మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Agriculture - Aug 05, 2020 , 23:15:02

కృషి ‘ఫలం’..డ్రాగన్‌ ఫ్రూట్‌!

కృషి ‘ఫలం’..డ్రాగన్‌ ఫ్రూట్‌!

డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట కాసుల వర్షం కురిపిస్తున్నది. రైతుకు లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతున్నది. ఒక్కసారి నాటితే చాలు. 30 ఏండ్ల వరకూ మంచి దిగుబడినిస్తూ.. స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. అమెరికా, చైనా వంటి దేశాల్లో పండే ఈ పంటకు తెలంగాణలోనూ అనువైన వాతావరణం ఉంది.  

ఏ పంటలో అయినా సహజంగా విత్తనాలను, మొక్కలను నాటుతాం. కానీ, ఈ పంటలో మాత్రం కాండాన్ని నాటాల్సి ఉంటుంది. డ్రాగన్‌ ఫ్రూట్‌ చెట్టు ఎడారుల్లో కనిపించే నాగజముడు, బ్రహ్మజముడు చెట్లను తలపిస్తుంది. 10-12 అంగుళాలు ఉండే కాండాన్ని నాటుకోవాలి. దీని ధర రూ. 40-60 వరకు ఉంటుంది. ప్రస్తుతం డ్రాగన్‌ ఫ్రూట్‌ను సాగుచేస్తున్న రైతుల నుంచి కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. డ్రాగన్‌ ఫ్రూట్‌లో అలీస్‌ వైట్‌, పింక్‌ పర్పుల్‌.. అనే రెండు రకాలు ఉన్నాయి. ఈ రెండు రకాల్లోనూ పండు పైభాగం గులాబీ రంగులో ఉంటుంది. కానీ, అలీస్‌ వైట్‌ రకంలో పండు లోపలి గుజ్జు తెల్లగా ఉంటుంది. మధ్యలో నల్లని గింజలు ఉంటాయి. ఇక పింక్‌ పర్పుల్‌ రకంలో లోపలి గుజ్జు కూడా గులాబీ రంగులోనే ఉంటుంది. పింక్‌ పర్పుల్‌ రకం మహా తీపి. అలీస్‌ వైట్‌ రకం కొంచెం తీపి, కొంచెం వగరు కలగలిసిన రుచి. ప్రస్తుతం మన వద్ద  పింక్‌ పర్పుల్‌ రకం ఎక్కువగా సాగవుతున్నది. స్టెమ్స్‌ను కొనుగోలు చేసి, జూన్‌లో నాటుకోవాలి. వచ్చే ఏడాది నాటికి తొలి పంట చేతికొస్తుంది. 

కడీలే కీలకం 

డ్రాగన్‌ ఫ్రూట్‌ పంటలో సిమెంట్‌ కడీలే కీలకం. ఈ మొక్కలు మద్దతు లేకుండా పెరుగవు. ఆధారంగా సిమెంట్‌ కడీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సాధారణ కడీలు పనిచేయవు. ప్రత్యేకంగా తయారు చేయించాలి. ఒక ఎకరా స్థలంలో కనీసం 400 నుంచి గరిష్టంగా 500 కడీలను ఏర్పాటు చేయవచ్చు. ఒక్కో కడి ఏడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల మందం ఉండాలి. పైభాగంలో నాలుగు వైపులా రంధ్రాలను ఏర్పాటు చేయాలి. ఈ రంధ్రాల్లో ‘ఎల్‌' ఆకారం ఉంటూ బయటకు వేలాడేలా ఇనుప కడ్డీలను పొందుపరచాలి. ఈ కడ్డీలపై వాహనాల టైర్లను ఉంచాలి. చెట్టు పెరిగి ఆ టైర్లను ఆధారంగా చేసుకొని కడీకి నాలుగువైపులా వాలుతుంది. చెట్టు పెరిగే క్రమంలో మధ్యమధ్యలో చెట్టును కడీకి దగ్గరగా ఉంచి కట్టాల్సి ఉంటుంది. లేదంటే మధ్యలోనే విరిగిపోయే ప్రమాదం ఉంది. 

