బుధవారం 05 ఆగస్టు 2020
Agriculture - Jul 29, 2020 , 23:33:34

తీయని వేడుక..ఖర్జూర పంట!

తీయని వేడుక..ఖర్జూర పంట!

  • కాసుల పంట పండిస్తున్న ఖర్జూర తోటలు
  • ఎకరాకు రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షల లాభం 
  • నాలుగేండ్ల నుంచి 50 ఏండ్ల వరకు పంట దిగుబడి 

ఖర్జూర అనగానే మనకు గుర్తొచ్చేది అరబ్‌. ఎడారి దేశాలు ఖర్జూర సాగుకు కేరాఫ్‌గా మారాయి. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఎదిగే ఈ మొక్కలు.. ప్రస్తుతం మన దేశంలోనూ సాగుకు అనుకూలంగా మారాయి. గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ర్టాల్లో ఎక్కువగా సాగవుతున్న ఖర్జూర పంట క్రమంగా దక్షిణ భారతదేశానికి కూడా పాకింది. తమిళనాడు, కేరళ, ఆంధ్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు విజయవంతంగా సాగు చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే మన తెలంగాణ కూడా.. ఖర్జూర సాగుకు అనుకూలంగా మారింది. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో పలువురు ఉత్సాహంగా సాగు చేస్తున్నారు. మంచి లాభాలనూ గడిస్తున్నారు. మార్కెటింగ్‌లో మెళకువలు పాటిస్తే  రైతుకు ఖర్జూర కాసుల వర్షం కురిపిస్తుంది. 

మొక్కల దిగుమతి

ఖర్జూరలో అనేక రకాలు ఉన్నాయి. అయితే బార్హీ, కనిది అనే రెండు రకాలూ మన నేలకు అనుకూలమైనవని శాస్త్రవేత్తలు తేల్చారు. మొక్కల కొనుగోలు దశలోనే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ రకం మొక్కలు మన ప్రాంతంలోనూ లభిస్తాయి. వీటి ధర ఒక్కో మొక్కకు రూ. 200 వరకూ ఉంటుంది. కానీ ఆ మొక్కల వల్ల చెట్టు సక్రమంగా ఎదుగకపోవడమే కాకుండా, అనుకున్న స్థాయిలో దిగుబడి రాదు. అందుకే, మేలురకపు మొక్కల్ని రైతులు ఎంపిక చేసుకోవాలి. ఈ మొక్కలు ముఖ్యంగా గుజరాత్‌, అరబ్‌ల నుంచి దిగుమతి అవుతాయి. ఇందుకోసం ఏజెన్సీలూ ఉన్నాయి. ఒక్కో మొక్క ఖరీదు రూ. 3500 నుంచి రూ. 4వేల వరకూ ఉంటుంది. 

ఎకరాకు 78 మొక్కలు

ఖర్జూర మొక్కలు నాటే సమయంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటించాలి.  ఎకరాకు 78 నుంచి 80 మొక్కలు నాటాలి. ప్రతి మొక్క, వరుస మధ్య తగినంత దూరం ఉండేలా చూసుకోవాలి. 1.5 లేదా 2 మీటర్ల లోతు గుంతలో.. సేంద్రియ ఎరువులు వేసి మొక్క నాటాలి. 

నాలుగో ఏట నుంచీ దిగుబడి

ఖర్జూర తోట పెట్టిన నాలుగో సంవత్సరం నుంచీ దిగుబడి మొదలవుతుంది. మొదటి ఏడాది తక్కువగా దిగుబడి వస్తుంది. అంతమాత్రాన నిరాశపడకూడదు. ఆ తర్వాత ఏటికేడాది దిగుబడి భారీగా పెరుగుతూ పోతుంది. తొలి ఏడాది ఒక్కో చెట్టుకు 50- 80 కేజీల ఖర్జూర పండ్ల దిగుబడి వస్తుంది. తర్వాత ఏడాది నుంచి క్రమంగా పెరుగుతూ.. ఒక్కో చెట్టుకు 100- 150 కేజీల వరకు వస్తుంది. ప్రతి చెట్టుకు 8-10 గెలలు కాస్తాయి. ఒక్కో గెల బరువు 10-15 కేజీలు ఉంటుంది. ఈ విధంగా, మొత్తంగా ఒక ఎకరాకు 5-8 టన్నుల దిగుబడి లభిస్తుంది.

