గురువారం 29 అక్టోబర్ 2020
Agriculture - Sep 24, 2020 , 00:09:26

కాసుల కాజూ

కాసుల కాజూ

‘జీడి పప్పు’ అనేక పోషక విలువలున్నది. బ్రెజిల్‌లో పుట్టినా.. భారతీయులకు ఎంతో ప్రీతిపాత్రమైంది.  తిరుపతి లడ్డూ మొదలుకొని, స్వీటూ.. హాటూ అనే తేడాలేకుండా అన్నిరకాల వంటల్లోకి వచ్చి చేరింది. ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలుచేస్తున్న కాజూ.. ఇప్పుడు కర్షకుల ఇంట కాసులు కురిపిస్తున్నది. ఒకప్పుడు కోస్తా ప్రాంతానికే పరిమితమైనా, నేడు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ విరగ కాస్తూ అన్నదాతల జేబులు నింపుతున్నది. 

దేశంలో సాగు అవుతున్న వాణిజ్య పంటలలో జీడిమామిడి ప్రధానమైనది. దేశవ్యాప్తంగా సుమారు 10.06 లక్షల హెక్టార్లలో దీన్ని సాగు చేస్తున్నారు. ఏటా 7.5 లక్షల టన్నులకుపైగా దిగుబడి వస్తున్నది.  కాజూ ఎగుమతుల్లో మనదేశమే అగ్రగామి. కానీ, భారతీయుల అవసరాలకూ, ఎగుమతులకూ తగ్గట్లుగా ఉత్పత్తి మాత్రం జరగడం లేదు. ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకొని, ప్రాసెసింగ్‌ చేసుకోవాల్సి వస్తున్నది. దీంతో, జీడి మామిడిని అధికంగా సాగుచేసేలా  రాష్ట్ర ప్రభుత్వం  రైతులను ప్రోత్సహిస్తున్నది. జీడి మామిడి సాగుకు ఇసుక నేలలు, ఎర్ర నేలలు, గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. అధిక ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం, వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో విరివిగా పండుతుంది. దిగుబడి మాత్రమే కాదు, మొక్కలను కూడా సీజన్‌లోనే నాటాల్సి ఉంటుంది. ఒక్కసారి నాటిన తర్వాత 25 నుంచి 30 ఏండ్ల దాకా అవి కాస్తూనే ఉంటాయి. కాబట్టే, మొక్కల ఎంపికతోపాటు.. నాటే సమయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏడాదిన్నర వయసు కలిగిన నాణ్యమైన మొక్కలను ఎంపిక చేసుకొని, జూన్‌-జూలై నెలలో మొదటి వర్షాల తర్వాత నాటితే మంచిది. ఇందుకోసం ఒక్కో మొక్క నడుమ ఏడు మీటర్ల దూరం ఉండేలా, ఒక ఎకరం పొలంలో 80 మొక్కల దాకా నాటుకునేలా గుంతలను తవ్వుకోవాలి. ఇందులో సేంద్రియ ఎరువులు వేసి, ఆ తర్వాత మొక్కలను నాటుకోవాలి.

యాజమాన్య పద్ధతులు:  మొక్కలు నాటిన మొదటి రెండేండ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత రైతుదే. పంటకు సరిపడా నీరు పెట్టేందుకు వ్యవసాయ క్షేత్రంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. బిందు సేద్యం ద్వారా దాదాపు 60 శాతం నీటిని ఆదా చేసుకోవచ్చు. చెట్లు పూతకు వచ్చిన తర్వాత డిసెంబర్‌ నుంచి మార్చి వరకూ నాలుగు రోజులకు ఒకసారి నీరు పెడితే సరిపోతుంది. ఆ తర్వాత నీటి తడులను నిలిపివేయాలి. మొదటి సంవత్సరం సేంద్రియ ఎరువులను మాత్రమే వేయాలి. రెండో సంవత్సరం నుంచి సేంద్రియ ఎరువులతోపాటు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు తగిన మోతాదులో రసాయన ఎరువులనూ వేసుకోవచ్చు. ఐదేండ్ల తర్వాత ఒక్కో చెట్టుకు ఒక కిలో నత్రజని, 125 గ్రా. భాస్వరం, 125 గ్రా. పొటాష్‌.. మూడూ కలిపి రెండు దఫాలుగా వేయాలి. ఇందుకోసం చెట్టు మొదలు నుంచి ఒకటిన్నర మీటరు దూరంలో చుట్టూ 15 సెం.మీ వెడల్పు, లోతుతో కాలువలా తవ్వాలి. అందులో ఎరువులను వేసి, పైనుంచి మట్టి కప్పాలి. జూన్‌-జూలై నెలల్లో ఒక సగం, సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలల్లో మరోసగం వేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నాయి. 

