గురువారం 13 ఆగస్టు 2020
Agriculture - Jul 22, 2020 , 23:27:09

అనగనగా..మునగ!

అనగనగా..మునగ!

  • చెట్లలో.. ‘మునగ’ స్థానం ప్రత్యేకం. ఈ చెట్టులోని ప్రతి భాగం..  దివ్యౌషధమే. మునగ కాయలు, ఆకులు, వేర్లలోనూ అపార పోషక విలువలు.
  • అందుకే.. వంటలతోపాటు వైద్యరంగంలోనూ దీని వాడకం పెరిగింది. ఫలితంగా, మార్కెట్‌లో ‘మునగ’కు మంచి గిరాకీ ఏర్పడింది. 
  • దీంతో,  పెరటితోటకే పరిమితమైన మునగ సాగు ‘వాణిజ్య’ అవతారమెత్తింది. సరైన సస్యరక్షణ చర్యలతో సాగు చేస్తే.. 

రైతుల చేతిలో సిరులు కురిపిస్తుంది. 

ఎవరినైనా అతిగా పొగిడితే ‘మునగ చెట్టు ఎక్కిస్తున్నాడు’ అంటారు. అలా అనుకున్నా సరే, మునగను ప్రశంసించాల్సిందే. ఎందుకంటే.. ఈ చెట్టులోని ప్రతి భాగం ఉపయోగపడేదే. ఇంట్లో ఓ మునగ చెట్టు ఉన్నదంటే.. ఒక కాయగూర.. ఒక ఆకుకూర ఉన్నట్లే. దీని వేర్లను కూడా ఆయుర్వేద మందుల్లో వాడుతారు. అందుకే.. మునగకు ఏడాదంతా గిరాకీ ఉంటుంది. ఈ పంట సాగుకు ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. దీంతో చాలామంది రైతులు మునగ సాగుపై దృష్టి సారిస్తున్నారు. 

సాగు విధానం

మునగకాయ, మునగఆకుల సాగు విధానంలో స్వల్పంగా తేడాలు ఉంటాయి. మునగకాయల సాగు విషయానికొస్తే.. మొక్క మొక్కకు మధ్య ఆరు మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. మొక్కలు పెరిగే క్రమంలో ఒకదాని కొమ్మలు, మరోదానిలో కలిసి గుబురుగా ఉండకుండా జాగ్రత్తపడాలి. ఈసాగులో నేరుగా విత్తనాలను పెట్టుకోవచ్చు లేదా మొక్కల్ని నాటుకోవచ్చు. విత్తనాలు పెట్టాలనుకునేవారు వానకాలంలో పెడితే మంచిగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. కేవలం ఆకు కోసమే సాగు చేయాలనుకుంటే మొక్కల మధ్య ఎక్కువ దూరం అవసరం లేదు. మధ్యలో  2.5 మీటర్లు ఉంటే సరిపోతుంది. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి ఏడు నుంచి పది రోజులకొకసారి నీళ్లు పారించాలి. పూత, కాత సమయంలో నాలుగు నుంచి ఆరు రోజులకు ఒకసారి నీళ్లు పెడితే మంచి దిగుబడి వస్తుంది. కొద్ది రోజుల్లోనే మొక్కలు ఆరు నుంచి పన్నెండు అడుగుల వరకు పెరుగుతాయి. ఆరు నెలలకే కాయలు చేతికొస్తాయి. మొదటి ఏడాది ఒక్కో చెట్టుకు 100 నుంచి 300 వరకు కాయలు కాస్తాయి. మిగిలిన పంటల మాదిరిగా మాటిమాటికీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. రోజూ కష్టపడాల్సిన పని లేదు. ఈ పంటకు తెగుళ్లు సోకడం కూడా తక్కువే. ఒకవేళ ఏదైనా సోకితే రెండు రోజులకోసారి వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలతో మందులను పిచికారి చేయాల్సి ఉంటుంది. 

‘పీకేఎం-1’తో మేలు..

