గురువారం 25 ఫిబ్రవరి 2021
Agriculture - Aug 12, 2020 , 23:33:40

‘ప్రకృతి’తో సాగుతూ!

‘ప్రకృతి’తో సాగుతూ!

  • సేంద్రియ వ్యవసాయంలో రాణిస్తున్న రఘునందన్‌
  • ‘బతుకు.. ఇతరులను బతుకనివ్వు’ ఇది ప్రకృతి సూత్రం. 
  • ఈ సూత్రాన్ని మనసా, వాచా, కర్మణా నమ్మి, ధైర్యంగా ముందడుగు వేసినవారెవ్వరూ 
  • ఓడిపోరనేది జీవిత సత్యం. అది వ్యాపారమైనా, 
  • వ్యవసాయమైనా ‘ప్రకృతి’ని నమ్మి పనిచేస్తే, 
  • విజయం సాధించడం తథ్యం. ఆదర్శ రైతు 
  • ‘రఘునందన్‌ నేత’ ప్రకృతి సేద్య అనుభవాలే ఇందుకు నిదర్శనం. 

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామానికి చెందిన రఘునందన్‌, ప్రకృతి సేద్యంతో ముందుకు ‘సాగు’తున్నారు. రాళ్ల భూమిలో రత్నాలు పండిస్తూ, అందరిచేతా ఔరా.. అనిపిస్తున్నారు. రఘునందన్‌ స్వతహాగా రైతు కాదు. ఇంతకుముందు ఆయన ఓ వ్యాపారి. ఓ క్రియాశీలక రాజకీయ నాయకుడు. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో ‘అన్నదాతల ఆత్మహత్యలు’ ఆయనను కదిలించాయి. రైతుల ప్రతి‘ఫలానికి’ వేరెవరో ధర నిర్ణయించడం, కర్షకుల కష్టానికి దళారులు లాభాలు ఆర్జించడంలాంటి అనేక విషయాలు ఆయనలో అంతర్మథనాన్ని రగిలించాయి. ఆ ఆలోచనలే.. రఘునందన్‌ను అన్నదాతగా మార్చాయి. 

స్వగ్రామంలో శ్రీకారం..

రఘునందన్‌ పలు వ్యాపారాలు చేస్తూ, రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ హైదరాబాద్‌లో ఉండేవారు. వ్యవసాయంలో అధిక పెట్టుబడులు.. నష్టాలు.. రైతుల ఆత్మహత్యలు.. ఇలాంటి విషయాల గురించి ఎప్పుడూ మదన పడేవారు. ఎలాగైనా సాగులో సమూల మార్పులు తీసుకురావాలనీ, పెట్టుబడి లేని ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించి.. రైతులను లాభాల బాట పట్టించాలని అనుకున్నారు. వ్యవసాయంలో సలహాలు సూచనలు ఇవ్వడమే కాదు, స్వయంగా చేసి చూపించాలనే అన్నదాత అవతారమెత్తారు. స్వగ్రామంలో తనకున్న 12 ఎకరాల వ్యవసాయ భూమిలో ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టారు. తొమ్మిదేండ్లుగా సేంద్రియ పద్ధతుల్లో వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. వాలంతరీ (వాటర్‌ అండ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌) ద్వారా సదస్సులు నిర్వహిస్తూ సాగునీటి వినియోగం, సేంద్రియ ఎరువుల వాడకంపై సలహాలు సూచనలు అందిస్తున్నారు. పంట విధానం, పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. 

అధికారుల సహకారంతో..

