బుధవారం 30 సెప్టెంబర్ 2020
Agriculture - Aug 19, 2020 , 22:59:22

అల్లం.. ఆదాయం

అల్లం.. ఆదాయం

అల్లం.. ప్రతి ఇంట్లో ఉండాల్సిన, ప్రతి వంటలో వాడాల్సిన సుగంద ద్రవ్యం. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టే, రోగ నిరోధకశక్తిని బలోపేతం చేసే దివ్యౌషదం. మనిషిలో ఆకలిని పెంచే ఈ అద్భుత పదార్థం, ఇప్పుడు అన్నదాతలకు అధిక లాభాలు తెచ్చిపెడుతున్నది. ప్రతి ఒక్కరికీ నిత్యావసరమైన ‘అల్లం’ పంటను సాగు చేయడం వల్ల రైతులకు మంచి ఆదాయం సమకూరుతున్నది. దీని కోసం పెట్టుబడి కాస్త ఎక్కువే అయినా, దిగుబడి కూడా ఆదే స్థాయిలో వస్తున్నది. 

మేలైన విత్తనంతోనే.. 

ఏ పంటలో అయినా విత్తనం ఎంపిక అనేది ముఖ్యమైనది. ఎంత మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకుంటే, అంత మంచి దిగుబడి ఉంటుంది. అల్లం సాగులోనూ రెండు రకాలు అనుకూలంగా ఉంటాయి. అందులో ఒకటి ‘మారన్‌' రకం కాగా, ఇది కేరళలో లభిస్తుంది. రెండోది మహారాష్ట్రలో దొరికే ‘మహిమా’ రకం. ఈ రెండు రకాలూ తక్కువ కాలంలోనే ఎక్కువ దిగుబడి అందిస్తున్నాయి. రైతులు ప్రతిసారీ ఇతర రాష్ర్టాలకు వెళ్లి విత్తనం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కొనుగోలు చేసిన విత్తనం ద్వారా పండించిన పంట నుంచే కొత్త విత్తనాల్ని ఎంపిక చేసుకోవచ్చు. అవసరం ఉన్న ఇతర రైతులకూ వీటిని విక్రయించవచ్చు. అయితే విత్తనం సేకరించే ముందు ఆ పంటకు ఎలాంటి చీడపీడలు లేకుండా చూసుకోవాలి. బలమైన దుంపలనే విత్తనాల కోసం ఎంపిక చేసుకోవాలి. వీటిలో దుంపకుళ్లు నివారణ కోసం లీటరు నీటిలో 3 గ్రా. రిడోమిల్‌ ఎంజడ్‌ లేదా 3 గ్రా. మాంకోజెబ్‌, 5 మి.లీ. మలాథియాన్‌ చొప్పున కలిపి, ఆ ద్రావణంలో అల్లం విత్తన దుంపలను 30 నుంచి 40 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత దుంపలను తీసి, నీడలో ఆరబెట్టుకోవాలి. మొలకొచ్చిన దుంపలను సుమారు 20 నుంచి 25 గ్రాముల బరువు ఉండేలా ముక్కలు చేసుకుని విత్తుకోవాలి. 

ఎత్తుమళ్ల విధానం బెస్ట్‌.. 

అల్లం సాగులో ఎత్తుమళ్ల విధానం మంచిది. విత్తనం పెట్టే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అల్లం నాటే సమయంలో ఒక్కో వరుస మధ్య 5 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా మొక్కకు మొక్కకు మధ్య 9 అంగుళాల దూరం ఉంచాలి. నీటి పారుదల, మురుగునీటి పారుదల కోసం ఒక్కో వరుస పక్కన కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. తోటలో వర్షపు నీరు, సాగు నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోయేలా చర్యలు చేపట్టాలి. అల్లం విత్తనాన్ని ఏప్రిల్‌ నుంచి జూన్‌ నెలాఖరు వరకు నాటుకోవచ్చు. ఒకసారి పంటను తవ్విన తర్వాత మరో 30 నుంచి 45 రోజుల వరకు కొత్త అల్లం పంటను వేయకూడదు. 

ఎర్ర నేలలు అనుకూలం..

