సేంద్రియ సాగుతో..కాటన్ దొరలే!

పత్తి సాగుకు అధిక మొత్తంలో పెట్టుబడి అవసరం అవుతుంది. ఒకవేళ దిగుబడి తగ్గితే, ఆ ప్రభావం రైతును ఆర్థికంగా కుంగదీస్తుంది. పెట్టుబడి ఖర్చు తగ్గించుకుంటేనే.. తెల్ల బంగారంగా ఖ్యాతిపొందిన పత్తి, రైతుపాలిట బంగారమవుతుంది. అలా పత్తిలో పెట్టుబడిని తగ్గించే ఏకైక మార్గం.. సేంద్రియ సాగు. ఈ విధానంతో రైతుకు పెట్టుబడి తగ్గడంతోపాటు ఆదాయం పెరుగుతుంది. దీనికి తోడు సేంద్రియ పద్ధతిలో పండించిన పంటకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్నది. దీంతో మార్కెటింగ్‌కు కూడా ఇబ్బంది లేదు. సేంద్రియ సాగులో రైతులకు మెళకువలు నేర్పించేందుకు, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలు(ఎఫ్డీసీ), ఎన్జీవోలు ముందుకొస్తున్నాయి. దీంతో ఏ మాత్రం ఇబ్బంది లేకుండానే పత్తిలో సేంద్రియ వ్యవసాయంపై పట్టు సాధించవచ్చు.
ఆరోగ్యంపై ప్రభావం..
సాధారణ పద్ధతిలో అధికంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల ఆ ప్రభావం రైతు ఆర్యోగంపై పడుతున్నది. ఆ అవశేషాలు రైతులపై పడి వారు అస్వస్థతకు గురవుతున్నారు. పలువురు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. పెట్టుబడి వ్యయాలకు తోడు దవాఖాన ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. సేంద్రియ సాగులో ఇలాంటి ఇబ్బందులేమీ ఉండకపోవం గమనార్హం.
పత్తి సాగులో సాధారణ పద్ధతి, సేంద్రియ పద్ధతి.. రెండు విధానాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. అయితే ఆర్గానిక్ సేద్యంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విత్తనాలు సేకరించడం, వాటిని విత్తడంలాంటి పనులు సాధారణ సాగులాగే ఉంటాయి. కానీ, మొక్క పెరుగుతున్న కొద్దీ తీసుకోవాల్సిన చర్యలు భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా సేంద్రియ సాగులో రైతులు సహజసిద్ధమైన ఎరువుల తయారీపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇందులో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పలు కంపెనీ (ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ)లు, ఎన్జీవోలు సహకరిస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రైతులను గ్రూపులుగా ఏర్పాటు చేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. ఎరువులు, పురుగు మందుల తయారీ, వాడకంతో పాటు అన్ని దశల్లోనూ తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నాయి. వారి సలహాలు, సూచనలు పాటిస్తే చాలు.. సేంద్రియ విధానంలో పత్తిని సాగు చేసి, అధిక ఆదాయం పొందవచ్చు.
విత్తనశుద్ధి
సేంద్రియ విధానంలో భాగంగా విత్తనాలపై దృష్టి పెట్టాలి. ప్రస్తుతం మనకు మార్కెట్లో బీటీ విత్తనాలే అందుబాటులో ఉండటంతో వాటిని సేంద్రియ పద్ధతికి అనుకూలంగా మారుస్తారు. ఇందులో భాగంగా వాటిని సేంద్రియ విధానంలో పేడ, సున్నం, గోమూత్రంతో చేసిన మిశ్రయంలో శుద్ధి చేస్తారు. తద్వారా భవిష్యత్‌లో ఎక్కువగా చీడపీడలు రాకుండా అడ్డుకునే వీలుంటుంది.
సగానికి పెట్టుబడి
సేంద్రియ విధానంలో.. పెట్టుబడి ఖర్చు సగానికి సగం తగ్గనుంది. అధికారిక లెక్కల ప్రకారం సాధారణ పద్ధతిలో ఎకరా పత్తి సాగుకు రూ. 29వేలు పెట్టుబడి అవుతుందని తేలింది. అదే సేంద్రియ విధానంలో రూ.15-18వేల లోపే అవుతుంది. సాధారణ సాగులో రసాయన ఎరువులు, పురుగు మందుల వల్లే పెట్టుబడి ఖర్చు ఎక్కువగా వస్తుంది. అదే సేంద్రియ విధానంలో రైతులే సహజసిద్ధంగా తమకు అందుబాటులో ఉండే వనరులతోనే ఎరువులు తయారు చేసుకోవడంతో భారీగా ఖర్చు తగ్గుతుంది.