సేంద్రియ సాగును ప్రతి ఒక్కరికీ దగ్గర చేయాలనే ఆలోచనతో ఉన్న రఘునందన్‌, ముందుగా హార్టికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డిని కలిశారు. తన ఆలోచనలు, లక్ష్యాలను ఆయనకు వివరించారు. ఆయన సలహా మేరకు మల్చింగ్‌, డ్రిప్‌ సిస్టమ్‌ ద్వారా సేంద్రియ సాగును ప్రారంభించారు. 365 రోజులూ వివిధ కూరగాయలు పండిస్తూ, అధిక దిగుబడి సాధిస్తున్నారు. మార్కెట్‌ను అంచనా వేస్తూ టమాట, బీర, గుమ్మడి, ఆనిగెపు కాయ, కర్బూజా(వాటర్‌ మిలన్‌), క్యాప్సికం, అరటి తదితర పంటలను సాగు చేస్తున్నారు. తన పొలంలో రెండు బోర్లు ఉన్నప్పటికీ, నీటి యాజమాన్య పద్ధతులను అవలంబిస్తూ, కేవలం ఒక బోరునే ఉపయోగిస్తున్నారు. సంగారెడ్డిలో ఏడీగా పనిచేసిన సోమేశ్‌ కుమార్‌, ప్రస్తుత ఏడీ సునీత సహకారంతో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. 


లాభాలు తెచ్చే ‘పందిరి’.. 

కూరగాయల సాగులో ‘పందిరి పద్ధతి’ ప్రధానమైనది. ఈ పద్ధతిలో పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా టమాట, బీర, ఆనిగెపు కాయను రఘునందన్‌ పందిరి సాగు ద్వారా పండిస్తున్నారు. టమాట 25 నుంచి 28 రోజుల వరకు నారు వస్తుంది. 35 నుంచి 40 రోజులలోపు పూత, 55 రోజుల నుంచి కాత మొదలవుతుంది. మామూలు పద్ధతిలో మూడు, నాలుగు సార్లకే కోత పరిమితమవుతుంది. కానీ, పందిరి సాగు ద్వారా ఎనిమిది సార్లు పంటను కోయొచ్చు. ఎకరానికి తక్కువలో తక్కువగా 25 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుంది. రఘునందన్‌ మాత్రం ప్రత్యేక మెలకువలు పాటిస్తూ, ఎకరానికి 40 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. ప్రస్తుతం రెండు ఎకరాలలో టమాటను సాగు చేస్తున్నారు. అలాగే పది గుంటల్లో బీర, మరో పది గుంటల్లో ఆనిగెపు కాయలను ‘డెమో పంటలు’గా పండిస్తున్నారు. బీర పంట 45 నుంచి 50 రోజుల్లో చేతికి వస్తుంది. మూడు రోజులకు ఒకసారి కాయల్ని కోయాల్సి ఉంటుంది. 

క్షేత్రంలో ‘సాగు’ పాఠాలు: సేంద్రియ వ్యవసాయం, లాభదాయకమైన పంటల సాగు విధానాలను తెలుసుకునేందుకు తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలతోపాటు ఒడిశా, ఝార్ఖండ్‌, ఇతర రాష్ర్టాల నుంచి రైతులు వావిలాల క్షేత్రానికి వస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ తదితర ప్రాంతాల రైతులకు ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులపై శిక్షణ ఇస్తున్నారు. ఆసక్తితో సాగులోకి అడుగుపెట్టిన ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు రఘునందన్‌ సాగు పాఠాలు నేర్పిస్తున్నారు. పల్లెల్లో పొలాలను కొనుగోలు చేసి, పంటలు పండిస్తున్నవారంతా తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడం, సరికొత్త సాగు విధానాలను తెలుసుకోవడం కోసం రఘునందన్‌ క్షేత్రానికి క్యూ కడుతున్నారు. ఇందులో పోలీసులు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారితోపాటు వీకెండ్‌ వ్యవసాయం చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కూడా ఉన్నారు. వ్యవసాయ అధికారులు నిర్వహించే సెమినార్లతోపాటు అవగాహన కార్యక్రమాల్లోనూ పాల్గొని, రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. సత్వర పరిష్కా రం కోసం కొందరు ఫోన్‌లోనూ సంప్రదిస్తున్నారు. 

- జిన్నారం

ఎరువుల తయారీ.. 