అల్లం సాగుకు ఎర్ర నేలలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఇతర నేలల్లోనూ సాగు చేసుకోవచ్చు. అల్లం సాగు చేయడానికి మూడు నెలల ముందే దుక్కిని దున్ని పెట్టుకోవాలి. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సూపర్‌ ఫాస్పేట్‌ను ఆఖరి దుక్కిలో వేసి, కలియదున్నాలి. ఎత్తు మడుల్లో అల్లం నాటేటప్పుడు పచ్చి ఆకు, పచ్చిరొట్టతో మల్చింగ్‌ చేసుకోవాలి. అల్లం విత్తనాలు నాటిన తర్వాత 40 రోజులకు 26 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, 80 రోజులకు 54 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను వేయాలి. ఎరువులు వేసిన ప్రతిసారీ మట్టిని ఎగదోయాలి. మొక్కలు లేతగా ఉన్నప్పుడే కలుపు సమస్య ఎక్కువగా వస్తుంది. ఎప్పటికప్పుడు కలుపు తీస్తే మంచిది. ఇక ఈ పంటకు నీటి అవసరం కూడా ఎక్కువే. ఎండకాలంలో అయితే ప్రతిరోజూ 3 నుంచి 4 గంటలు నీరు అందించాలి. చలికాలంలో 2 గంటలు పెట్టినా సరిపోతుంది. ఇక వర్షకాలంలో వాన పడిన సందార్భాన్ని బట్టి నీరు అందించాల్సి ఉంటుంది. నీటి పారుదల కోసం డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానాన్ని అమలు చేయాలి. తద్వారా నీటి వృథా తగ్గడంతోపాటు దిగుబడి కూడా పెరుగుతుంది. 

పెట్టుబడి కాస్త ఎక్కువే..

సాధారణ పంటలతో పోలిస్తే అల్లం సాగుకు పెట్టుబడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అదే స్థాయిలో ఆదాయం కూడా వస్తుంది. పెట్టుబడిలో ఎక్కువ ఖర్చు విత్తనం కొనుగోలుకే అవుతుంది. క్వింటాలు విత్తనం కోసం రూ. 5వేల వరకు వెచ్చించాల్సి వస్తుంది. ప్రతి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల విత్తనం అవసరం అవుతుంది. కాబట్టి సుమారు రూ. 50వేల వరకు విత్తనాలకే ఖర్చవుతుంది. ఎరువులు, పురుగుల మందులు, డ్రిప్‌, దుక్కి దున్నడం, కూలీల ఖర్చులు కలిపి రూ.1.5 లక్షల దాకా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 

మార్కెటింగ్‌ ఇబ్బందే లేదు..

అల్లం మార్కెటింగ్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. కొంతమంది వ్యాపారులు పొలం వద్దకే వచ్చి పంటను కొనుగోలు చేస్తారు. వారే పంటను తవ్వుకొని మరీ తీసుకెళ్తారు. లేదంటే రైతే నేరుగా పంటను తవ్వి మార్కెట్‌లో విక్రయించే అవకాశం కూడా ఉంది. రైతు తను సొంతంగా తవ్వి విక్రయిస్తే కాస్త ఎక్కువ లాభం వస్తుంది. వ్యాపారులకు గుత్తకు ఇస్తే రేటు తగ్గుతుంది. ప్రతి సీజన్‌లోనూ అల్లానికి డిమాండ్‌ భారీగానే ఉంటుంది. కాబట్టి, సులువుగానే మార్కెటింగ్‌ చేసుకునే వీలుంది. 

సస్యరక్షణ చర్యలు.. 

ఆకుమచ్చ తెగులు : ఈ తెగులు ఆశించడం వల్ల ఆకులపై అండాకారంలో నీటిని పీల్చుకున్నట్లుగా ఉండే మచ్చలు ఏర్పడి, పెళుసుగా మారుతాయి. ఆకుల ఉపరితలంపై నల్లని మచ్చలు కూడా ఏర్పడుతాయి. దీని నివారణ కోసం లీటరు నీటికి 3మి.లీ. చొప్పున కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ కలిపి పిచికారీ చేయాలి. 

దుంపకుళ్లు తెగులు : పంటలో ఎక్కువగా నీరు నిలిస్తే ఈ తెగులు సోకే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల పంటకు అధిక నష్టం వాటిల్లుతుంది. ఎకరానికి 10 నుంచి 12 క్విటాళ్ల దిగుబడిని తగ్గిస్తుంది. ఈ తెగులు నివారణ కోసం లీటరు నీటిలో 5గ్రా. మెటలాక్సిల్‌ లేదా 5గ్రా. మాంకోబెజ్‌ కలుపుకొని మొక్కలపై పిచికారీ చేయాలి. 