ఎకరానికి 2 వేల మొక్కలు

ఎకరా స్థలంలో గరిష్టంగా రెండువేల మొక్కలు నాటుకోవచ్చు. కడీ ఆధారంగా మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఒక్కో కడీకి మూడు లేదా నాలుగు వైపులా మొక్కలు నాటుకోవచ్చు. ఒక్కో ఎకరంలో కనీసం 400 నుంచి  500 కడీలను ఏర్పాటు చేయవచ్చు. ఒక్కో కడీ మధ్య 8 అడుగులు, వరుసల మధ్య 10 అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ 500 కడీలను ఏర్పాటు చేస్తే.. కడీలకు మూడువైపులా 1500 మొక్కలు నాటవచ్చు. లేదంటే, నాలుగువైపులా  2 వేల మొక్కలు నాటవచ్చు. 

 తొలి పెట్టుబడి ఎక్కువ 

డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగులో తొలి ఏడాది పెట్టుబడి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎకరాకు కనీసం రూ. 5 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇందులో గణనీయమైన మొత్తం కడీల కొనుగోలుకే పోతుంది. మొత్తం ఖర్చులో రూ. 3 లక్షల నుంచి రూ. 3.5 లక్షల వరకు ఇందుకు వెచ్చించాల్సి ఉంటుంది. మొక్కల కొనుగోలు ఖర్చును పరిశీలిస్తే.. ఒక్కో మొక్క ఖర్చు రూ. 100గా పరిగణించినా, రెండు వేల మొక్కలకు రూ. 2 లక్షలు ఖర్చవుతుంది. అదే విధంగా, నీటి పారకం కోసం డ్రిప్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు రూ. 50-60 వేలు అవుతుంది. ఎరువులకు, గుంతలు తీసేందుకు, ఇతర చిన్నచిన్న పనులకు ఎంతోకొంత ఖర్చవుతుంది. ఆ తర్వాత ప్రతి ఏడాది రూ. 60 వేల నుంచి రూ. 80 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 

 25-30 ఏండ్ల వరకు.. 

డ్రాగన్‌ ఫ్రూట్‌ పంటను ఒకసారి వేస్తే 25-30 ఏండ్ల వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది. ఇందులో 20 ఏండ్ల వరకు అధిక దిగుబడి వస్తుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగులో ఒక్కసారి పెట్టుబడిపెడితే, ఆ తర్వాత 20 ఏండ్ల పాటు ఆ పంటే మనల్ని పోషిస్తుందనే నమ్మకం సాగు చేస్తున్న రైతుల్లో కలుగుతుంది. ఏటా తక్కువ శ్రమతో అధిక రాబడి పొందే అవకాశం ఉంది. 

 అన్ని నేలలూ అనుకూలం 

డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు ఎలాంటి నేలలైనా అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ నేలలకు నీరు నిల్వ ఉండే స్వభావం ఉండకూడదు. ముఖ్యంగా ఎర్రనేలలు, ఇసుక నేలలు అయితే మరింత అనుకూలంగా ఉంటుంది. మిగతా పంటలతో పోలిస్తే.. డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగులో నీటి వినియోగం చాలా తక్కువ. రోజూ 10-15 లీటర్ల నీరు పెడితే సరిపోతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రిప్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇక వర్షాలు ఎక్కువగా ఉన్నా... తక్కువగా ఉన్నా  చెట్టుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. 

