గురువారం 13 ఆగస్టు 2020
Agriculture - Jul 22, 2020 , 23:27:08

రైతుకు హాయి..‘బ్రెజిలియన్‌' బత్తాయి

రైతుకు హాయి..‘బ్రెజిలియన్‌' బత్తాయి

వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం.. ఒకప్పుడు ‘బత్తాయి’కి ప్రఖ్యాతి. 20 ఏండ్ల క్రితం  దాదాపు 10 వేల ఎకరాల్లో బత్తాయి విరగ కాసేది. కానీ, వాతావరణ మార్పులతో తోటలకు ఏదో మాయదారి వైరస్‌ (తెగులు) సోకింది. దీంతో.. బత్తాయి తోటలన్నీ కనుమరుగయ్యాయి. చాలామంది ఇతర పంటల వైపు మొగ్గుచూపారు. కొందరు రైతులు మాత్రం మొండిగా పలురకాల బత్తాయి మొక్కలను సాగు చేశారు. కానీ, ఒకటి రెండేండ్లకే మొక్కలన్నీ ఎండిపోవడంతో నిరాశకు గురయ్యారు. అయినా.. పట్టుదలతో సరికొత్త రకాల  అన్వేషణ మొదలు పెట్టారు. వీరికి ‘బ్రెజిలియన్‌ బత్తాయి’  ఓ వరంలా అనిపించింది.  

...? కొన్నె దేవేందర్‌రెడ్డి

వ్యవసాయరంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుడుతున్న ‘జైన్‌ ఇరిగేషన్‌ సంస్థ’ ప్రపంచంలోని ఉన్న అనేక రకాల బత్తాయిలపై పరిశోధనలు చేసింది. తెలంగాణలో 20 ఏండ్లపాటు నాణ్యమైన పంట దిగుబడి సాధించేలా మూడు రకాలను ఎంపిక చేసింది. 25 నుంచి 45 డిగ్రీల వేడిని, 700 నుంచి 1,200 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని తట్టుకొనేలా ఉన్న ఈ బత్తాయి రకాలను, మొదట మహారాష్ట్రలోని అమరావతిలో ‘జైన్‌ స్వీట్‌ ఆరెంజ్‌' పేరిట సాగుచేసింది. ఈ విషయం తెలుసుకొన్న వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు సహకార సంఘం ప్రతినిధులు అక్కడి తోటలను పరిశీలించడంతోపాటు జైన్‌ కంపెనీని కూడా సంప్రదించారు. కంపెనీ శాస్త్రవేత్తలు ఇక్కడి నేలలను పరిశీలించి, బ్రెజిలియన్‌ బత్తాయికి అనుకూలంగా ఉన్నాయని తేల్చారు. దీంతో రాష్ట్రంలో మొదటగా బ్రెజిలియన్‌ బత్తాయి (జైన్‌ స్వీట్‌ ఆరెంజ్‌) పెంపకానికి భీమదేవరపల్లిలో గత ఏడాది బీజం వేశారు. మొక్కల కొనుగోలు కోసం ముల్కనూరు రైతు సహకార సంఘం రుణాలు ఇవ్వడంతో పలువురు రైతులు ముందుకు వచ్చారు. 10 ఎకరాలతో మొదలు పెట్టి.. ఇప్పుడు 100 ఎకరాల్లో ఈ సరికొత్త బత్తాయిని సాగు చేస్తున్నారు. 

జలగావ్‌ నుంచి మొక్కలు

బ్రెజిలియన్‌ బత్తాయి మెక్కల పెంపకానికి మహారాష్ట్రలోని జలగావ్‌ జిల్లాలో జైన్‌ కంపెనీ ఒక నర్సరీని ఏర్పాటు చేసింది. వయసు ఆధారంగా ప్రతి మొక్కకూ రూ.220 నుంచి రూ.300 వరకు తీసుకొంటున్నది. ఎకరానికి 500 నుంచి 750 వరకు మొక్కలు నాటుకునే అవకాశం ఉన్నది. నాటిన 18 నెలల నుంచి దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో పండిస్తున్న రైతులకు టన్నుకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం సమకూరుతున్నది. 

భారీగా లాభాలు

భీమదేవరపల్లి మండలంలో గతేడాది నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరుగుతున్నాయి. మరో నాలుగైదు నెలల్లోనే కాయలు కాస్తాయని రైతులు చెబుతున్నారు. 8, 9, 10 నెలల కాల వ్యవధిలో పంట చేతికి వచ్చేలా శాస్త్రవేత్తలు వీటి విత్తన మొక్కలను రూపొందించారు. తద్వారా రైతులు పండించిన పంట ఒకేసారి కాకుండా, విడుతలవారీగా మార్కెట్‌కు వస్తుంది. ఫలితంగా ధరలు పతనం కాకుండా రైతుకు లాభం చేకూరుతుంది. మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ (ఎంఎఫ్‌ఐడీవోహెచ్‌) కింద ఉద్యానశాఖ మూడేండ్లకు రూ.16 వేలు పెట్టుబడి కోసం సబ్సిడీ ఇస్తుంది. ఈ డబ్బును నేరుగా రైతు ఖాతాలోనే జమచేస్తున్నది. డ్రిప్‌ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నది. ఉద్యానశాఖ అధికారులు ఈ తోటలను ఎప్పటికప్పుడు సందర్శిస్తున్నారు. 

ఆరోగ్యంగా పెరుగుతున్నయ్‌.. 

బ్రెజిలియన్‌ బత్తాయిని రెండెకరాల్లో నాటిన. ఏడాది కావస్తున్నది. మొక్కలు ఏపుగా పెరుగుతున్నయ్‌. మంచి దిగుబడి వస్తుందనుకుంటున్న. ఒకప్పుడు భీమదేవరపల్లి బత్తాయి అంటే మస్తు ఫేమస్‌. కానీ, కొన్నేండ్లుగా సాగు బందైంది. ఇప్పుడు మళ్లీ మా దగ్గర ఈ బత్తాయి సాగు కావడం సంతోషంగా ఉన్నది.

- మార్పాటి రాంరెడ్డి, రైతు, 

భీమదేవరపల్లి

బ్రెజిలియన్‌ పంట తీరు 

మొక్క ధర: నేలనుబట్టి రూ.220 నుంచి రూ.300

ఎకరానికి పట్టే మొక్కలు: 500 నుంచి 750

దిగుబడి: నాటిన 18 నెలల్లో ప్రారంభం

మొదట ఒక్కో మొక్కకు: 3-5 కిలోలు

పదేండ్ల తర్వాత: ఎకరానికి 15-20 టన్నులు

టన్ను ధర: రూ.40 వేల నుంచి రూ.50 వేలు

దేశీయ బత్తాయిలో ఉండే జ్యూస్‌: 34-40 శాతం

బ్రెజిలియన్‌ బత్తాయిలో జ్యూస్‌: 54 శాతం

దేశీయ బత్తాయిలో గింజలు: 30-40

బ్రెజిలియన్‌ బత్తాయిలో గింజలు: 0- 2


logo