మంగళవారం 14 జూలై 2020
Agriculture - Jun 17, 2020 , 23:46:21

ఆయిల్‌ పామ్‌.. ఆదాయం ఫుల్‌

ఆయిల్‌ పామ్‌.. ఆదాయం ఫుల్‌

  • రాష్ట్రంలో సాగుకు అనుకూలం రైతుకు లాభదాయకం 

రైతులు ఎంత కష్టపడ్డా ఆదాయం కోసం ఆరు నెలలైనా వేచి చూడాల్సిందే. కొన్నిసార్లు పంట పెట్టుబడి రావడం కూడా డౌటే. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల మాదిరిగా ప్రతి నెలా రైతుల ఖాతాల్లో డబ్బులు జమైతే..? అది కూడా పదేండ్ల్ల నుంచి 15 ఏండ్ల పాటు ప్రతి నెలా జీతం వచ్చినట్లు వస్తే..? ఆ రైతుకు కలిగే సంతోషమే వేరు. ఇప్పుడు ఆ సంతోషం.. ఆయిల్‌ పామ్‌ సాగుతో సాధ్యమయ్యే అవకాశం ఉన్నది. తక్కువ శ్రమ.. అతితక్కువ పెట్టుబడితో ఆశించిన ఆదాయం చేతికి వస్తుంది. 

ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూల వాతావరణం ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. ఉమ్మడి రాష్ట్రంలో సరైన నీటి సౌకర్యం లేక, ఈ సాగుపై రైతులకు ఆసక్తి తగ్గింది. కానీ, నాలుగైదేండ్లలో పరిస్థితి మారింది. సీఎం కేసీఆర్‌  చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటికి ఇబ్బందులు తొలగిపోయాయి. చెరువులు, కుంటలు నిండుతున్నాయి. భూగర్భ జలాలు పెరిగాయి. 24 గంటల ఉచిత విద్యుత్‌ కూడా తోడవ్వడంతో ఆయిల్‌ పామ్‌ సాగుకు ఉన్న అడ్డంకులు మటుమాయం అయ్యాయి.

మొక్కల ఎంపిక ముఖ్యం 

ఆయిల్‌ పామ్‌ సాగు చేయాలనుకునే రైతులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తున్నది. మొక్కలు నాటడం నుంచి మార్కెటింగ్‌ వరకు అన్ని రకాలుగా అధికారులు సూచనలు, సలహాలు అందిస్తారు. ఆయా జిల్లాల్లో ఉండే కంపెనీలే రైతులకు సబ్సిడీ ద్వారా మొక్కలను అందిస్తాయి. నాటే సమయంలో మొక్క వయసు 13 నెలలు ఉండాలి. అయితే వీటిని పరిమిత సంఖ్యలోనే నాటాల్సి ఉంటుంది. ఎకరానికి 57 మొక్కలను మాత్రమే నాటాలి. ఒక్కో మొక్క మధ్య దూరం 9x9 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. లేకుంటే చెట్లు పెరిగేందుకు వీలులేక చనిపోయే ప్రమాదం ఉన్నది. అదే విధంగా చెట్లు గుబురుగా పెరిగిన తర్వాత సరైన గాలి, వెలుతురు లేకపోతే దిగుబడి తక్కువగా వస్తుంది.


మన నేలలు అనుకూలం 

ఆయిల్‌ పామ్‌ సాగుకు సౌడు నేలలు మినహా అన్ని రకాల భూములూ అనుకూలంగా ఉంటాయి. నేలలో సులువుగా నీరు ఇంకిపోయే గుణం కలిగి ఉండాలి. ముఖ్యంగా ఎర్ర నేలలు ఆయిల్‌ పామ్‌ సాగుకు అత్యంత అనుకూలం. వీటితోపాటు ఇసుకతో కూడిన ఎర్ర నేలలు, ఒండ్రుతో కూడిన ఎర్ర నేలల్లోనూ సాగు చేయవచ్చు. 