ఆకుమాడు తెగులు : నేలకు దగ్గరగా ఉండే ఆకుల తొడిమెలపై పొడవాటి మచ్చల రూపంలో ఆకుమాడు తెగులు కనిపిస్తుంది. ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పై ఆకులకు, ఆకు తొడిమెలకు వ్యాప్తి చెందుతాయి. దీని నివారణ కోసం లీటరు నీటికి 1గ్రాము కార్బండిజం లేదా 1మి.లీ. ప్రొపికొనజోల్‌ను కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. 

మొవ్వ తొలుచు పురుగు : 

ఈ పురుగు మొవ్వను తొలచడం వల్ల కొమ్ము చనిపోతుంది. లీటరు నీటిలో 2మి.లీ. డైమిథోయేట్‌, 1మి.లీ. సాండోవిట్‌ కలిపి ఆకులపై పిచికారీ చేయడం వల్ల ఈ తెగులు నుంచి పంటను కాపాడుకోవచ్చు. 

ఆకు ముడత : 

ఈ పురుగు లార్వాలు ఆకులను చుట్టి తినేస్తాయి. లీటరు నీటిలో 3 గ్రాముల కార్బరిల్‌ లేదా 2మి.లీ. క్లోరిపైరిపాస్‌ కలిపి పిచికారీ చేస్తే ఆకు ముడత పురుగును నివారించవచ్చు. 

వేరు కత్తిరించే పురుగు :

ఈ పురుగు దుంపల మొదళ్లలోని వేరును కత్తిరిస్తుంది. దీని నివారణ కోసం ఎకరానికి 7 కిలోల కార్బోఫ్యూరాన్‌ గుళికలను వేయాలి. 

‘మోడెం’తో అధిక దిగుబడి..

అల్లం పంట ఏడు నేలల్లోనే చేతికి వస్తుంది. అయితే అల్లం సైజును బట్టి పంటను తవ్వుకోవచ్చు. లేదా మరికొన్ని రోజులు ఆగితే, అల్లం కొమ్ము మరింత పెరుగుతుంది. అప్పుడు పంటను తవ్వి అమ్ముకోవచ్చు. సాధారణంగా సాగు చేస్తే ప్రతి ఎకరానికి 100 నుంచి 120 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే, అల్లం కొమ్ము సైజు తక్కువగా ఉండి, మార్కెట్లో ధర లేనిపక్షంలో పంటను మరో 5 నుంచి 6 నెలల పాటు అలాగే ఉంచుకోవాలి. దీన్ని మోడం పద్ధతి సాగు అంటారు. ఈ విధంగా చేయడం వల్ల పాత అల్లానికి తోడు కొత్తగా మరికొన్ని కొమ్ములు వస్తాయి. తద్వారా దిగుబడి పెరుగుతుంది. ఈ విధానం ద్వారా 150 నుంచి 200 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించవచ్చు. లాభాలు భారీగానే..

అల్లం సాగుతో రైతుకు భారీగానే ఆదాయం సమకూరుతోంది. యేటా అన్ని ఖర్చులు పోగా, కనీసం రూ.2లక్షల నుంచి రూ.3లక్షల నికర ఆదాయం వస్తుంది. మార్కెట్లో కేజీ అల్లం ధర రూ.100 ఉంది అనుకుంటే, క్వింటాలుకు రూ.10వేల ఆదాయం వస్తుంది. ఎకరానికి 100 క్వింటాళ్ల దిగుబడి వస్తే, రమారమి రూ.10లక్షలు చేతికొస్తుంది. ఇందులో పెట్టుబడి ఖర్చు రూ.2లక్షలు తీసేస్తే, నికరంగా రూ.7లక్షల నుంచి రూ.8 లక్షల ఆదాయం సమకూరుతుంది. ఒకవేళ మార్కెట్లో ధర రూ.50 పిలికినా రూ.3 లక్షల నుంచి రూ.4లక్షల ఆదాయం ఎటూ పోదు. ఒకవేళ దిగుబడి తగ్గినా, కనీసంగా రూ.2లక్షల ఆదాయం వస్తుంది.


logo