సేంద్రియ ఎరువుల్లో ముఖ్యమైనది జీవామృతం. దీని తయారీ కోసం 200 లీటర్ల నీళ్లు, 10 కిలోల ఆవుపేడ, 10 లీటర్ల ఆవుమూత్రం, 2 కిలోల శనగ/మినుము పిండి, 2 కిలోల బెల్లం, కొంచెం పొలం గట్టు మట్టి అవసరం అవుతుంది. ఈ పదార్థాలన్నింటినీ ఒక డ్రమ్ములో 48 గంటల పాటు నానబెట్టాలి. రోజుకు మూడుసార్లు ఈ ద్రావణాన్ని బాగా కలియతిప్పాలి. ఆ తర్వాత ద్రావణాన్ని వడబోసి, సీసాల్లో నిల్వ చేసుకోవాలి. ఇలా తయారైన జీవామృతాన్ని 18 లీటర్ల నీటిలో 2 లీటర్ల చొప్పున కలిపి, పంట కాలంలో నాలుగు సార్లు పిచికారీ చేయాలి. ఫలితంగా కాయతొలుచు పురుగు, రసం పీల్చే పురుగులతోపాటు పంటలను ఆశించే చీడపీడలను సమర్థవంతంగా నివారించవచ్చు. రఘునందన్‌ స్వయంగా సేంద్రియ ఎరువుల తయారీని చేపడుతున్నారు. అందుకోసం తన వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

సేంద్రియ సాగే బెస్ట్‌..

రసాయన ఎరువులతో భూసారం దెబ్బతింటున్నది. పర్యావరణపరంగా, ప్రజల ఆరోగ్యపరంగానూ అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి సేంద్రియ సాగే సరైన పరిష్కారం. ప్రకృతి వ్యవసాయం వల్ల రసాయన, పురుగుల మందు వాడకం తగ్గుతుంది. పెట్టుబడి రూపంలో ఎకరానికి దాదాపు రూ.12 వేల నుంచి రూ.15వేల దాకా మిగులుతుంది. ఒక్కో పంటకు సగటున ఆరు నుంచి ఎనిమిది బస్తాల రసాయన ఎరువులు, నాలుగు నుంచి ఐదుసార్లు పురుగుల మందును పిచికారీ చేయాల్సి వస్తుంది. అదే సేంద్రియ పద్ధతిలో జీవామృతం, ఘనామృతం, కషాయాలు, పలు రకాల నూనెలను వాడడం వల్ల ఎకరానికి రూ.2వేల నుంచి రూ.3వేల మధ్యే ఖర్చు వస్తుంది. దీనికి తోడు భూమి కూడా సారవంతం అవుతుంది. ప్రకృతి ఎరువులతో పండించడం వల్ల సాధారణ పంటకన్నా 25 నుంచి 30శాతం అధిక ధర వస్తుంది. 

వారానికి ఒకసారి..

ఏ ఉద్యోగి అయినా.. యేడాదికి 12 నెలలు మాత్రమే జీతాలు తీసుకుంటాడు. కానీ, ఓ రైతు కూరగాయల సాగు చేపట్టి వారానికి ఒకసారి డబ్బు అందుకోవచ్చు. అవసరమైనప్పుడు సెలవులు.. అనుకున్న సమయంలోనే పని చేసుకునే అవకాశం అన్నదాతకే దక్కుతుంది. ఇది కేవలం ఒక వ్యవసాయ రంగంలోనే సాధ్యపడుతుంది. సమైక్య రాష్ట్రంలో సాగునీరు లేక రైతులెప్పుడూ నష్టాలపాలయ్యేవారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. కావాల్సినన్ని నీళ్లు.. సరిపడా కరెంట్‌తో వ్యవసాయం పండుగలా మారింది. కానీ, పంటల సాగులో మాత్రం అనుకున్న స్థాయిలో రైతులకు లాభాలు దక్కడం లేదు. పాత పద్ధతులనే ఫాలో కావడం. పంటను సరిగా అమ్ముకోలేకపోవడమే అందుకు కారణం. ఈ రెండు విషయాలను అంచనా వేసి.. సాగులోకి దిగితే నష్టమనేదే ఉండదు. పెట్టుబడి లేని సేంద్రియ వ్యవసాయం.. మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ పంటను సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చు. 

ఆరోగ్యకర పంటలే లక్ష్యం..

