యంత్రంతో సం‘పత్తి’

- పత్తి ఏరేందుకు సరికొత్త యంత్రాలు
- తప్పనున్న పెట్టుబడి ఖర్చులు
సేద్యానికి వ్యయం పెరిగిపోతున్న నేపథ్యంలో యాంత్రికీకరణ అనివార్యమవుతున్నది. ముఖ్యంగా పెట్టుబడి ఖర్చులను..కూలీల కొరతను అధిగమించేందుకు రైతాంగం యంత్రాలవైపు దృష్టి సారిస్తున్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచడంతోపాటు.. అధిక దిగుబడిని సాధించడంలో ఆధునాతన సాంకేతికత కీలక పాత్ర పోషిస్తున్నది.
పత్తి రైతులు ఎదుర్కొనే సమస్యల్లో కూలీల కొరత అత్యంత తీవ్రమైంది. విత్తడం మొదలుకొని పంట చేతికొచ్చే వరకూ ఏదో ఒకరకంగా వేధిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా పత్తి ఏరే సమయంలో ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటుంది. ఓవైపు చేతికొస్తున్న పంట.. మరోవైపు కూలీల కొరత రైతును తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంది. పత్తి ఏరడం ఆలస్యమైతే.. ఆ ప్రభావం నాణ్యత, ధరపై పడుతుంది. వెరసి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అయితే వ్యవసాయంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ఈ సమస్యకు సులువుగానే చెక్‌పెట్టే అవకాశం ఉన్నది. పలు కంపెనీలు పత్తి ఏరే యంత్రాలను (కాటన్ పికింగ్ మెషీన్లు) అభివృద్ధి చేస్తున్నాయి. దీంతో కర్షకుల కష్టాలు తీరనున్నాయి. వీటిలో భారీ యంత్రాలు మొదలుకొని, రైతులే వ్యక్తిగతంగా ఉపయోగించే చిన్నచిన్న మెషీన్లు కూడా ఉన్నాయి. వీటి వాడకంతో కూలీల సమస్యకు పరిష్కారం లభించడంతోపాటు, పెట్టుబడి ఖర్చును కూడా భారీగా తగ్గించుకునే అవకాశం ఉన్నది.
ధర తక్కువ.. ప్రయోజనం ఎక్కువ: పత్తి ఏరేందుకు పలు సంస్థలు మినీ యంత్రాలను తయారు చేస్తున్నాయి. భారత్‌లోని పరిస్థితులకు అనుగుణంగా, ఇక్కడి రైతులకు సౌకర్యంగా ఉండేలా జాగ్రత్తపడుతున్నాయి. రైతులు వ్యక్తిగతంగా ఉపయోగించుకునే యంత్రాలూ (హ్యాండ్ మెషీన్లు) వస్తున్నాయి. వీటి ధరలు కూడా అందుబాటులోనే ఉంటున్నాయి. కంపెనీని బట్టి ఒక్కో యంత్రం ఖరీదు రూ. 4వేలు మొదలు రూ.10వేల దాకా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన సదర్న్ ఇండియా మిల్స్ అసోసియేషన్ కాటన్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ సంస్థ (సైమా-సీడీ అండ్ ఆర్ఏ) వీటిని రూ.9500కు విక్రయిస్తున్నది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వానికి, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కి యంత్రాలను అందించింది.
బ్యాటరీతో
నడిచేలా: సీడీ అండ్ ఆర్ఏ రూపొందించిన పత్తి ఏరే యంత్రం బ్యాటరీతోనే పనిచేస్తుంది. ఎనిమిది గంటలు చార్జింగ్ చేస్తే.. ఎనిమిది గంటల పాటు ఉపయోగించుకోవచ్చు. చేతిలో పట్టుకుని పత్తిని సేకరించేలా, కేవలం అరకేజీ బరువులోనే దీన్ని తయారు చేశారు. మెషీన్ ద్వారా ఏరిన పత్తి నేరుగా సంచిలో పడే ఏర్పాటు ఉంది.
30 శాతం పెట్టుబడి ఆదా
పత్తిరైతులు ఎకరానికి రూ. 6 వేల నుంచి రూ. 7వేల దాకా కూలీలకే ఖర్చు చేస్తున్నారు. ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి వచ్చి, క్వింటాలుకు రూ.5500 ధర పలికితే రూ. 27,500 వరకూ ఆదాయం వస్తుంది. ఇందులో కూలీలకే రూ. 6 వేల నుంచి రూ.7వేలు ఖర్చు చేయగా.. మిగతా ఖర్చులు తీసేస్తే రైతుకు నామ మాత్రపు ఆదాయమే మిగులుతున్నది. కొన్ని యంత్రాలు నాణ్యమైన పత్తిని మాత్రమే తీసుకుని, చెడు పత్తిని వదిలేస్తాయి. ఫలితంగా రైతుకు గిట్టుబాటు ధర రావడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది.
అవసరమైన వారికి అందిస్తాం..
పత్తిని సేకరించడంలో యంత్రాల వాడకమే మంచిది. కూలీల సమస్యను అధిగమించడంతోపాటు పెట్టుబడి కూడా తగ్గుతుంది. పత్తి ఏరేందుకు మా సంస్థ తరఫున ప్రత్యేకమైన కాటన్ పికింగ్ హ్యాండ్ మెషీన్‌ను తయారు చేశాం. తమిళనాడు ప్రభుత్వం మా వద్ద కొనుగోలు చేసి రైతులకు అందించింది. సీసీఐకి కూడా కొన్ని యంత్రాలను సమకూర్చాం. ఒక్కో యంత్రం ధర రూ.9500గా నిర్ణయించాం. ఒకవేళ రైతులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తే ధర కూడా తగ్గిస్తాం. వివరాలకు 98422 24022, 98659 24022 నంబర్లను సంప్రదించవచ్చు లేదా www.simacdra.org వెబ్సైట్లో వివరాలు చూడవచ్చు.
- సెల్వరాజ్, సైమా-సీడీ అండ్ ఆర్ఏ, సెక్రెటరీ జనరల్
తాజావార్తలు
- వామపక్షాల ఆందోళన.. పోలీసుల లాఠీచార్జి ..వీడియో
- మేడిన్ ఇండియా వ్యాక్సిన్ తీసుకున్న నేపాల్ ఆర్మీ చీఫ్
- బాలిక డ్రెస్ పట్ల అభ్యంతరం.. స్కూల్ నుంచి ఇంటికి పంపివేత
- పెద్దగట్టు ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి జగదీశ్ రెడ్డి
- మోదీకి కొవాగ్జిన్.. కొవిషీల్డ్ సామర్థ్యంపై ఒవైసీ అనుమానం
- ఒప్పో ఫైండ్ ఎక్స్3 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్!
- సీతారాముల కల్యాణానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి
- విద్యార్థులతో కలిసి రాహుల్‌గాంధీ పుష్ అప్స్, డ్యాన్స్.. వీడియోలు
- నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా ? రేప్ కేసులో సుప్రీం ప్రశ్న
- కొవిడ్ -19 వ్యాక్సినేషన్లో మోదీజీ చొరవ : డాక్టర్ హర్షవర్ధన్