మునగకాయ సాగులో గతంతో పోలిస్తే ప్రస్తుతం మేలైన, తొందరగా కాపుకొచ్చే రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యమైంది పీకేఎం-1 రకం. ఇవి మిగతావాటికంటే తొందరగా కాతకు వస్తాయి. ఒక ఎకరం భూమిలో మూడు ప్యాకెట్లు

(ఒక ప్యాకెట్‌ 100 గ్రా.) పీకేఎం-1 విత్తనాలు అవసరం అవుతాయి. ఒక్కో ప్యాకెట్‌ ధర రూ. 950 వరకు ఉంటుంది. అంటే ఎకరానికి విత్తనాల కోసం రూ. 3వేలు వెచ్చించాల్సి ఉంటుంది. వీటి ద్వారా ఎకరానికి 400-500 చెట్లు పెట్టుకోవచ్చు. అయితే, మునగ ఆకు సాగుకు సంబంధించి ఎలాంటి విత్తనం అయినా ఫర్వాలేదు. ఆకుకోసమే కాబట్టి ఏ రకం విత్తనం ఉపయోగించినా పెద్దగా తేడా ఉండదు. అయితే స్వదేశీ విత్తనాలు వాడితే మొక్క పెరిగే క్రమంలో చీడపీడల బాధ ఉండదు. రైతు ప్రశాంతంగా ఉండవచ్చు.

ఎనిమిది నెలల్లో తొలి పంట

బహువార్షిక విత్తనాలు సాగు చేస్తే తొలికాతకు కనీసం మూడు నుంచి నాలుగేండ్ల సమయం పడుతుంది. అదే పీకేఎం రకం విత్తనాల ద్వారా ఆరు నెలల్లోనే పూత వచ్చేస్తుంది. మరో రెండు నెలల్లో తొలికాత చేతికి వస్తుంది. ఏడాదిలో ఒక చెట్టుకు సగటున 500 నుంచి 600 కాయలు కాస్తుంది. సరైన యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే, ఏడాది పొడవునా కాయలు కాస్తూనే ఉంటాయి. మునగ సాగులో ఒకసారి విత్తనాలు నాటితే మూడు నుంచి నాలుగేండ్ల వరకూ పంట వస్తుంది. అయితే ఇందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా నీటిని క్రమం తప్పకుండా పెట్టాలి. చెట్లు ఎత్తు పెరగకుండా చూసుకోవాలి. ఇందుకోసం ప్రతి సంవత్సరం కత్తిరించాలి. దీంతో కింది భాగంలో కొత్త కొమ్మలు వస్తాయి. కాయలు ఎక్కువగా కాస్తాయి. చెట్టు పొడుగ్గా పెరగడం వల్ల ఆ ప్రభావం కాయలపై పడుతుంది.రైతు లాభపడతాడు.

సాఫ్ట్‌వేర్‌ నుంచి ‘సాగు’కు..

మెదక్‌ జిల్లా హవేలీ ఘణాపూర్‌ మండలం కూచన్‌పల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి సత్యనారాయణరెడ్డి బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.  స్వగ్రామంలో తనకున్న ఐదెకరాల్లో మునగ సాగు చేస్తున్నాడు. ఇందుకోసం  రూ.25వేలు పెట్టుబడి పెట్టాడు. కాత చేతికొచ్చిన తర్వాత కూలీల సహాయంతో మునగకాయలను కోసి.. స్వయంగా మెదక్‌, కామారెడ్డి, హైదరాబాద్‌ మార్కెట్‌లకు తరలిస్తున్నాడు. దళారుల బెడద కూడా లేకపోవడంతో ఆటో చార్జీలు మినహా మరే ఖర్చూ లేదని చెబుతున్నాడు. దీంతో ఎకరానికి రూ.లక్ష నుంచి రూ. 3 లక్షలకుపైగా ఆదాయం లభిస్తున్నదని అంటున్నాడు సత్యనారాయణరెడ్డి. వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్‌ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని, అందుకోసమే నియంత్రిత సాగు విధానాన్ని తెరపైకి తెచ్చారనీ ఆయన ప్రశంసిస్తాడు.  ఈ విధానం వల్ల రైతులు కూడా కొత్తరకం పంటల వైపు చూస్తున్నారని అంటున్నాడు.

  ‘మునగకాయల సాగులో పెట్టుబడి తక్కువ. లాభాలు అధికం. ఐదు ఎకరాల పంటలో రూ.4 లక్షల దాకా పెట్టుబడి పెట్టిన. మొదటి ఏడాది ఖర్చు కొంచెం ఎక్కువైనా.. ఆ తర్వాత ఏడేండ్ల దాకా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి పంటకూ అనుకున్న స్థాయిలోనే దిగుబడి వస్తున్నది. నీటి అవసరం కూడా చాలా తక్కువ. రెండుమూడు రోజులకోసారి నీటిని అందిస్తే చాలు. వారానికోసారి మునగకాయలను కోసి మార్కెట్‌కు తరలిస్తున్నం’ అంటాడు సత్యనారాయణ రెడ్డి.అదే రైతులను ఆకర్షిస్తున్నది మునగకాయల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుండటంతో ఈవైపు అడుగులేస్తున్నారు. మునగకాయ ధర స్థిరంగా ఉండటం కూడా రైతులను ఆకర్షిస్తున్నది. ఉపాధి హామీ ద్వారా ప్రతి ఎకరానికి రూ. 74వేలు సబ్సిడీ ఇస్తున్నాం. 