ఎకరాకు రూ. 3-8 లక్షలు 

ఇతర పంటల సాగుతో పోల్చితే డ్రాగన్‌ ఫ్రూట్‌తో రైతులు అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అది కూడా రెండు మూడింతలు ఎక్కువగా. బహిరంగ మార్కెట్లో ఈ పండ్లకు భారీ డిమాండ్‌ ఉంది. సూపర్‌ మార్కెట్లు, పండ్ల మార్కెట్లలో కిలో రూ. 400 నుంచి 600 వరకు విక్రయిస్తున్నారు. అయితే, రైతుల నుంచి హోల్‌సేల్‌గా రూ. 150 నుంచి రూ. 250 వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఏటా కనీసం 6 టన్నుల నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఒక ఎకరాకు తక్కువలో తక్కువ 6 టన్నుల దిగుబడి వచ్చిందే అనుకుందాం.. కిలో రూ. 100గానే పరిగణిద్దాం. అంటే ఆ రైతుకు ఆరు టన్నులకు గానూ రూ. 6 లక్షల ఆదాయం వస్తుంది. ఇందులో ఖర్చులు, పెట్టుబడి కింద రూ. 2-3లక్షలు తీసేసినా రూ. 3-4 లక్షల నికర ఆదాయం మిగులుతుంది. ఒకవేళ అన్నీ సవ్యంగా ఉండి ఎకరాకు 10 టన్నుల దిగుబడి వస్తే ఆ రైతుకు రూ. 10 లక్షల ఆదాయం వస్తుంది. ఇందులో రూ. 2-3 లక్షల ఖర్చులు తీసేస్తే రైతుకు నికరంగా రూ. 7-10 లక్షలు మిగులుతుంది. ఒకవేళ డ్రాగన్‌ ఫ్రూట్‌కు మార్కెట్లో పూర్తిగా డిమాండ్‌ పడిపోయి, రూ. 50కి కేజీ చొప్పున విక్రయించినా రైతుకు లాభమే తప్ప, నష్టం రాదు. డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగులో తొలి ఏడాదీ రెండేండ్ల వరకు అంతర పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా కూరగాయలు, తీగజాతి చెట్లను సాగు చేసుకోవచ్చు. తద్వారా రైతుకు అదనపు ఆదాయం సమకూరుతుంది. 

చీడపీడలు తక్కువే 

డ్రాగన్‌ ఫ్రూట్‌ పంటకు చీడపీడల బెడద ఎక్కువగా ఉండదు. సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మొక్కలు నాటేప్పుడు సేంద్రియ ఎరువులను వాడితే, మొక్క ఎదుగుదల బాగుంటుంది. 

 

ఆరోగ్యానికి మేలు 

డ్రాగన్‌ ఫ్రూట్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, అన్ని రకాల ఔషధ గుణాలూ కలిగిన ఫలం ఇది. ఇందులో ఐరన్‌, విటమిన్‌-సి, ఫాస్పరస్‌, కాల్షియంలతోపాటు అనేక పోషక విలువలు ఉంటాయి. దీంతో హృద్రోగం, క్యాన్సర్‌, షుగర్‌, ఊబకాయం, చర్మ సంబంధ అలర్జీలు.. వంటివాటి నివారణకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఈ పండును తినడం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు.. అందరికీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఈ పండు గురించి ప్రజలకు తెలుస్తుండటంతో భవిష్యత్‌లో మరింతగా డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది.  

 ఆఫ్‌ సీజన్‌లోనూ.. 

డ్రాగన్‌ ఫ్రూట్‌ మాములుగా జూన్‌ నుంచి నవంబరు, డిసెంబరు వరకు దిగుబడి వస్తుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. ప్రత్యేక పద్ధతుల ద్వారా మిగతా నెలల్లోనూ దిగుబడి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఇది కొంత కష్టంతో, ఖర్చుతో కూడుకున్నది. ఇందుకోసం తోట మొత్తం ప్రత్యేకమైన లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎల్‌ఈడీ బల్బులను చైనా నుంచి దిగుమతి చేసుకోవాలి. ఒక్కో బల్బు ధర రూ. వెయ్యి వరకు ఉంటుంది. చెట్టుకు ఒకటి లేదా రెండు చొప్పున.. వేల సంఖ్యలో బల్బులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఏర్పాటు చేయగానే సరిపోదు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల సీజన్‌తో పోల్చితే సగం దిగుబడి వస్తుంది. అయినప్పటికీ, ధర ఎక్కువగా ఉండటంతో రైతుకు లాభాలు మిగులుతాయి. 

వేసవిలో జాగ్రత్త 

మనవద్ద వేసవిలో 40 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు కూడా ఎండలు ఉంటాయి. అయితే ఈ సమయంలో, చెట్లపై ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం చెట్లకు పైవరుసలో బ్లూమ్యాట్‌లను ఏర్పాటు చేయడం లేదా ఇతర పద్ధతుల ద్వారా చెట్లపై ఎండ పడకుండా చూడటం అత్యవసరం. పంటను మనం జాగ్రత్తగా రక్షించుకుంటే, పంట కూడా మనకు అంతే జాగ్రత్తగా దిగుబడిని అందిస్తుంది. 

