గురువారం 13 ఆగస్టు 2020
Agriculture - Jul 29, 2020 , 23:33:32

శాస్త్రవేత్తలతో మాట్లాడవచ్చు

శాస్త్రవేత్తలతో మాట్లాడవచ్చు

  • టీ కన్సల్ట్‌ యాప్‌తో రైతు సమస్యలకు సత్వర పరిష్కారం

పంటలకు చీడపీడలు పడితే నివారణ కోసం తోటి రైతునో దగ్గర్లోని ఫెర్టిలైజర్స్‌ దుకాణదారునో సంప్రదిస్తాడు రైతు. అంతేగానీ.. నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తతో మాట్లాడటం సాధ్యం కాదు. కానీ, తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీటా) ఆ కష్టమైన పనిని సులభతరం చేసింది. రైతులు పంట సమస్యల పరిష్కారం కోసం నేరుగా శాస్త్రవేత్తలతోనే మాట్లాడే వెసులుబాటును కల్పించింది. అందుకోసం ‘టీ కన్సల్ట్‌' పేరుతో ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ఇటీవలే ఈ యాప్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం 40 మంది శాస్త్రవేత్తలు యాప్‌లో అందుబాటులో ఉన్నారు. త్వరలోనే ఈ సంఖ్యను మరింత పెంచేలా టీటా ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, ఉద్యాన వర్సిటీలతో కలిసి పని చేస్తున్నది. ఈ వర్సిటీల్లోని శాస్త్రవేత్తలను కూడా  భాగస్వాములను చేయనున్నది. ఏ పంట అయినా.. ఎలాంటి తెగులు వచ్చినా, సాగులో ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా, శాస్త్రవేత్తలతో మాట్లాడి సత్వరం పరిష్కరించుకోవచ్చు. విదేశీ వ్యవసాయ శాస్త్రవేత్తలను కూడా అందుబాటులోకి తీసుకురావడం ఈ యాప్‌ ప్రత్యేకత. ప్రస్తుతానికి అమెరికా, కెనడా, మెక్సికో దేశాలకు చెందిన పలువురు శాస్త్రవేత్తల సేవలను ఉపయోగించుకుంటున్నారు.  స్థానిక వ్యవసాయ అధికారులను కూడా ఈ యాప్‌ ద్వారా సంప్రదించవచ్చు. రాష్ట్రంలోని అందరు ఏఈవోల వివరాలనూ  యాప్‌లో పొందుపరిచారు. రైతులు అవసరమైతే శాస్త్రవేత్తలను, లేకుంటే స్థానిక ఏఈవోలనైనా సంప్రదించవచ్చు. 

అపాయింట్‌మెంట్‌ ఆధారంగా..

శాస్త్రవేత్తలతో మాట్లాడాలనుకునే రైతులు ముందుగా అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా రైతు యాప్‌లో లాగిన్‌ అయి.. పంట ఆధారంగా శాస్త్రవేత్తను ఎంపిక చేసుకోవాలి. ఆ ప్రకారంగా శాస్త్రవేత్తల అపాయింట్‌మెంట్‌ను ఖరారు చేస్తారు. రైతు నేరుగా పంట సమస్యను వివరించి.. శాస్త్రవేత్తల నుంచి తగిన సూచనలు, సలహాలు పొందవచ్చు.

తాజావార్తలు


logo