- మరియన్న డీఏవో, కొత్తగూడెం జిల్లా

ఆకుతోనూ ఆదాయం 

కొందరు రైతులు మునగకాయలకు బదులుగా కేవలం మునగ ఆకులనే సాగు చేస్తున్నారు. ఈ ఆకులతో తయారు చేసిన పొడికి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ పొడిలో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌ వంటి పోషకాలు ఉండటంతో ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా కేవలం పొడినే తినేవారు కూడా ఉన్నారు. మునగ ఆకు పొడి తయారీ తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఎక్కువగా ఉంది. ఇక్కడి రైతులు మునగ ఆకు సాగుతో ఏటా రూ.లక్ష నుంచి రూ. 1.5 లక్షల ఆదాయం పొందుతున్నారు. అయితే సేంద్రియ విధానంలో సాగు చేస్తేనే  పంటకు డిమాండ్‌ ఉంటుంది. ఇక మునగ ఆకు సాగును రైతు వ్యక్తిగతంగా చేయడం కష్టం. కొంతమంది గ్రూపుగా ఏర్పడితే లాభాలు వస్తాయి. మునగ పొడిని తయారు చేయడానికి ముందు.. పచ్చి ఆకును ఎండబెట్టాలి. దీనికోసం ప్రత్యేకంగా పాలిడ్రయర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా పొడిని  తయారు చేసి విక్రయించేందుకు వివిధ సంస్థల నుంచి అనుమతులు తెచ్చుకోవాలి. మునగ పొడికి సంబంధించి ఖమ్మం జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు చేపడుతున్నారు. రూ. 40 లక్షలతో పాలిడ్రయర్‌తోపాటు ఇతర మిషన్లను ఏర్పాటు చేస్తున్నారు. మహిళా గ్రూపులకు ఈ ప్రాజెక్టును అప్పగించనున్నారు. మునగ పొడిని గురుకుల హాస్టళ్లలోని విద్యార్థులకు అందించాలన్నది ప్రయత్నం.

కనీస ధరకు భరోసా

మునగ కాయల సాగుతో రైతుకు భారీ మొత్తంలో ఆదాయం మిగులుతుంది. ఒక ఎకరానికి ఏడాదికి అన్ని ఖర్చులూ పోను రూ. లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు నికర ఆదాయం చేతికొస్తుంది. మార్కెట్‌లో మునగ కాయల ధర కేజీకి రూ. 30 నుంచి రూ.50 పలుకుతుంది. కనీస ధర మాత్రం రూ.30కి తగ్గదు. ఈ లెక్కన పరిశీలిస్తే రైతుకు క్వింటాలుకు రూ.3వేల నుంచి రూ. 5వేలు వస్తుంది. మునగ కాయల సాగుతో రైతుకు కనీస ధర గ్యారెంటీ అనే భరోసా కలుగుతుంది. మునగ కాయల సాగుతో రైతుకు నిత్యం ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కొన్ని చెట్ల కాయలు తెంపేసరికి మిగిలిన చెట్ల కాయలు కోతకు వస్తాయి. ఇలా నిరంతరం కాయలు తెంపాల్సి ఉంటుంది.  

రూ. 74వేల రాయితీ..

  1. మునగకాయల సాగుకు రైతు పెట్టిన పెట్టుబడి కన్నా ఎక్కువే తిరిగి వస్తుంది. 
  2. ఎకరంలో సాగు కోసం.. పెట్టుబడి కింద విత్తనాలకు రూ.3వేలు, దున్నడానికి రూ.3వేలు, విత్తనాలు పెట్టేందుకు, ఎరువులకు ఇతర ఖర్చులకు కలిపి మొత్తంగా రూ.15వేలు వెచ్చించే అవకాశం ఉంది.
  3. ఉపాధి హామీ పథకంలో భాగంగా మునగ కాయల సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఈ విధంగా ఎకరానికి మొదటి ఏడాది రూ.74,272ల సబ్సిడీ వస్తుంది. దీంతో రైతు పెట్టుబడికి ఇబ్బంది ఉండదు.
  4. దీనికి తోడు మునగ కాయల సాగులో తొలి మూడు, నాలుగు నెలల పాటు కూరగాయలను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. వీటిద్వారా కూడా  అదనపు ఆదాయం పొందవచ్చు. 


logo