పంట రక్షణ చర్యలు

అక్కడక్కడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, సాగులో మురుగు నీటి పద్ధతులను పాటించాలని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాధార పంట పొలాల్లో నుండి మురుగునీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణాధారమైన వ్యవసాయ సలహాలను అందించారు.
వరి :
వరిలో దోమపోటు ఉధృతి తగ్గించేందుకు ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలిబాటను వదులుకోవాలి. తూర్పు-పడమర దిశలో వరుసలు ఉండేలా వరినాట్లు వేసుకోవాలి.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో తాటాకు తెగులు, కాండం తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది. తాటాకు తెగులు నివారణ కోసం 2 మి.లీ. ప్రొఫినోఫాస్ లేదా 2.5 మి.లీ. క్లోరిఫైరిఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం తొలుచు పురుగు ఆశిస్తే 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు లేదా 4 కిలోల ఫోరేట్ గుళికలను నాటిన 15-20 రోజుల తరువాత వేసుకోవాలి.
కూరగాయలు :
కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనిస్తే, 2 మి.లీ. డైమిథోయేట్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
టమాట, వంగ, మిరప నారుమళ్లు పోసుకునేందుకు అనుకూలం.
నీటి వసతి గల ప్రాంతాల్లో బెండ, చిక్కుడు, తీగజాతి కూరగాయలను విత్తుకోవాలి.
నారుమళ్లలో నారు కుళ్లు తెగులు నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును ఒక లీటరు నీటికి కలిపి నారుమడిని పూర్తిగా తడపాలి. నారుమళ్లలో మురుగు నీటి వసతి ఏర్పాటు చేసుకోవాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్, 3గ్రా.కాప్టాన్ చొప్పున విత్తనశుద్ధి చేస్తే, నారుమడిలో రసం పీల్చే పురుగులు, ఆకుమచ్చ తెగుళ్లను నివారించవచ్చు. విత్తనాలను ఎత్తయిన నారుమళ్లలో 10 సెం.మీ. ఎడంతో విత్తుకోవాలి.
పత్తి :
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తిలో రసం పీల్చే పురుగులు ఆశించే ప్రమాదమున్నది. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్ మందును, 1:20 నిష్పత్తిలో నీటిలో కలిపి లేత కాండంపై మెత్తని బ్రష్‌తో పూయాలి. విత్తిన 60 రోజుల పైరుకు ఈ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
నేలలో తేమ లభ్యత ఉన్నందున పత్తిలో ఎకరానికి 25 కిలోల యూరియా, 10 కిలోల పోటాష్ వేసుకోవాలి.
అధిక వర్షాలు, ఆకాశం మేఘావృతమై ఉండడం వలన పత్తిలో వడలు తెగులు సోకుతుంది. దీని నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును ఒక లీటరు నీటికి కలిపి, మొక్క మొదళ్లను పూర్తిగా తడపాలి.కంది :
కందిలో పేనుబంక ఆశిస్తే 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 1.5 గ్రా.ఎసిఫేట్ మందును, 20 గ్రా. యూరియా లేదా 5గ్రా. మల్టికెను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
తాజావార్తలు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్‌పై ఆంక్షలు!
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!
- హైదరాబాద్‌లో నడిరోడ్డుపై నాగుపాము కలకలం..!
- ట్విట్టర్ సీఈఓపై కంగనా ఆసక్తికర ట్వీట్
- కేంద్రం ఐటీఐఆర్‌ను రద్దు చేయకపోయుంటే..
- 89 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్
- మర్యాద రామన్న..కృష్ణయ్యగా మారాడు..!