మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Agriculture - Sep 03, 2020 , 02:58:42

‘ఆక్వా’లో అద్భుతం.. ఆర్‌ఏఎస్‌ విధానం..

‘ఆక్వా’లో అద్భుతం.. ఆర్‌ఏఎస్‌ విధానం..

సాగునీటి వసతి అంతగా లేని ప్రాంతాల్లో సంప్రదాయ పంటలు పండించడమే గగనం. అలాంటిది చేపల పెంపకం అంటే.. మన ఊహకే అందనంత కష్టం. కానీ.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఓ రైతు. తన వ్యవసాయ క్షేత్రంలోని బోరు నీటితోనే మత్స్య సిరులను కురిపిస్తున్నాడు. కేవలం పావు ఎకరంలో ఏడాదికి 70 టన్నుల దిగుబడి సాధిస్తూ.. ఔరా అనిపిస్తున్నాడు. చేపల పెంపకంలో తాను చేస్తున్న అద్భుతాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి ఔత్సాహికులు తరలివస్తుండగా.. అందరికీ అవగాహన కల్పిస్తున్నాడు. అతనే మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం గుండేడ్‌ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు.. విశ్వనాథ రాజు. 

హైదరాబాద్‌ - బెంగళూరు జాతీయ రహదారిపై బాలానగర్‌ మండల కేంద్రం నుంచి 5 కి.మీ. దూరంలోని గుండేడ్‌ గ్రామంలో విశ్వనాథరాజు పొలం ఉన్నది. చుట్టుపక్కల ఎలాంటి నదులు, వాగులు, చెరువులు, సాగు నీటి కాలువలు కూడా కానరావు. పొలం పండాలంటే బోరు ఒక్కటే దిక్కవుతుంది. లేకుంటే వర్షాలు పడితేనే సాగు చేయాల్సి ఉంటుంది. తనకున్న 15 ఎకరాల పొలంలో మొదట్లో వివిధ రకాల పంటలు పండించి అద్భుతమైన దిగుబడి సాధించాడు విశ్వనాథ రాజు. ఆదర్శ రైతుగా అనేక అవార్డులు అందుకున్నాడు. కానీ, వడగండ్లతో రూ.30 లక్షల విలువైన ద్రాక్ష పంట నష్టపోయాడు. అప్పటి నుంచి వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాడు. కొద్దిపాటి నీటితోనే చేపల పెంపకంతోపాటు అదే నీటిని వ్యవసాయానికి ఉపయోగపడేలా ప్రయోగాత్మకంగా 2012లో ‘ఆక్వాఫోనిక్స్‌' విధానంలో చేపల పెంపకాన్ని ప్రారంభించాడు. అయితే లాభాలు పక్కనపెడితే.. రూ.18 లక్షల దాకా నష్టాలు చవిచూశాడు. దీంతో ఆ విధానానికి స్వస్తి పలికి, ‘రీసర్క్యులేటింగ్‌ ఆక్వా కల్చర్‌ సిస్టం’ (ఆర్‌ఏఎస్‌) పద్ధతికి శ్రీకారం చుట్టాడు. 


ఏమిటీ ఆర్‌ఏఎస్‌..?

