శుక్రవారం 30 అక్టోబర్ 2020
Agriculture - Sep 17, 2020 , 00:04:40

వేరుశనగ వేసేద్దాం

వేరుశనగ వేసేద్దాం

వేరు శనగ (పల్లీ) సాగు చేయాలనుకునే రైతులకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. సెప్టెంబర్‌ మధ్య నుంచి విత్తనాలను వేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగానే నేలను మెత్తగా దున్నుకొని, చదును చేయించాలి. దుక్కిలోనే 4.5 టన్నుల పశువుల ఎరువు, 100 కిలోల సింగిల్‌ ఫాస్ఫేట్‌, 33 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, 20 కిలోల యూరియాను చల్లుకోవాలి. 

విత్తన శుద్ధి 

ఎకరం పొలంలో 65 నుంచి 80 కిలోల పల్లి విత్తనాలను విత్తుకోవాల్సి ఉంటుంది. కిలో విత్తనానికి 1గ్రా. టెబుకొనజోల్‌ లేదా 10 గ్రా. ట్రైకోడెర్మావిరిడే జీవశిలీంద్ర నాశనిని కలుపుకొని, విత్తన శుద్ధి చేసుకోవాలి. 

విత్తుకోవడం


వేరు శనగ విత్తేసమయంలో మొక్కల మధ్య సరైన దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక చదరపు మీటరుకు 44 మొక్కలు ఉండేలా చూసుకోవాలి. ఒక్కో సాలు మధ్య 23 సెంటీ మీటర్లు, మొక్కల మధ్య 10సెంటీ మీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తనాలు వేసిన 48 గంటల్లోపు అలాక్లోర్‌ 50 శాతం ఈసీ, 1.5 నుంచి 2 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సస్యరక్షణ చర్యలు పూత దశలో ఉన్న వేరుశనగ పంటలో ఎకరానికి 10 నుంచి 15 కిలోల యూరియా వేసుకోవాలి. ఊడలు దిగే సమయంలో ఎకరానికి 200 కిలోల జిప్సంను మొదళ్ల దగ్గర వేసి, మట్టిని పైకి ఎగదోయాలి. 

  • లద్దె పురుగు ఆశిస్తే, మొదటి దశ లార్వాలను నివారించేందుకు 5 శాతం వేపనూనె పిచికారీ చేయాలి. 
  • ఎదిగిన లార్వాలు కనిపిస్తే, 200 లీటర్ల నీటిలో 200 మి.లీ. నొవాల్యురాన్‌ లేదా 40 మి.లీ. ప్లూబెండమైడ్‌ కలుపుకొని పిచికారీ చేయాలి. 
  • లద్దె పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే, 5 కిలోల తవుడు, అర కిలో బెల్లం, 500 మి.లీ. మోనోక్రోటోఫాస్‌ లేదా క్లోరిపైరిఫాస్‌ను కలిపి విషపు ఎరను తయారు చేసుకోవాలి. దీనిని సాయంత్రం వేళలో ఎకరం పొలంలో సమానంగా చల్లుకోవాలి. 
  • ఆకుమచ్చ తెగులు నివారణ కోసం లీటరు నీటికి 2 గ్రా. క్లోరోథలోనిల్‌ లేదా 1 మి.లీ టెబుకొనజోల్‌ కలిపి మొదళ్లు తడిచేలా పిచికారీ చేయాల్సి ఉంటుంది. 
  • రసం పీల్చే పురుగు గమనిస్తే 200 లీటర్ల నీటిలో థయోమిథాక్సామ్‌ 100 గ్రా. లేదా అసిటామిప్రిడ్‌ 60 గ్రా. లేదా ప్రొఫెనోపాస్‌ 400 మి.లీ. కలిపి ఎకరం పొలంలో పిచికారీ చేయాలి.
  • కాండం కుళ్లు తెగులు ఆశిస్తే లీటరు నీటికి 2 మి.లీ హెక్సాకొనజోల్‌ లేదా ఒక మి.లీ టెబుకొనజోల్‌ కలిపి పిచికారీ చేయాలి.