నీటి అవసరం ఎక్కువే 

దీని సాగుకు నీళ్లు సమృద్ధిగా ఉండాలి. ఆరుతడి పంట అయినప్పటికీ రోజూ ఒక్కో చెట్టుకు కనీసంగా 200 లీటర్ల నీళ్లు పట్టాలి. వేసవిలో మరో 50 లీటర్లు అదనం. అయితే వరి పంటతో పోలిస్తే ఆయిల్‌ పామ్‌ సాగుకు తక్కువ నీరే అవసరమవుతుంది. ఒక ఎకరం వరి సాగుకు ఖర్చయ్యే నీటితో, నాలుగెకరాల్లో ఆయిల్‌ పామ్‌ను సాగు చేయవచ్చు. నీటి పారకానికి డ్రిప్‌ సిస్టం ఉపయోగించడం ద్వారా చెట్లకు అవసరమైన నీటిని సులువుగా అందించవచ్చు. చెట్టు మొదల్లో నిత్యం తడిగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 

పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ

మిగతా పంటలతో పోలిస్తే అయిల్‌ పామ్‌ సాగుకు పెట్టుబడి తక్కువగా ఉంటుంది. మొదటి మూడేండ్లూ సుమారు రూ. లక్ష పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇందులో తొలి యేడాది రూ.50వేలు కాగా, మిగతా రెండేండ్లకు మరో రూ. 50వేల దాకా ఖర్చవుతుంది. మొదటి యేడాది  భూమి దున్నడం, మొక్కల కొనుగోలు, నాటడం, బోర్‌ వేయడం, డ్రిప్‌ సిస్టం కొనుగోలు.. ఇలా పలు రకాల పనులకు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది.  పంట దిగుబడి వచ్చే నాలుగో ఏడాది నుంచి పెట్టుబడి ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఏటా సుమారు రూ.20వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఆదాయం విషయానికొస్తే ప్రస్తుతం ఒక టన్నుకు రూ.9500 ధర పలుకుతున్నది. ఒక ఎకరానికి కనీసం 10 టన్నుల దిగుబడి వచ్చినా, రైతుకు రూ.95వేల ఆదాయం వస్తుంది. ఇందులో పెట్టుబడి రూ. 20వేలు తీసేస్తే, కనీసంగా రూ.75వేలు మిగులుతాయి. 12 టన్నులు ఉత్పత్తి అయితే రూ. 94వేల దాకా మిగిలే అవకాశం ఉన్నది. ఇక అంతర పంటలు సాగు చేయడం ద్వారా ఏడాదికి మరో రూ.24 వేల దాకా ఆదాయం పొందవచ్చు. మొదటి మూడేండ్ల పాటు పత్తి, మిర్చి, కూరగాయలు, ఇతర పంటలు వేసుకున్నా, నాలుగైదేండ్ల   తర్వాత కోకో పంటను సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుంది. మలబార్‌, శాండిల్‌ ఉడ్‌, వెదురులాంటి చెట్లను వ్యవసాయ క్షేత్రం చుట్టూ నాటితే భారీగా అదనపు ఆదాయం పొందవచ్చు. 

చీడ పీడల బాధలేదు 

వ్యవసాయంలో చీడ పీడల బాధ వర్ణనాతీతం. కానీ, ఆయిల్‌ పామ్‌ సాగులో మాత్రం ఆ బాధ ఉండదు. ఈ చెట్లకు ఎలాంటి చీడలు పట్టవు. ఈ చెట్లు తుపానులు, భారీ వర్షాలు, ఈదురు గాలులను తట్టుకొని నిలబడతాయి. ఆయిల్‌ పామ్‌ పంటకు కోతుల బెడద ఉండదు. ఇతర పశువుల నుంచి కూడా ఎలాంటి హానీ జరగదు. దీంతోపాటు దొంగల భయం కూడా తక్కువే. ఒకవేళ ఎవరైనా గెలలను దొంగిలించినా వాటిని మార్కెటింగ్‌ చేసుకోవడం సాధ్యం కాదు. 