 

ఎర్రని నేలలు, ఎక్కువ ఉష్ణోగ్రత

ఖర్జూర  ఉష్ణమండల పంట. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా సాగవుతుంది. యూఏయీ, ఈజిప్ట్‌, ఇరాన్‌ తదితర దేశాల్లో పుష్కలంగా   పండుతుంది.  మన దేశంలోనూ సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతానికి గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ర్టాల్లో     భారీగా సాగు చేస్తున్నారు. తమిళనాడు, కేరళలోనూ సాగు పెరుగుతున్నది. క్రమంగా తెలుగు రాష్ర్టాల్లో కూడా మొదలైంది. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో కొంత మంది ఆసక్తిగల రైతులు ఖర్జూర సాగు చేస్తున్నారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే మెజార్టీ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయి. వేసవి కాలంలో 42 నుంచి 47 డిగ్రీల వరకూ కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీంతో ఖర్జూర సాగుకు తెలంగాణ కూడా అనువుగా ఉంటున్నది. ఈ పంట సాగుకు దాదాపుగా అన్ని రకాల నేలలూ అనుకూలమైనవే. అయితే ఎర్రని నేలలు అత్యంత ఉపయుక్తమైనవని తేల్చారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.  ఈ నేలల్లో ఖర్జూర  సాగు చేయడం వల్ల అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. ఖర్జూర నాణ్యత కూడా బావుంటుంది.

 నీటి వాడకం తక్కువే

ఎడారి నేలల్లో పెరిగే స్వభావం ఉన్న ఖర్జూర సాగుకు  నీరు ఎక్కువగా అవసరం లేదు. డ్రిప్‌ విధానంలో రెండు రోజులకోసారి అందిస్తే సరిపోతుంది. ఒకవేళ నీళ్లు ఎక్కువగా ఉంటే, రోజూ ఒక గంట పెడితే సరిపోతుంది. అయితే పూత సమయంలో మాత్రం క్రమం తప్పకుండా అందించాల్సి ఉంటుంది. లేదంటే పూత ఫలదీకరణం నిలిచిపోయి, దిగుబడిపై ప్రభావం చూపుతుంది. 

పాలినేషన్‌తో ఫలదీకరణ 

ఖర్జూరలో ఆడ, మగ చెట్లు ఉంటాయి. ఆడ చెట్లకు మాత్రమే కాయలు కాస్తాయి. వీటి ఫలదీకరణకు ప్రతి పది ఆడ చెట్లకు ఒక మగ మొక్కను నాటాలి. ప్రతి ఎకరాకు కనీసం 10 మగ మొక్కలు ఉండేలా చూడాలి. తద్వారానే ఫలదీకరణ జరుగుతుంది. ఒకవేళ మగ మొక్కలు పుప్పొడి రేణువులు రాకపోతే కృత్రిమంగా తయారు చేసిన పౌడర్‌ లభిస్తుంది. దీన్ని ఆడ మొక్క పూతపై చల్లాలి. దీన్ని పాలినేషన్‌ అంటారు. ఈ ప్రక్రియ చేపట్టిన 3-4 నెలల్లో దిగుబడి ప్రారంభమవుతుంది. 

అంతర పంటలతో అదనపు ఆదాయం

ఖర్జూర సాగులో అంతర పంటలను సాగు చేయడం వల్ల రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. మొక్కల మధ్య అధిక దూరం ఉండటంతో అంతర పంటలకు కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అంతర పంటలుగా కూరగాయలు, జామ, నిమ్మ, డ్రాగన్‌ ఫ్రూట్‌   వంటి వాటిని సాగు చేయవచ్చు.     

తొలి పెట్టుబడి ఎక్కువే...