వ్యవసాయ దృక్పథంతో ఏ జంతువునైనా.. పక్షినైనా పెంచుకునే క్రమంలో వాటి మలమూత్రాలను శుభ్రం చేయడం తప్పనిసరి. కానీ, చేపల మల మూత్రాలు మాత్రం చెరువులోనే ఉండిపోతాయి. అవి కుళ్లిపోయి క్రమంగా అమ్మోనియా, ఇతర బ్యాక్టీరియాలు ఉత్పత్తవుతాయి. కొన్ని రోజులకు చేపలపైనే దాడి చేసి, నష్టపరుస్తాయి. నదులు, సముద్రాల విస్తీర్ణం ఎక్కువ కాబట్టి, ఈ వ్యర్థాల వల్ల ఎలాంటి హానీ కలుగదు. మరోవైపు చేపల చెరువుల్లో ఇతర జీవులు లేకుండా చూసేందుకు చాలామంది పెంపకందారులు రసాయన మందులు వాడుతుంటారు. దీని వల్ల చేప నాణ్యత తగ్గుతుంది. వాటిని తిన్నవారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా దేశాలు, మన దేశంలోని పలు రాష్ర్టాలు కొన్ని రకాల చేపలను నిషేధిస్తుంటాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికే శాస్త్రవేత్తలు పలు ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టారు. చెరువులో వ్యర్థాలు, రసాయనాలు లేకుండా చేపలను ఉత్పత్తి చేసే విధానమే ‘రీసర్క్యులేటింగ్‌ ఆక్వా కల్చర్‌ సిస్టమ్‌(ఆర్‌ఏఎస్‌)’. ఈ విధానంలో తక్కువ భూమిలో ఎక్కువ చేపలను పెంచుకోవచ్చు. ఇందులో భాగంగా ఓ షెడ్డు నిర్మించుకుని అందులో ఓపెన్‌ ట్యాంకులను ఏర్పాటు చేస్తారు. ఆ ట్యాంకుల్లో నీటిని నింపి చేపలను పెంచుతారు. మామూలు చెరువుల్లోనైతే చలికాలంలో చేపల పెరుగుదల తగ్గిపోతుంది. ఎండాకాలంలో చేపలు చనిపోతాయి. దీనికి వాతావరణంలోని ఉష్ణోగ్రతల్లో తేడానే కారణం. ఇక్కడ అలాంటి సమస్య లేకుండా చేపలకు అవసరమైన మేర 365 రోజులపాటు నియంత్రిత ఉష్ణోగ్రత (28 డిగ్రీలు) అందిస్తారు. నీటిని నిరంతరం శుద్ధి చేసేందుకు ఓజోన్‌, యూవీ కిరణాలను వినియోగిస్తారు. ఫలితంగా నీటిలో బ్యాక్టీరియా నాశనం అవుతుంది. చేపలకు కావాల్సిన హీహెచ్‌, సమయానికి తగినట్లుగా ఆహారం, కావాల్సినంత ఆక్సిజన్‌ సరఫరా చేస్తారు. దీంతో చేపలు అత్యంత ఆరోగ్యంగా పెరుగుతాయి. చేపల వ్యర్థాలను వేరు చేసేందుకు ప్రత్యేకమైన బయో ఫిల్టర్‌ ఏర్పాటు చేస్తారు. వేరుచేసిన వ్యర్థాలను పంటలకు ఎరువుగానూ వినియోగిస్తారు. రసాయనాలు లేకుండా, అత్యంత అనుకూల వాతావరణంలో పెంచడం వల్ల చేపలు ఎంతో ఆరోగ్యంగా.. రుచికరంగానూ ఉంటాయి. 

పావు ఎకరంలో 70 టన్నులు..

విశ్వనాథ రాజు కేవలం పావు ఎకరంలో ఆర్‌ఏఎస్‌ విధానం ద్వారా చేపల పెంపకం చేపడుతున్నాడు. ఇందుకోసం ఓ షెడ్డులో 12 ట్యాంకులను నిర్మించారు. చేపల వ్యర్థాలను వేరు చేసేందుకు ప్రత్యేక డ్రమ్‌ ఫిల్టర్‌ను ఏర్పాటు చేశారు. అన్ని నిర్మాణాలను కలుపుకొని రూ.1.5 కోట్ల దాకా ప్రారంభ పెట్టుబడి పెట్టారు. తిలాపియా, అమూర్కర్క్‌, మార్పులు, పండుగప్ప, ఫంగీషియస్‌తోపాటు సముద్రపు చేపలను కూడా ఇక్కడ పెంచుతున్నారు. మార్కెటింగ్‌కు ఇబ్బంది లేకుండా హైదరాబాద్‌లోని శంకర్‌పల్లిలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. కిలో చేపలను కనీసం రూ.500కు విక్రయిస్తారు. మామూలు చేపలు రూ.150కే కిలో లభిస్తుండగా.. విశ్వనాథ రాజు పెంచిన చేపలను అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు వినియోగదారులు. ఇవి రసాయన రహితంగా పెంచినవి కావడమే అందుకు కారణం. ఈ చేపలను ఒకసారి రుచి చూసినవారు మళ్లీ మళ్లీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విధానం ద్వారా ఏటా సుమారు 70 టన్నుల చేపలను ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో సుమారు రూ.1.5 కోట్ల టర్నోవర్‌ సాధిస్తూ.. రూ.70 లక్షల దాకా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 