2.70 లక్షల ప్రోత్సాహం 

ఆయిల్‌ పామ్‌ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. మొక్కల కొనుగోలు నుంచి ఎరువుల దాకా ప్రతి దశలో సబ్సిడీలు అందిస్తున్నాయి. మొదటి నాలుగేండ్లలో కేంద్రం నుంచి     రూ. 2.70 లక్షల దాకా సబ్సిడీ అందనున్నది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీలో డ్రిప్‌ సిస్టం అందిస్తున్నది. అదేవిధంగా రైతుబంధుతో ప్రతి ఎకరానికీ రూ. 10వేలు ఇస్తున్నది. ఈ విధంగా చూసినట్లయితే ఆయిల్‌ పామ్‌ పెట్టుబడి ఖర్చు లేని సాగుగా చెప్పుకోవచ్చు. 

మార్కెటింగ్‌ సమస్యకు చెక్‌ 

ఆయిల్‌ పామ్‌ రైతులను తీవ్రంగా వేధించే మార్కెటింగ్‌ సమస్యకు ప్రభుత్వం చెక్‌పెట్టింది. ప్రతి జిల్లాకు ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసేలా ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహిస్తున్నది. ఆయా జిల్లాల్లో ఉండే కంపెనీ.. అక్కడి ఆయిల్‌ పామ్‌ సాగును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. రైతులకు మొక్కలు ఇవ్వడం మొదలుకొని చెట్లు నాటడం, ఎరువుల వాడకం, క్రాప్‌ కటింగ్‌, మార్కెటింగ్‌లాంటి అన్ని విషయాల్లోనూ అండగా ఉంటారు. ఇందు కోసం నామమాత్రంగా చార్జీలు వసూలు చేస్తారు. ఆయిల్‌ పామ్‌ సాగు చేసే ప్రతి రైతుకూ ప్రత్యేక గుర్తింపు కార్డును జారీ చేస్తారు. దీని ఆధారంగానే పంట కొనుగోలు చేస్తారు. 

15 రోజులకోసారి డబ్బులు 

ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతుకు ప్రతి 15 రోజులకోసారి డబ్బులు చేతికొస్తాయి. ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ఒక్కో చెట్టు గెలలు ఒక్కోసారి పక్వానికి వస్తుంటాయి. దీంతో ప్రతి 15 రోజులకోసారి గెలల్ని కోయాల్సి ఉంటుంది. వాటిని గంటల వ్యవధిలోనే కంపెనీకి చేర్చాలి. దీంతో దిగుబడికి తగ్గట్లు కంపెనీనే నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది. ఉద్యోగుల మాదిరిగా రైతుకు కూడా ప్రతి నెలా డబ్బులు చేతికొచ్చే అవకాశం ఉంటుంది. 

60 శాతం దిగుమతి 

పొద్దుతిరుగుడు, వేరుశనగ సాగు తగ్గుతుండటం తో దేశవ్యాప్తంగా పామాయిల్‌కు డిమాండ్‌ పెరుగుతున్నది. ఇంటి అవసరాలతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఆహార పదార్థాల తయారీ కంపెనీలు పామాయిల్‌నే ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. కానీ, దేశంలో పామాయిల్‌ కొరత తీవ్రంగా ఉంది. దేశీయ అవసరాల్లో 60 శాతం పామాయిల్‌ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఇందుకోసం ఏటా కేంద్రం రూ.75వేల కోట్లను ఖర్చు చేస్తున్నది. ఈ నేపథ్యంలో దేశంలో పామాయిల్‌ సాగు ను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16 రాష్ర్టాల్లో కేవలం 3లక్షల హెక్టార్లలోనే ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్నారు. ఇది దేశ అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా 20 లక్షల హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ సాగు చేసేలా ప్రణాళికలు రూపొందించడంతోపాటు రాష్ర్టాలను కూడా ప్రోత్సహిస్తున్నది.

