మంగళవారం 02 మార్చి 2021
Agriculture - Sep 03, 2020 , 02:59:23

ఆహా.. ఆలుగడ్డ

ఆహా.. ఆలుగడ్డ

అందానికీ, ఆరోగ్యానికే కాదు, అన్నదాతకు ఆదాయం తీసుకురావడంలోనూ ‘ఆలుగడ్డ’ మొదటి స్థానంలోనే ఉన్నది. ఆహార పదార్థంగానే కాకుండా, సౌందర్య సాధనంగానూ ఉపయోగపడే ‘ఆలు’కు మార్కెట్‌లో ఎప్పటికీ డిమాండ్‌ ఉంటుంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ‘బంగాళ దుంప’.. బంగారంలా పండుతున్నది. వరి, గోధుమ, మొక్కజొన్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సాగయ్యే ‘ఆలుగడ్డ’.. కర్షకుల ఇంట కనకవర్షం కురిపిస్తున్నది. 

ఆలుగడ్డ సాగులో విత్తన ఎంపిక ఎంతో ప్రధానమైనది. ఎక్కువగా ఉత్తర్‌

ప్రదేశ్‌, పంజాబ్‌లో మేలు రకం విత్తనాలు లభిస్తున్నాయి. అందులో అనేక రకాలున్నాయి. కానీ, తెలంగాణ వాతావరణానికి అనుకూలంగా ఉండి, ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకునేలా సిమ్లాలోని కేంద్రీయ బంగాళదుంప పరిశోధన సంస్థ ‘కుఫ్రిసూర్య’ రకాన్ని తయారు చేసింది. ఆలుగడ్డను అక్టోబరు నుంచి నవంబరు వరకు నాటుకోవచ్చు. ఇందుకోసం దుక్కిని రెండుమూడుసార్లు దున్నాలి. 30-40 గ్రాముల బరువున్న, మొలకలు వచ్చిన దుంపలను మాత్రమే విత్తుకోవాలి. దుంపల మధ్య కనీసంగా 20 సెంటీ మీటర్ల దూరం ఉండాలి. గుల్లగా ఉండి, కర్బన పదార్థాలు ఎక్కువగా ఉండే నేలల్లో ఆలుగడ్డ బాగా పెరుగుతుంది. 

ఉష్ణోగ్రతలు కూడా.. 

ఆలుగడ్డ సాగులో ఉష్ణోగ్రతలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇది సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లోని పంట. ఉత్తర భారతదేశంలోనే దీని సాగు ఎక్కువ. మన రాష్ట్రంలోనూ మెదక్‌, సంగారెడ్డి, రంగారెడ్డి ప్రాంతాల్లో భారీగానే సాగవుతున్నది. దేశంలో మొత్తం ఆలుగడ్డ సాగులో తెలుగు రాష్ర్టాల వాటా కేవలం 0.1శాతం మాత్రమే. పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు, రాత్రి ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల వరకు ఉండాలి. అయితే కొత్తరకం ‘కుఫ్రీసూర్య’ ఉష్ణోగ్రతలు ఎక్కువైనా తట్టుకుంటుంది.