పూత - కాత

జీడిమామిడి కాయలు భిన్నంగా ఉంటాయి. మామూలు పండ్లలో గింజలు/పిక్కలు కాయలోపల ఉంటే, ఇందులో మాత్రం కాయకు కింద వేలాడుతూ కనిపిస్తాయి.  పైన ఉండే పండ్లను పలురకాల ఔషధాలు, పండ్ల రసాల్లో వాడుతుంటారు. కింద ఉండే పిక్కల్లోనే జీడి పప్పు లభిస్తుంది. జీడి మామిడిలో సాధారణంగా జనవరి - ఫిబ్రవరి మధ్యలో పూత మొదలవుతుంది. మొదటి రెండు సంవత్సరాల్లో వచ్చిన పూతను తొలగించాలి. మూడో సంవత్సరం నుంచి వచ్చేది, కాతకు అనుకూలంగా ఉంటుంది. జీడిమామిడి చెట్టు రెండు మూడు దఫాలుగా పూతకు వస్తుంది. ఇందులో మధ్యస్థ దశలో పూత ఎక్కువగా వచ్చి, అధిక దిగుబడిని ఇస్తుంది. పూత నుంచి కాత దాకా సుమారు మూడు నెలల సమయం పడుతుంది. ఈ సమయంలో క్రమం తప్పకుండా నీరు పెడితే, కాయతోపాటు గింజ సైజు కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. చెట్టు వయసు పెరుగుతున్న కొద్దీ దిగుబడి కూడా ఎక్కువ అవుతుంది. పదేండ్ల తర్వాత ఒక్కో చెట్టు నుంచి సరాసరి 10 కిలోల కన్నా ఎక్కువగా దిగుబడి వస్తుంది. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులను బట్టి, కాయలు కోసే సమయం ఆధారపడి ఉంటుంది. చెట్టు నుంచి కింద పడిపోయిన జీడి మామిడి కాయలనూ, బాగా పండిన జీడి పండ్లనూ తెంపిన తర్వాత, జీడి పిక్కలను వేరు చేయాలి. 

సరికొత్తగా ‘సాగు’తూ

హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి ఉజురుమర్తి వెంకటేశ్వర్‌ రావు సేంద్రియ వ్యవసాయంలో నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉద్యోగరీత్యా అనేక దేశాల్లో పర్యటించిన ఆయన, ఆయా ప్రాంతాల్లోని పంటలు, వాటి పట్ల అక్కడి ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలను నిశితంగా గమనించారు. మనదేశంలో పండ్ల సాగులో రసాయనాల వినియోగం, వాటిని పండించేందుకు ఉపయోగిస్తున్న ప్రమాదకరమైన పదార్థాలు, వాటివల్ల కలిగే అనర్థాల గురించి ఎంతో కలత చెందారు. ఉద్యోగ విరమణ తర్వాత, సేంద్రియ సాగులోకి అడుగుపెట్టారు. జహీరాబాద్‌ సమీపంలోని 50 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మామిడి తోటలు వేశారు. కూరగాయలు సాగు చేస్తున్నారు. అయితే, 12 ఎకరాలు మాత్రం ఎర్రరాయి నేల కావడంతో వేరే పంటకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో ఆ భూమిలో జీడి మామిడి సాగుకు శ్రీకారం చుట్టారు. ఎకరానికి 80 మొక్కల చొప్పున మొత్తం 960 మొక్కలు నాటారు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం నర్సరీ నుంచి ఒక్కో మొక్కకు రూ.60 చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు. సేంద్రియ ఎరువులు వాడుతూ, బిందు సేద్యం ద్వారా జీడి మామిడి పండిస్తున్నారు. మొదటి సంవత్సరం ఎకరానికి రూ.50 వేల చొప్పున రూ.6 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. రెండో సంవత్సరం నుంచి సేంద్రియ ఎరువుల తయారీ, కూలీల కోసం 12 ఎకరాలకు కలిపి రూ.80వేల దాకా పెట్టుబడి పెడుతున్నారు. మొక్కలు నాటిన మూడేండ్ల నుంచీ కాత వస్తున్నది.  

