శనివారం 08 ఆగస్టు 2020
Agriculture - Jul 29, 2020 , 23:33:34

పదెకరాలు.. పది పంటలు!

పదెకరాలు.. పది పంటలు!

  • సూర్యాపేట యువరైతు వినూత్న సాగు

పెద్ద చదువులు.. ఉద్యోగం.. వ్యాపారం.. ఏదీ ఆ యువకుడికి తృప్తిని ఇవ్వలేకపోయాయి. జీవితంలో ఏదైనా సాధించాలన్న కసి.. నిత్యం మనసులో మెదిలేది. ఆ ఆలోచనే తనను వ్యవసాయం వైపు అడుగులు వేయించింది. రైతుగా మారిన తర్వాత.. ఇంకా ఏదైనా సరికొత్తగా చేయాలన్న తపన.. వినూత్న సాగుకు తెర లేపింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏక కాలంలో పది రకాల పంటలు పండించేలా చేసింది. 

సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామానికి చెందిన శాఖమూడి అరవింద్‌ది వ్యవసాయ కుటుంబమే. తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేసినా సాగును వదల్లేదు. అరవింద్‌ కూడా ఉన్నత ఉద్యోగాలు చేసినా.. మళ్లీ ఆధునిక వ్యవసాయం వైపు మళ్లాడు. మాధారంలో పాఠశాల విద్య, కోదాడలో ఇంటర్‌, డిగ్రీ చదివిన అరవింద్‌, హైదరాబాద్‌లో ఎంబీఏ, కోదాడలోనే ఎంఎస్‌డబ్ల్యూ(మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌) చేశాడు. 2010 నుంచి మూడేండ్లపాటు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ బ్యాంకులో ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి, మరో మూడేండ్ల పాటు మిర్చీ ట్రేడింగ్‌ నిర్వహించాడు. ఉద్యోగం, వ్యాపారం.. రెండిటితోనూ సంతృప్తి చెందని అరవింద్‌.. ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించి, ఇక ఏమాత్రం ఆలోచించకుండా వ్యవసాయ రంగంలోకి దిగాడు. 

కమర్షియల్‌ సాగు

సొంతూరిలో తమ కుటుంబానికి ఉన్న 10 ఎకరాల భూమిలో సాగును మొదలు పెట్టాడు అరవింద్‌. అధిక దిగుబడి లక్ష్యంతో వినూత్నంగా సేద్యం చేయాలనుకున్నాడు. అందుకోసమే 10 ఎకరాల్లో డ్రిప్‌ సిస్టం ద్వారా 10 రకాల పంటలు పండిస్తూ.. ఔరా అనిపిస్తున్నాడు. తొలుత మూడెకరాల్లో వరి, రెండు రకాల కూరగాయలు  సాగు చేశాడు. మిగిలిన దాంట్లో పత్తి, ఇతర పంటలు వేశాడు. ఆ తర్వాత 1.5 ఎకరాల్లో మల్బరీ సాగు చేయగా.. అబుదాబీ నుంచి 85 అత్యుత్తమ రకం ఖర్జూర మొక్కలు తెప్పించి ఎకరం భూమిలో నాటాడు. పుణె నుంచి సూపర్‌ గోల్డెన్‌(లావుపాటి) సీతాఫల్‌ మొక్కలు తెచ్చి మరో ఎకరంలో సాగు చేస్తున్నాడు. ఈ రెండు ఫలాల్లో ఖర్జూర మూడేండ్లలో, సీతాఫలం ఏడాదిన్నరలో చేతికి రానున్నాయి. మరో 1.5 ఎకరాల్లో పందిళ్లు వేసి తీగజాతి కూరగాయలు వేశాడు. మరో ఎకరం భూమిలో టమాట, మిర్చి పంటలు వేశాడు. ఇలా అరవింద్‌ వ్యవసాయ క్షేత్రంలో ఎటు చూసినా ఏదో ఒక కొత్త పంట కనిపిస్తుంది. 

అధిక లాభాలే లక్ష్యం

సాగును లాభసాటిగా చేయాలనే లక్ష్యంతోనే వచ్చా. గత ఏడాది రూ.11లక్షల ఆదాయం వచ్చింది. మరో ఏడాదిన్నరలో సీతాఫలం, మూడేండ్లలో ఖర్జూర చేతికి అందుతుంది. వీటితోనే ఏడాదికి రూ.10లక్షలకు పైనే చేతికి వస్తుంది. మూడేండ్ల తరువాత ఏడాదికి రూ.24లక్షలు.. అంటే నెలకు రూ.రెండు లక్షల పంటలు పండించడమే నా లక్ష్యం. నా విజయంలో అధికారుల ప్రోత్సాహం ఎంతో ఉన్నది.                                           

 - అరవింద్‌, యువ రైతు

తక్కువ నీటితో ఎక్కువ ఫలసాయం 

ఇతరులకు భిన్నంగా అరవింద్‌ అనేక రకాల కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నాడు. తక్కువ నీటితో ఎక్కువ ఫలసాయం పొందుతున్నాడు. ఆహార పంటలతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచే కూరగాయలు, పండ్ల వైపు  రైతులు మళ్లితే మంచి ఆదాయం, సమాజానికి మంచి అహారాన్ని అందించామన్న సంతృప్తి..  సొంతం అవుతాయి. ఐదేండ్ల లోపు పంటలు ఇచ్చే లాభదాయమైన సాగు మంచిది. 

- బీ శ్రీధర్‌, హార్టీకల్చర్‌ అధికారి, సూర్యాపేట జిల్లా


logo