ఖర్జూర సాగుకు రైతు మొదట్లో అధికంగానే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మొక్కల ధర ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు ఒక కారణం. ఎకరం సాగుకు మూడేండ్లకు గానూ కనీసంగా రూ. 4 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో మొక్కలకే రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఖర్చవుతుంది. నాలుగో ఏడాది నుంచీ పెట్టుబడి చాలా వరకు తగ్గిపోతుంది. ఎరువులు, ఇతర ఖర్చులకు ఏటా రూ. 60వేల నుంచి లక్ష వరకు వ్యయం అవుతుంది. తొలి మూడేండ్లు రైతు పెట్టుబడి ఖర్చులను భరిస్తే ఆ తర్వాత ఏడాదే మొత్తం పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. 


ఎరువులు తక్కువే

ఖర్జూర సాగులో ఎరువుల వాడకం తక్కువే. రసాయనాల జోలికి వెళ్లకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగించడం వల్ల మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఆరు నెలలకోసారి పశువుల పేడ వంటివి చల్లాలి. చెట్ల మధ్యలో గడ్డి లేకుండా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రతి మూడు నెలలకోసారి ట్రాక్టర్‌తో దుక్కిని దున్నాల్సి ఉంటుంది. ఖర్జూర చెట్లకు మోగి పురుగు, లద్ది పురుగు ఎక్కువగా పడుతాయి. ఈ సమయంలో తగిన మందులు ఉపయోగిస్తే చెట్టును రక్షించుకోవచ్చు. ఈ సాగులో కూలీల ఇబ్బందులు ఉండవు. ఇద్దరు లేదా ముగ్గురు మనుషులతో పనులు పూర్తి చేసుకోవచ్చు. 

ఏడాదికి రూ. 10లక్షల వరకు ఆదాయం....

ఖర్జూర సాగు రైతుకు కాసుల వర్షం కురిపిస్తుందనే చెప్పాలి. ఏటా అన్ని ఖర్చులూ పోనూ రూ. 10 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. జూన్‌, జూలై నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. ఏడాదికి ఒకసారి పండ్లను కోయాల్సి ఉంటుంది. హోల్‌సేల్‌లో కిలో ఖర్జూర రూ. 150 నుంచి రూ. 200 వరకు విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ. 300 నుంచి రూ. 400 వరకు ఉంది. టోకుధర తగ్గినా రైతుకు ఇబ్బంది రాదు. మూడేండ్ల తర్వాత పెట్టుబడి ఖర్చు తగ్గడం, దిగుబడి పెరగడంతో.. రైతుకు నష్టం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఖర్జూర సాగు చేసే రైతు మార్కెటింగ్‌పై ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. లోకల్‌ మార్కెట్‌లో విక్రయించడంతోపాటు ఇతర రాష్ర్టాలకు, దేశాలకు ఎగుమతి చేసే మార్గాలను చూసుకోవాలి. ఇందుకోసం అనేక ఏజెన్సీలు పని చేస్తున్నాయి. వాటిని సంప్రదించవచ్చు. లోకల్‌గా మార్కెటింగ్‌ను విస్తరించుకుంటే మరింత లాభదాయకంగా ఉంటుంది. సంగారెడ్డికి చెందిన యువరైతు కృష్ణ ప్రసాద్‌ సొంతంగా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు.

40-50 ఏండ్లపాటు దిగుబడి

ఖర్జూర మొక్క జీవిత కాలం  సుమారుగా 60 ఏండ్లని అంచనా. 
నాలుగేండ్ల నుంచి మొదలైన దిగుబడి కనీసం 40 నుంచి 50 ఏండ్లవరకు వస్తుంది. 
ఖర్జూర మొక్కను ఒక్కసారి నాటితే 50 ఏండ్ల వరకు దిగుబడితోపాటు నిరంతర ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. 
నాలుగేండ్ల తర్వాత క్రమంగా దిగుబడి పెరుగుతూ 30 ఏండ్ల తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ వస్తుంది.logo