నిరంతర దిగుబడి 


ఆయిల్‌ పామ్‌ సాగులో మొక్క నాటిన నుంచి మూడేండ్ల వరకు ఎలాంటి ఆదాయం ఉండదు. నాలుగేండ్ల నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. మొదటిసారి ఎకరానికి సుమారు ఆరు టన్నుల దిగుబడి వస్తుంది. ఆ తర్వాత ఏటేటా ఉత్పత్తి పెరుగుతూ గరిష్ఠంగా ఏడాదికి 16 టన్నుల దాకా దిగుబడి వస్తుంది. అయితే రైతుల సాగు విధానంపైనే ఉత్పత్తి ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఆర్గానిక్‌ ఎరువుల వాడకంతో మంచి దిగుబడి వస్తుంది. సగటున ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. ఇక ఒక చెట్టు జీవిత కాలం 25 నుంచి 30 ఏండ్ల్లు ఉంటుంది. దాదాపు 15 ఏండ్ల్ల దాకా మంచి దిగుబడి ఇస్తుంది. ఆ తర్వాత క్రమంగా దిగుబడి తగ్గుతుంది. అయితే చెట్ల జీవిత కాలం మరో మూడు నాలుగేండ్లలో  ముగుస్తుందనగా, ఆదే భూమిలో కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు. తద్వారా ప్రస్తుత చెట్ల జీవితకాలం ముగియగానే కొత్త వాటి పంట చేతికొస్తుంది. 

తెలంగాణలో 7.64లక్షల ఎకరాల్లో.. 


తెలంగాణలో 7.64లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి దశలో ఆయిల్‌ పామ్‌ సాగుకు అవసరమయ్యే 24 జిల్లాలను గుర్తించింది. ఆయా జిల్లాల్లో 3,09,431 ఎకరాల్లో సాగుకు అనుమతులిచ్చింది. ఆ తర్వాత క్రమంగా 7లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణాన్ని పెంచనున్నది. ఈ 24 జిల్లాల్లోనూ ఆయిల్‌ ప్రాసెసింగ్‌ కంపెనీల ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందుకోసం ప్రైవేటు కంపెనీల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రస్తుతం ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి, నల్గొండ జిల్లాల్లోని 50వేల ఎకరాల్లో మాత్రమే ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తుండగా, సుమారు 38వేల టన్నుల ముడి పామాయిల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 

అన్ని విధాలా సహకరిస్తాం

సీఎం కేసీఆర్‌ తీసుకున్న చర్యలతో ఆయిల్‌ పామ్‌ సాగుకు తెలంగాణ అనువుగా మారింది. ప్రభుత్వం కూడా రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఆయిల్‌ పామ్‌ సాగు రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగుల మాదిరిగా ప్రతి నెలా డబ్బులు చేతికొస్తాయి. పెట్టుబడికి ఇబ్బంది లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలను అందిస్తున్నాయి. సాగులో ఉద్యాన శాఖ తరుఫున అన్ని విధాలుగా సహకరిస్తున్నాం. ఆయిల్‌ పామ్‌ సాగు చేయాలనుకునే రైతులు ఆయా జిల్లాల ఉద్యాన అధికారులను కలిస్తే పూర్తి వివరాలు అందిస్తారు. 

- వెంకట్రామిరెడ్డి, డైరెక్టర్‌, ఉద్యాన శాఖ

పొద్దుతిరుగుడు, వేరుశనగ సాగు తగ్గుతుండటంతో దేశవ్యాప్తంగా పామాయిల్‌కు భారీగా డిమాండ్‌ పెరుగుతున్నది. ఇంటి అవసరాలతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఆహార పదార్థాల తయారీ కంపెనీలు పామాయిల్‌నే ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. కానీ, డిమాండ్‌కు తగ్గట్లు దేశంలో ఉత్పత్తి లేకపోవడంతో పామాయిల్‌ కొరత తీవ్రంగా ఉంది. దేశ అవసరాల్లో 60 శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఇందుకోసం కేంద్రం ఏటా రూ.75వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. 


logo