పాత పద్ధతులు పాటిస్తూ ఆరోగ్యకరమైన పంటలు పండించడమే నా లక్ష్యం. ఏ రైతు అయినా కూరగాయలు సాగు చేస్తూ, ఎకరానికి రూ.లక్ష దాకా సంపాదించవచ్చు. టమాట, బీర, ఆనిగపు కాయ ఇలా ఏ పంటలైనా పందిరి సాగు ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. మార్కెట్‌ క్యాలెండర్‌ను సిద్ధం చేసుకొని, ఏడాదిలో ఎప్పుడు ఏ పంటలు వేసుకోవాలో గుర్తించాలి. బంతిపూల సాగును వినాయక చవితి, అయ్యప్ప దీక్షలు, దీపావళి, దసరా, సంక్రాంతికి చేతికి వచ్చేలా చూసుకోవాలి. రంజాన్‌కు ఆనిగపు కాయ వచ్చేలా వేసుకోవాలి. ఉన్న భూమిలోనే ఐదారు రకాల పంటలు వేస్తూ, సాగులో కొత్త పద్ధతులను అనుసరించాలి. సేంద్రియ ఎరువులతో పెట్టుబడి తగ్గి, దిగుబడి పెరుగుతుంది. రైతు ఆత్మగౌరవంగా బతకాలన్నదే నా తపన. రైతు పంటకు ధరను రైతే నిర్ణయించే రోజులు త్వరలోనే వస్తాయి. ‘గుడ్‌మార్నింగ్‌ ఆర్గనైజేషన్‌' ద్వారా యువ రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. 

- రఘునందన్‌ నేత, రైతు 

మార్కెటింగ్‌ మనదే..

సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలకు మార్కెటింగ్‌ అనేది ఏమాత్రం సమస్య కాదు. రఘునందన్‌ వ్యవసాయం గురించి తెలిసిన వారంతా స్వయంగా పొలం దగ్గరికి వచ్చే కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. పంటలో ఎక్కువ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం హార్టికల్చర్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ‘సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌' కేంద్రంతోపాటు హైదరాబాద్‌లోని ప్రముఖ వెజిటెబుల్‌ మార్కెట్లకు తరలిస్తారు. 

ప్రముఖుల అభినందనలు..

రఘునందన్‌ కూరగాయ పంటల గురించి తెలుసుకున్న అనేక మంది ప్రముఖులు ఆయన క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్ర మాజీ గవర్నర్‌ నరసింహన్‌, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బోయినిపల్లి సంతోష్‌ కుమార్‌ తదితరులు రఘునందన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవలే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రత్యేకంగా వచ్చి, పంటలను పరిశీలించారు. పొలంలో కలియదిరిగి అన్ని పంటల గురించి తెలుసుకున్నారు. వ్యవసాయంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న రఘునందన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఉద్యానవన శాఖ ఏడీలు, జిల్లా అధికారులు, వ్యవసాయ అధికారులు రఘునందన్‌ సాగు విధానాలను పరిశీలించి వెళ్తున్నారు. ఆయా గ్రామాల్లోని రైతుల పొలాలను సందర్శించిన సమయంలో రఘునందన్‌ చేపడుతున్న సాగు పద్ధతులను వివరిస్తున్నారు. 

రాళ్ల భూమిలో రత్నాలు..

మా వ్యవసాయ క్షేత్రంలో అధికశాతం రాళ్లే ఉన్నాయి. రైతులకు సరైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఇక్కడే సాగు మొదలు పెట్టా. నా దగ్గరికి వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది రైతులు వస్తుంటారు. ఈ రాళ్ల భూమిని.. ఇందులో వస్తున్న దిగుబడిని చూసి వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. తమ పొలాలు ఇంతకంటే బాగుంటాయనీ, ఇక్కడే ఇలాంటి పంట పండితే.. తమ వద్ద ఇంకా ఎక్కువ దిగుబడి రాబట్టవచ్చునని అంటుంటారు. ఆ విధంగా రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపేందుకు ప్రయత్నిస్తున్నా. 


VIDEOS

logo