క్షేత్రంలో సదస్సులు..

ఆర్‌ఏఎస్‌ పద్ధతిపై అవగాహన కోసం దేశవిదేశాల నుంచి ఔత్సాహికులు, పలువురు వీఐపీలు విశ్వనాథ రాజు క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. వారి కోసం ప్రతి నెలా 15వ తేదీన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాడు రాజు. వీరిలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ర్టాల మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు, విదేశాల ప్రతినిధులు, ఇతర రాష్ర్టాల నుంచి యువకులు పెద్ద సంఖ్యలో ఉంటారు. వారందరికీ ఉచితంగా చేపల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా అందుబాటులో ఉంటున్నారు. తాను పాటించే ఆధునిక పద్ధతులను ఫొటోలు, వీడియోల రూపంలో ఆన్‌లైన్‌ ద్వారా పంచుకుంటున్నారు. వ్యక్తిగత ఫేస్‌బుక్‌ అకౌంట్‌తోపాటు, ‘క్రావీస్‌ ఆక్వా’ పేరుతో ఫేస్‌బుక్‌ పేజీని నిర్వహిస్తున్నారు. తక్కువ నీటితో లాభదాయకంగా చేపలను ఉత్పత్తి చేసే విధానాన్ని వీడియో తీసి యూట్యూబ్‌ ద్వారా ఇతరులకు తెలియజేస్తున్నారు. 

దేశంలోనే తొలిసారిగా.. 

విదేశాల్లో 30 ఏళ్ల నుంచే ఆర్‌ఏఎస్‌ పద్ధతిలో చేపలు పెంచుతూ, మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఆఫ్రికాలోని బెనిన్‌లో తొలిసారిగా ఈ విధానాన్ని చూశా. దీనిపై సుదీర్ఘ పరిశోధన చేసి, 2016లో దేశంలోనే తొలిసారిగా ఆర్‌ఏఎస్‌ పద్ధతిలో చేపల పెంపకాన్ని ప్రారంభించా. మంచి దిగుబడి వస్తున్నది. మన దగ్గర చేపలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. స్థానిక మార్కెట్లోనే మంచి రేట్లకు అమ్ముతున్నా. మా క్షేత్రంలో నిత్యం సుమారు 200 కేజీల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. ఏడాదికి 70 టన్నుల దిగుబడి వస్తున్నది. కేవలం పావు ఎకరంలోనే అంత చిన్న బోరు సాయంతో ఇన్ని చేపలు పెంచడమంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ, అదంతా సాధ్యమేనని తెలుసుకుని చాలామంది ఈ పద్ధతిలో చేపల పెంపకం ప్రారంభించారు. ఇంటి వద్ద కనీసం 100 గజాల స్థలం ఉన్నా, ఆర్‌ఏఎస్‌ విధానంలో చేపలు పెంచుకోవచ్చు. సంప్రదాయ పద్ధతిలో కోటి లీటర్ల నీటిలో 3 వేల చేపలను పెంచితే, ఆర్‌ఏఎస్‌ విధానం ద్వారా 50 వేల లీటర్ల నీటిలో 3 వేల చేపలను పెంచొచ్చు. ఈ విధానంలో చేపలు పెంచేవారికి ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రుణాలు కూడా అందిస్తున్నది.                                                                                      - విశ్వనాథ రాజు, ఆదర్శ రైతు.


logo