తోట వద్దే అమ్మకాలు

జీడిమామిడికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. పంట అమ్మకం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. వ్యాపారులే వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి, కాయలు చెట్టుపై ఉన్న సమయంలోనే కొనుగోలు చేస్తుంటారు. జహీరాబాద్‌లో వెంకటేశ్వర్‌ రావు పండిస్తున్న జీడిపప్పును ముంబై, తూర్పుగోదావరి, బీదర్‌ల నుంచి వచ్చే వ్యాపారులు ఎక్కువగా తీసుకెళ్తున్నారు. క్వింటాలుకు రూ.7వేల చొప్పున చెల్లిస్తున్నారు. ఏడాదికి నాలుగు టన్నుల నుంచి ఐదు టన్నుల దాకా దిగుబడి సాధిస్తున్నారు. సేంద్రియ పంట కావడంతో వ్యాపారులు కూడా మంచి ధర చెల్లిస్తున్నారు. జీడి పప్పును పిక్కలతో సహా వ్యాపారులకే విక్రయిస్తుండగా, పండ్లను స్థానికులకు ఇచ్చేస్తున్నారు. ఇలా సంవత్సరానికి రూ.4 లక్షల దాకా ఆదాయం పొందుతున్నారు. 

‘యూవీ’తో శుద్ధి

 చెట్టు నుంచి జీడి గింజలను కోసిన తర్వాత ఎండలో ఆరబెట్టాల్సి ఉంటుంది. జీడి మామిడి సాగు చేసే ప్రతి ఒక్కరూ ఇదే పద్ధతిని అవలంబిస్తారు. కానీ, వెంకటేశ్వర్‌ రావు మాత్రం సరికొత్తగా యూవీ కిరణాల సాయంతో విత్తనాలను శుద్ధి చేస్తున్నారు. దీనివల్ల జీడి పప్పుపై ఎలాంటి ఫంగస్‌ రాకుండా ఉంటున్నది. ఇందుకోసం ఒక ప్రత్యేక గదిలో జీడి గింజలను ఉంచి, వాటిపై 15 నుంచి 20 నిమిషాల దాకా యూవీ కిరణాలను ప్రసరింపజేస్తారు. ఇలా నాలుగు రోజులు చేస్తే, ఎన్ని రోజులైనా గింజలు బూజు పట్టకుండా, ఎంతో నాణ్యతగా ఉంటాయి. 

సస్య రక్షణ

జీడి మామిడి చెట్లకు చీడపీడల సెగ ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా కాండం తొలుచు పురుగు, వేరు తొలుచు పురుగు, చిగురునూ పుష్ప గుచ్ఛాలనూ ఆశించే టీ దోమ.. పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. వీటితోపాటు ఆకు, పూత గూడు కట్టే పురుగు, తామర పురుగులు, పిండి నల్లి మొదలైనవి కూడా దాడి చేస్తాయి. వీటి నివారణ కోసం అధికారుల సూచనలు పాటిస్తూ సస్య రక్షణ చర్యలు చేపట్టాలి. ఏమాత్రం అశ్రద్ధ వహించినా పంట నాశనం అయినట్టే. కాబట్టి రైతు జాగ్రత్తగా ఉండాలి. 

ప్రోత్సాహం బాగున్నది..

12 ఏండ్ల క్రితం జీడి మామిడి సాగు మొదలుపెట్టా. అప్పట్లో ఇక్కడ ఏ పంటా పండదనీ, సమయం వృథా చేసుకోవద్దని ఎంతోమంది చెప్పారు. అయినా పట్టుదలతో ముందుకు సాగాను. సేంద్రియ ఎరువులు మాత్రమే వాడుతూ అధిక దిగుబడి సాధిస్తున్నాను. పంటలో నాణ్యత వల్ల మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. సీఎం కేసీఆర్‌ వాణిజ్య పంటలను సాగు చేసే రైతులను ప్రోత్సహించడం సంతోషకరం. - వెంకటేశ్వర్‌ రావు, రైతు


logo