బుధవారం 30 సెప్టెంబర్ 2020
Agriculture - Sep 03, 2020 , 02:59:49

‘సాగు’ సలహాలు..

 ‘సాగు’ సలహాలు..

  • ప్రస్తుతం వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకే అవకాశం ఉన్నది. తొలిదశ వ్యాప్తి నివారణ కోసం మడిలో మురుగునీటిని తీసివేసి, 0.4 గ్రా. అగ్రిమైసిన్‌ లేదా 0.2 గ్రా. ప్లాంటోమైసిన్‌ మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 
  • తాటాకు తెగులు నివారణకు 2 మి.లీ. ప్రొఫినోఫాస్‌ లేదా 2.5 మి.లీ. క్లోరిఫైరిఫాస్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 
  • కాండం తొలుచు పురుగు ఆశిస్తే ఎకరం పొలంలో 10 కిలోల కార్బోఫ్యూరాన్‌ 3జీ గుళికలు లేదా 4 కిలోల ఫోరేట్‌ గుళికలను నాటు వేసిన 15 నుంచి 20 రోజుల తర్వాత వేసుకోవాలి.

మక్కజొన్న


  • పలు ప్రాంతాల్లో మక్కజొన్నలో కత్తెర పురుగు ఆశిస్తున్నది. దీని నివారణకు విషపు ఎర తయారుచేసుకోవడానికి 10 కిలోల వరి తవుడులో 2 కిలోల బెల్లం కలిపి, 2 నుంచి 3 లీ. నీటిని చేర్చాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 24 గంటల పాటు పులియనిచ్చి, మరుసటి రోజున 100 గ్రా. థైడికార్బ్‌ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్క సుడులలో వేసుకోవాలి. 
  • ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మక్కజొన్నలో ఎర్వీనియా ఎండు తెగులు ఆశించేందుకు అనుకూలం. దీని నివారణకు 100 కిలోల వేప పిండి, 4 కిలోల బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపి పొలమంతా చల్లుకోవాలి.

పత్తి


  • పత్తిలో నల్లమచ్చ తెగులు సోకే ప్రమాదమున్నది. దీని నివారణ కోసం 30 గ్రా. కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌, 1 గ్రా. ప్లాంటోమైసిన్‌ మందును పది లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. 
  • ఆకుమచ్చ తెగులు, రసంపీల్చే పురుగు నివారణకు 1గ్రా.కార్బెండజిమ్‌, 1.5 గ్రా. ఎసిఫేట్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
  • ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తిలో గూడు, పూత రాలే అవకాశం ఉన్నది. దీని నివారణ కోసం 2 మి.లీ. ప్లానోఫిక్స్‌ మందును పది లీటర్ల నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

కంది

  • కందిలో పైటోఫ్తోరా ఎండు తెగులు ఆశించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయి. తెగులు గమనించిన చోట 3గ్రా. కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ మందును ఒక లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లను పూర్తిగా తడపాలి.
  • ఆకుమచ్చ తెగులు నివారణకు 1గ్రా. కార్బెండజిమ్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


logo