తోట వద్దే అమ్మకం 


డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేసే రైతులు మార్కెటింగ్‌ గురించి ఇబ్బంది పడాల్సిన పనే లేదు. పండ్ల వ్యాపారులు, సూపర్‌ మార్కెట్‌ నిర్వాహకులు తోటవద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో భారీ డిమాండ్‌ ఉండటమే ఇందుకు కారణం. దీనికి తోడు మన వద్ద డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు తక్కువగా ఉంది. ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటే వ్యాపారులకు అధిక ధర పడుతుంది. దీంతో దిగుమతులను ఆపేసి, స్థానికంగా సాగు చేసే పండ్లను కొనేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేస్తున్న రైతులెవరూ మార్కెటింగ్‌లో ఇబ్బంది పడలేదు. వ్యాపారులు నేరుగా తోట వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. 

రంగారెడ్డి జిల్లాలో శ్రీనివాస్‌రెడ్డి అనే రైతు తన తోట వద్దే రూ. 250కి కిలో చొప్పున విక్రయించడం విశేషం. ఇక అన్‌సీజన్‌లో (జూన్‌ నుంచి డిసెంబరు వరకు కాకుండా మిగతా నెలల్లో) ఈ పండు ధర మరింత ఎక్కువగా ఉంటుంది. రైతు వద్దే కేజీ ధర రూ. 400 వరకు పలుకుతుంది. అయితే, అన్‌సీజన్‌లో ఈ పంట పండదు. ఎక్కడో ఒకచోట కొన్ని పండ్లు చేతికొస్తాయి. అయితే డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేసే రైతులు.. తాము ఈ పంట సాగు చేస్తున్నట్లు దగ్గర్లో ఉన్న పట్టణాల్లోని పండ్ల వ్యాపారులకు, సూపర్‌ మార్కెట్ల నిర్వాహకులకు సమాచారం ఇవ్వాలి. ఉద్యానశాఖ అధికారులను కలిసి సాగు గురించి తెలియజేయాలి. పెద్ద మొత్తంలో దిగుబడి వస్తే ఇతర రాష్ర్టాలకు కూడా ఎగుమతి చేసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లాకే చెందిన మరో రైతు వీరేందర్‌కు తొలి పంట చేతికొచ్చింది. ప్రస్తుతం దాదాపుగా 2 టన్నుల వరకు దిగుమతి వచ్చిందని, వ్యాపారులు తోట వద్దే రూ. 150కి కిలో చొప్పున కొనుగోలు చేసినట్లు వీరేందర్‌ తెలిపారు. 

రెండో సంవత్సరం నుంచీ.. 

పంట వేసిన రెండో సంవత్సరం నుంచే దిగుబడి ప్రారంభమవుతుంది. అయితే, మొదటి ఏడాది ఎకరాకు 1.5 నుంచి 2 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఆ తర్వాత ఏడాది నుంచి క్రమంగా పెరుగుతూ నాలుగో ఏడాదినుంచి ఆరు టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. గరిష్టంగా ఎకరాకు 10-12 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఒక్కో పండు 250 నుంచి 450 గ్రాముల బరువు వస్తుంది. ఏటా జూన్‌ నుంచి డిసెంబరు మధ్య పంట చేతికొస్తుంది. ఈ ఆరేడు నెలలు క్రమంగా పంట చేతికొస్తూనే ఉంటుంది. పక్వానికి వచ్చిన పండ్లను తెంపగానే, అప్పటికే మిగతా పూత పండుగా మారుతుంది.

రైతు సగర్వంగా బతుకొచ్చు


నీటి వసతి లేదని భూములను, ఏ పంటా లేకుండా వదిలేసే రైతులు డ్రాగన్‌ ఫ్రూట్‌ను సాగు చేసుకోవచ్చు. ఈ పంట ద్వారా రైతుకు ఎప్పటికీ నష్టం ఉండదు. వ్యవసాయాన్ని వదిలేసి చిన్నాచితకా ఉద్యోగాలు చేసేకన్నా, ఈ పంటను సాగు చేస్తే, సగర్వంగా బతుకొచ్చు. ప్రతి ఏటా లక్షల ఆదాయం సంపాదించుకోవచ్చు. నేను ఈ పంటను 2006లోనే మొదలు పెట్టాను. ఇప్పుడు మంచి దిగుబడి వస్తున్నది. పంట మొత్తం తోటలోనే అమ్ముడయి పోతుంది.

- శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి 


logo