శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Agriculture - Aug 05, 2020 , 23:15:09

‘ఆరోగ్య’ సేద్యం!

‘ఆరోగ్య’ సేద్యం!

మనం పండించే పంట ఏంది? తినే తిండి ఏంది? ఈ రోగాలేంది? నొప్పులేంది? పైగా అంత పండించీ రైతు విలవిల్లాడటం ఏంది? ఒక్కసారి రసాయనాలు మానేసి సేంద్రియ పద్ధతిలో సాగు చేయండి. అప్పుడు, రైతు ఎందుకు కలవరపడతాడో చూద్దాం? గిట్టుబాటు ఎందుకు కాదో? సాగు లాభసాటి ఎలా కాదో? మనల్ని ఈ రోగాలు, నొప్పులు ఎందుకు పీడిస్తాయో? పల్వట్లకు చెందిన వెంకట్‌రెడ్డి ఈ విషయాన్ని ఏనాడో గుర్తించాడు. 60 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు. 

ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గిస్తేనే వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండ లం పల్వట్ల రైతు వెంకట్‌రెడ్డి ఈ సత్యాన్ని ఎప్పుడో తెలుసుకున్నాడు. సేంద్రియ ఎరువులను తానే తయారు చేస్తూ పంటలకు వాడుతున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని పొందుతున్నాడు. 


సీవీఆర్‌ పద్ధతిలో.. 

వెంకట్‌రెడ్డికి వ్యవసాయంపై ఆసక్తి ఎక్కువ. అందుకే, వ్యవసాయం దండగ కాదని నిరూపిస్తున్నాడు. సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించి తన పొలంలో బిందుసేద్యం ద్వారా ఈ ఏడాది కూరగాయలు, పప్పులు, ఆకుకూరలు, పత్తి, మిరప పంటలను సాగు చేస్తున్నాడు. వేస్ట్‌ డీకంపోజర్‌, చేపల వ్యర్థాలతో సొంతంగా సేంద్రియ ఎరువులు తయారుచేస్తూ.. ప్రకృతి వ్యవసాయ విధానమైన సీవీఆర్‌ (చింతల వెంకటరామ్‌రెడ్డి) పద్ధతులను అనుసరిస్తున్నాడు. ఇలా రసాయన ఎరువుల వాడకం తగ్గించి.. ఆధునిక పద్ధ్దతులను అవలంబిస్తూ.. భూసారం దెబ్బ తినకుండా ఆర్గానిక్‌ ఎరువులను వాడితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించవచ్చని నిరూపిస్తున్నాడు ఈ యువరైతు. 

 పత్తికి ప్రాధాన్యం

గత ఏడాది.. కొద్దిపాటి పత్తిపంటను సాగు చేసినా.. ప్రభుత్వం పత్తిపంటకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈ ఏడాది 50 ఎకరాల్లో పత్తి, 11 ఎకరాల్లో మిరప,  కూరగాయలు, ఆకుకూరలను సాగుచేస్తున్నాడు. పొలంలో విత్తనాలు వేసింది మొదలు.. పంట చేతికొచ్చే వరకు ఎక్కడా కూడా రసాయన ఎరువుల మాటే ఉండదు. మిరపపంట సాగుకు ఎకరాకు రూ. 60 వేల పెట్టుబడి పెట్టి 3 వందల క్వింటాళ్ల దిగుబడి తీస్తున్నాడు. ఖర్చులన్నీ పోనూ రూ. 3 లక్షల ఆదాయం వస్తుందట. అదే విధంగా పత్తిని సైతం ఆర్గానిక్‌ ఎరువులతో సాగు చేస్తూ ఎకరాకు రూ. 20 వేల ఖర్చుతో రికార్డు స్థాయిలో దిగుబడి సాధిస్తున్నాడు. గతేడాది 30 ఎకరాల్లో పత్తిని సాగుచేయగా.. ఒక ఎకరాకు 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు వెంకట్‌రెడ్డి చెప్పారు.  కలుపు తీయడం, ఇతరత్రా పనులకు కూడా సొంతంగా తయారు చేసుకున్న పరికరాలను వాడుతూ.. కూలీల కొరత ఏర్పడినా ఇబ్బంది లేకుండా వ్యవసాయం కొనసాగిస్తున్నాడు. వెంకట్‌రెడ్డి పండిస్తున్న ఆర్గానిక్‌ కూరగాయల గురించి ఆ నోటా ఈ నోటా హైదరాబాద్‌ వరకు తెలియడంతో జంట నగరాల ప్రజలు వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

-కుమార్‌గౌడ్‌, వట్‌పల్లి

ప్రోత్సహిస్తున్నాం

సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. వెంకట్‌రెడ్డి సేంద్రియ ఎరువులను వాడుతూ అద్భుత దిగుబడులు సాధిస్తున్నాడు. ప్రతి విషయంలోనూ మా సూచనలు, సలహాలు తీసుకుంటున్నాడు. మిగతా రైతులు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తే మా వంతు సహకారం.. ప్రోత్సాహం తప్పనిసరిగా అందిస్తాం. 

- మహేశ్‌ చౌహన్‌, వ్యవసాయాధికారి

లాభం, ఆరోగ్యం

రసాయన ఎరువులతో పండించే పంటలతో రైతులకు పెట్టుబడి ఖర్చు పెరిగి.. ఆదాయం రాకపోగా, ఆ పంటలను తిన్న ప్రజలకు సైతం ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించాను. దీంతో కొన్ని సంవత్సరాలుగా సొంతంగా సేంద్రియ ఎరువులను తయారుచేసి వాడుతున్నాను. భూసారం దెబ్బతినకుండా అధికారుల సూచనలు పాటిస్తున్నాను. గతేడాది 30 ఎకరాల్లో పత్తిపంటను సాగుచేశాను. ప్రభుత్వం పత్తిపంటకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో కేసీఆర్‌ మాటకు కట్టుబడి ఈ ఏడాది 50 ఎకరాల్లో పత్తిని సాగు చేశాను. సేంద్రియ ఎరువులతో పంటలను పండిస్తూనే ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు నావంతు ప్రయత్నం చేస్తున్నాను. 

-వెంకట్‌రెడ్డి 


logo