అగ్రోడాక్ యాప్

ఆధునాతన సాంకేతికతతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతున్నది. ఉన్నత విద్యావంతులైన యువత కూడా వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కొంతమంది తెగుళ్లు, వాటి నివారణ చర్యలపై సరైన అవగాహన లేక ఇబ్బంది పడాల్సి వస్తున్నది. వారి తిప్పలు తొలగించేందుకే ‘అగ్రో డాక్ యాప్' అందుబాటులోకి వచ్చింది. పంటలను ఆశించే తెగుళ్లను గుర్తించేందుకు కొచ్చికి చెందిన నవనీత్ కృష్ణ అనే విద్యార్థి, దీనిని డెవలప్ చేశాడు. ఈ యాప్ పంటలకు సోకే తెగుళ్లను గుర్తించడంతోపాటు నివారణ కోసం వాడాల్సిన మందుల వివరాలను సూచిస్తుంది. స్మార్ట్ ఫోన్ కలిగిన రైతులు యాప్ ద్వారా మొక్కను లేదా ఆకును స్కాన్ చేస్తే చాలు.. పంటకు వచ్చిన తెగుళ్లను ఆ యాప్ గుర్తిస్తుంది. తెగుళ్లతో దెబ్బతిన్న పంటల గురించి తెలుసుకొని, వాటిపై లోతైన అధ్యయనం చేసి ఈ యాప్‌ను తయారు చేసినట్లు నవనీత్ కృష్ణ చెబుతున్నారు. ఈ యాప్ ఇటీవల గూగుల్ డెవలపర్ చాలెంజ్‌లో..టాప్-10లో చోటు సంపాదించింది.‘దేశానికి రైతే ఆధారం. అతడికి అండగా నిలబడటానికే నా ప్రయత్నం’ అంటాడు నవనీత్.