. మొక్కకు మొక్కకూ మధ్య 2 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తనాలు నాటిన 45-50 రోజుల్లో పూత పూస్తుంది. పూత కాయగా మారేందుకు వారం నుంచి పది రోజులు పడుతుంది. అంటే విత్తనం వేసిన 60 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. 

ఐదేండ్ల దాకా: బోడ కాకరలో విత్తనాలు ఒకసారి వేస్తే కనీసం మూడు నుంచి ఐదేండ్ల వరకు అదే పంట కొనసాగుతుంది. మళ్లీ విత్తనాలు వేయాల్సిన అవసరం ఉండదు. అవసరమైతే ఇంకొంత కాలం కూడా కొనసాగించవచ్చు. అయితే దిగుబడి తగ్గితే మాత్రం, మళ్లీ కొత్త విత్తనాలు వేసుకుంటే మంచిది.

మగ మొక్కల్ని తీసేయాల్సిందే:

 బోడ కాకరలో ఆడ, మగ రెండు రకాల మొక్కలు ఉంటాయి. కాయలు కాసేవి ఆడ మొక్కలే కాబట్టి, మగ మొక్కల్ని తీసేయాలి. కానీ, ప్రతి 10 ఆడ మొక్కలకు ఒక మగ మొక్క ఉండేలా చూసుకోవాలి. ఆడ మొక్కతో పోలిస్తే మగ మొక్క ముందుగా మొలకెత్తడంతోపాటు ముందుగానే పూత పూస్తుంది. ఆడ మొక్కకు నేరుగా పువ్వు పూస్తే, మగ మొక్కకు ముందుగా బుగ్గలాంటి ఆకారంలో పువ్వు వస్తుంది. ఈ సూచన ద్వారా మగ మొక్కల్ని గుర్తించి, దుంపతో సహా తీసేయాలి. లేదంటే మళ్లీ మొలకెత్తుతుంది. 

మూడు రోజులకోసారి

సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఆరు నెలల వరకు దిగుబడి ఇస్తుంది. ఏప్రిల్‌లో విత్తనాలు నాటితే జూన్‌లో తొలికాపు చేతికి అందుతుంది. ఆ తర్వాత అక్టోబరు నుంచి జనవరి దాకా కాయలు కాస్తూనే ఉంటాయి. విత్తనాలు నాటగానే డ్రిప్‌ సాయంతో రోజూ 15  నుంచి 20 నిమిషాల పాటు నీళ్లు పారించాలి. 

తొలి పెట్టుబడే ఎక్కువ

బోడ కాకరలో తొలి పెట్టుబడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అన్ని ఖర్చులు కలిపి మొత్తంగా రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఇందులో అధికభాగం పందిరి కోసమే వెచ్చించాల్సి ఉంటుంది. దీని కోసమే రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు అవుతుంది. ఇక విత్తనాల కొనుగోలుకు రూ.15 వేల నుంచి రూ. 20వేల వరకు అవుతుంది. దుక్కి దున్నేందుకు, కూలీలకు, ఎరువులకు, ఇతర పనులకు రూ. 30వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చవుతుంది. ఆ తర్వాతి యేడాది నుంచి రైతుకు పందిరి ఖర్చు తప్పుతుంది. కూలీలకు, ఎరువులకు మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 

నష్టం అనేదే లేదు..

రెండేండ్లుగా నేను బోడ కాకర సాగు చేస్తున్నా. దీని వల్ల నాకు నష్టమనేదే లేదు. ప్రస్తుతం అరెకరంలో పండిస్తున్నా. ప్రతి పంటకూ లక్షన్నర నుంచి రెండు లక్షలదాకా వస్తున్నది. హోల్‌సేల్‌గానే రూ.120 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నా. బోడ కాకరను సాగు చేయాలనుకునే రైతులకు సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. ఆసక్తి ఉన్నవారు 8897785960 నంబరుకు ఫోన్‌ చేయవచ్చు. 

                                                                      - రాంరెడ్డి, రైతు, ఖమ్మం జిల్లా 

ఇష్టంతోనే సాగులోకి

వ్యవసాయంపై ఇష్టంతో ఆర్గానిక్‌ సాగు మొదలుపెట్టా. నాలుగేండ్లుగా బోడ కాకర పండిస్తున్నా. వాతావరణ, మార్కెట్‌ పరిస్థితులు అనుకూలించని సమయంలో లాభం తగ్గుతుందే తప్ప, పెట్టుబడి నష్టం మాత్రం రాదు. ఉద్యానవన శాఖ అధికారులు కూడా బాగా సహకరిస్తున్నారు. 

- రమణారెడ్డి, రైతు, వరంగల్‌ రూరల్‌ జిల్లా 

ముందుకొస్తే సహకరిస్తాం

బోడ కాకరసాగు రైతులకు లాభదాయకంగా ఉంది. ఇతర కూరగాయలతో పోలిస్తే మంచి ధర పలకడంతోపాటు సులువుగా మార్కెటింగ్‌ చేసుకోవచ్చు. దీంతో రైతులు క్రమంగా ఈ పంట సాగువైపు మొగ్గుచూపుతున్నారు. ఇలా ముందుకొచ్చే వారికి ఉద్యానవన శాఖ తరఫున అన్ని విధాలా సహకరిస్తాం. 

- అనసూయ, ఉద్యానవన శాఖ అధికారి, ఖమ్మం జిల్లా 


logo