అధిక దిగుబడి
సాధారణ పత్తి పంటతో పోల్చితే సేంద్రియ సాగులో పత్తి దిగుబడి ఎక్కువగా వస్తున్నది. ఫలితంగా రైతుకు ఆదాయం కూడా ఎక్కువగానే సమకూరుతున్నది. సాధారణ పద్ధతిలో ఎకరాకు 3-5 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తే, సేంద్రియ విధానంలో 5-7 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. ఇక సాధారణ పద్ధతిలో తొలి రెండేండ్లు కాస్త ఎక్కువ దిగుబడి వచ్చినా, ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. భూమిలోని సారం తగ్గిపోవడమే ఇందుకు కారణం. అదే సేంద్రియ విధానంలో తొలి రెండేండ్లు దిగుబడి కాస్త తక్కువగా వచ్చినా, ఆ తర్వాత నుంచి క్రమంగా పెరుగుతుంది. తొలిరెండేండ్లు భూమిలో వేసిన ఎరువుల వల్ల భూమి ఎక్కువ సారవంతంగా మారుతుంది. సేంద్రియ విధానంలో పత్తిని సాగు చేస్తున్న ఆదిలాబాద్, కరీంనగర్లలోని పలువురు రైతులు ఎకరాకు 6-7 క్వింటాళ్ల దిగుబడి తీస్తుండటం విశేషం.
20-25శాతం అధికంగా ఆదాయం
సాధారణ రైతుల కన్నా, సేంద్రియ విధానంలో పత్తి సాగు చేసిన రైతులు 20-25శాతం వరకు అధికంగా ఆదాయం పొందుతున్నారు. పెట్టుబడి ఖర్చు తగ్గుతుండటం, దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో రైతుకు ఆదాయం పెరుగుతున్నది. ధర విషయంలోనూ రెండింటి మధ్య వ్యత్యాసం ఉండటం గమనార్హం. సాధారణ పద్ధతిలో సాగు చేసిన పత్తి కన్నా సేంద్రియ పత్తి అధిక ధర పలుకుతున్నది. సాధారణ పద్ధతిలో సాగు చేసిన పత్తిని ఎంఎస్పీ లేదా అంతకన్నా తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుంది. కానీ, సేంద్రియ పత్తికి ఎంఎస్పీ కన్నా ఎక్కువ ధర నిర్ణయించి, అనేక కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ డిమాండ్ ఉండటంతో కంపెనీలే రైతు వద్దకు వెళ్లి కొంటున్నాయి.
ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా
నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఈ వానకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 60.16లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్ ఉన్న పంటను పండించడం వల్ల రైతుకు లాభం చేకూరుతుందనేది ప్రభుత్వ ఆలోచన. ఈ ఆలోచనకు అనుగుణంగా రైతులు పత్తిసాగులో సేంద్రియ విధానాన్ని అనుసరిస్తే అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
ఇతర మొక్కలతో పత్తికి రక్షణ
సాధారణంగా పత్తికి అధికంగా తెగుళ్లు సోకుతుంటాయి. ఆర్గానిక్ సాగులో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇతర మొక్కలను సాగు చేయడం వల్ల పత్తిని రక్షించుకోవచ్చు. బెండ, ఆముదం, బంతిపూలు, మక్కజొన్న వంటి పంటలను పత్తిలో అంతర పంటగా సాగు చేయాలి. అయితే ఎక్కువ మొత్తంలో నాటకూడదు. అక్కడక్కడా నాటడం వల్ల పత్తికి పురుగు పట్టకుండా అడ్డుకుంటాయి. పత్తికి పట్టే పురుగు ఈ మొక్కలపైకి వెళుతుంది. తద్వారా పత్తికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా మక్కజొన్నకు పట్టే క్రైసోపర్లా అనే పురుగు.. పత్తి పంటకు పట్టిన పురుగును తింటుంది. దీంతో ఎలాంటి ఎరువుల అవసరం లేకుండానే పత్తికి పట్టిన పురుగు నాశనమవుతుంది. రైతు లాభపడతాడు.
ఎరువుగా ఆకులు, పేడ..
పత్తిలో చీడపీడల్ని తొలగించేందుకు, అధిక దిగుబడి పొందేందుకు రైతులు ఎరువులు, పురుగు మందులను వాడుతుంటారు. దీంతో వ్యక్తిగతంగా రైతుకే కాకుండా సమాజానికి కూడా నష్టమే. సేంద్రియ విధానంలో రసాయన ఎరువులు, పురుగుల మందులకు స్థానం లేదు. వీటి స్థానంలో సహజసిద్ధంగా తయారు చేసిన బయో ఎరువులు, కంపోస్ట్ ఎరువులనే ఉపయోగిస్తారు. వీటిని రైతే సొంతంగా తయారు చేసుకోచ్చు. ఇందుకోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సాధారణంగా రైతులకు పశువులు ఉంటాయి. వాటి పేడ, మూత్రాన్నే సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగిస్తారు. ఒకవేళ రైతుకు పశువులు లేని పక్షంలో పేడను కొనుగోలు చేయవచ్చు. లేదంటే మార్కెట్లోనూ బయో ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అయితే, బయో ఎరువులను మార్కెట్లో కొనుగోలు చేస్తే పెట్టుబడి ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది.
కషాయాలే.. పురుగుల మందు
పత్తి పంటకు పురుగుల బెడద ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒక తెగులు వస్తూనే ఉంటుంది. వీటిని అరికట్టేందుకు సేంద్రియ పద్ధతిలో పలు పదార్థాలతో తయారు చేసిన కషాయాలను ఉపయోగిస్తారు. అల్లం-వెల్లుల్లి, వేప, మామిడాకులతో కషాయాన్ని తయారు చేస్తారు. ముఖ్యంగా మేక తినని ఆకుల నుంచి కూడా పురుగుల మందును తయారు చేస్తారు. మరికొన్ని మందులను పేడ, గోమూత్రం, ఆకులను కలిపి తయారు చేస్తారు. వీటి మిశ్రమాన్ని కొన్ని రోజులు మురగపెట్టి, వాటి నుంచి రసాయనాన్ని బయటకు తీస్తారు. ఒక లీటర్ నీటికి 5-10 మిల్లీలీటర్ల రసాయనాన్ని కలిపి చెట్టుపై స్ప్రే చేస్తారు. పురుగులపై రసాయన మందుల కన్నా సహజసిద్ధంగా తయారు చేసిన ఈ కషాయాలు ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. దీంతోపాటు మొక్కకు కూడా ఎలాంటి హాని చేయవు.
అంతర పంటలతో మేలు
సాధారణంగా పత్తిని ఏక పంటగా సాగు చేస్తారు. ఈ విధానం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పత్తిని ఏక పంటగా సాగు చేయడం వల్ల నేలసారం తగ్గి భూమి పనికి రాకుండా పోతుంది. ఈ సమస్యకు ఆర్గానిక్ సాగు విధానం చెక్ పెడుతుంది. ఆర్గానిక్ పత్తి సాగులో కచ్చితంగా అంతర పంటలను వేయాలి. కంది, పెసర, బబ్బెర, మక్కజొన్న వంటి పంటలను సాగు చేయవచ్చు. ఇవి గాలిలోని నత్రజనిని తీసుకొని భూమిలోకి పంపిస్తాయి. దీంతో భూసారం పెరుగుతుంది. భూమి సారవంతం కావడంతో పత్తి మొక్క మరింత నాణ్యంగా ఉండటంతోపాటు అధిక దిగుబడి ఇస్తుంది. ఆర్గానిక్ పత్తి సాగులో భాగంగా అంతర పంటలను వేయడం వల్ల పత్తికి మేలు జరగడంతోపాటు రైతుకు కూడా అదనపు ఆదాయం సమకూరుతుంది. స్వల్పకాలికమైన పప్పు దినుసు పంటలు వేయడం వల్ల రైతుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పంటలకు మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. అంతరపంటల వల్ల రైతుకు మరో ఉపయోగం కూడా ఉంది. అనివార్య పరిస్థితుల్లో పత్తి పంట నష్టపోయినా, ఆ నష్టాన్ని అంతరపంటల వల్ల పూడ్చుకునే అవకాశం ఉంటుంది.
సేంద్రియ సాగుపై శిక్షణ ఇస్తున్నాం..
సేంద్రియ పత్తి సాగు రైతులకు లాభదాయకం. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చు. ఈ విధానంలో అంతర పంటలనూ సాగు చేయిస్తాం. సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన కల్పించడంతోపాటు శిక్షణ కూడా ఇస్తున్నాం. రైతులతో కో-ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి, దాని ద్వారానే శిక్షణ ఇవ్వడంతోపాటు పత్తి కొనుగోళ్లు కూడా చేయిస్తున్నాం. దళారుల బెడద లేకుండా రైతులే తమ పంటను విక్రయించే అవకాశం కల్పిస్తున్నాం.
- ఎం.అశోక్ కుమార్, చేత్న ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్
ఖర్చు తగ్గి, ఆదాయం పెరిగింది..
సేంద్రియ విధానంలో పత్తిసాగు చేయడం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గి, ఆదాయం పెరిగింది. గతంలో కేవలం పత్తి మాత్రమే సాగు చేసేవాళ్లం. అందులో నష్టం వస్తే ఏం చేయలేకపోయేవాళ్లం. కానీ, సేంద్రియ విధానంలో పత్తిలో అంతర పంటలను కూడా వేస్తున్నాం. దాని ద్వారా కూడా అదనపు ఆదాయం వస్తున్నది.
- ఇంద్రూ, రైతు, ఆదిలాబాద్