ఆదివారం 24 మే 2020
Agriculture - Mar 18, 2020 , 22:26:11

చదివింది బీటెక్‌ పట్టింది నాగలి

చదివింది బీటెక్‌ పట్టింది నాగలి

  • సాంకేతిక రంగం నుంచి సాగుబడిలోకి... 
  • పండ్ల తోటల సాగులో ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన సుభాష్‌రెడ్డికి న్యూజిలాండ్‌లోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చింది. సుభాష్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కానీ అది ఎన్నో రోజులు లేదు. నేను న్యూజిలాండ్‌ వెళ్లనంటే వెళ్లనని సుభాష్‌రెడ్డి కరాఖండీగా చెబితే ఆ తల్లిదండ్రులు విస్తుపోయారు. చివరికి సుభాష్‌రెడ్డి చెప్పిన సమాధానానికి సంతోషపడ్డారు. సుభాష్‌రెడ్డిని ఆ తల్లిదండ్రులు ఏం ప్రశ్నడిగారు.. సుభాష్‌రెడ్డి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..

‘మిమ్మల్ని వదిలి న్యూజిలాండ్‌ వెళ్లడం లేద’ని చెప్పిన సుభాష్‌రెడ్డిని ఆయన తల్లిదండ్రులు ‘మరిక్కడేం చెస్తావ’ని ప్రశ్నించారు. ‘మనకున్న ముప్ఫై ఎకరాల్లో వ్యవసాయం చేస్తా’నని సమాధానం చెప్పారు. ఆ సమాధానాన్ని స్వాగతించిన సుభాష్‌రెడ్డి తల్లిదండ్రులు బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ చెప్పి తప్పుకున్నారు. అంతే వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాడు.జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన ఈ యువరైతు పదేండ్ల కిందట సేద్యాన్ని ఆరంభించిన అందరిలాగే వరిని సాగుచేయడం మొదలుపెట్టాడు. అయితే అనుకున్న స్థాయిలో దిగుబడి రాలేదు. 

ఆహారపంటల కంటే, ఉద్యానవన పంటలకు మంచి భవిష్యత్తు ఉంటుందని గ్రహించాడు. ఉద్యానవనశాఖ అధికారులతో చర్చించి జామ పంటను ఎంచుకున్నాడు. సుభాష్‌రెడ్డి మూడేండ్ల కిందట ఐదెకరాల విస్తీర్ణంలో ఎకరానికి నాలుగు వందల చొప్పున మొత్తం రెండు వేల జామ మొక్కలను నాటాడు. 11 నెలల్లోనే తొలి జామపంట చేతికివచ్చింది. జామతోటను మొదట గుత్తేదారులకు అప్పగించిన సుభాష్‌రెడ్డి తర్వాత తానే స్వయంగా జామ సాగు చేశాడు. నవంబర్‌లో జామ సీజన్‌ ముగిసిపోయింది. ఇప్పుడు మరో సీజన్‌కు సుభాష్‌రెడ్డి జామ తోట సిద్ధమైంది. అంతేకాదు మూడు నెలల కిందట రెండెకరాల్లో సీతాఫలం  మొక్కలను కూడా నాటాడు. శాస్త్రీయ పద్ధతిలో సాగుతున్న సీతాఫలం తోట ఈ ఏడాది అక్టోబర్‌ వరకు కాతకు వస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు సుభాష్‌రెడ్డి. జామ, సీతాఫలంతో పాటు, పదిహేను ఎకరాల్లో మామిడి తోటను సాగు చేస్తున్నాడు. ఉద్యానవన పంటల్లో అధిక ఆదాయంతో పాటు, సంతోషం, తృప్తి కూడా ఉంటుదంటున్నాడు.


ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా డ్రాగన్‌ఫ్రూట్‌ 

డ్రాగన్‌ఫ్రూట్‌ విదేశాల్లో విరివిగా సాగవుతున్న ఉద్యానవన పంట. ఔషధ గుణాలు కలిగినదిగా గుర్తింపు పొందిన డ్రాగన్‌ఫ్రూట్‌ షుగర్‌ ను తగ్గించడంతో పాటు కొవ్వును కరగిస్తుంది. రక్తకణాలను పెంపొం దిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. డ్రాగన్‌ ప్రూట్‌ సాగుపై అధ్యయనం చేసిన సుభాష్‌రెడ్డి ఏడు నెలల కిందట రెండెకరాల్లో సాగు మొదలు పెట్టాడు. మరో నాలుగు మాసాల్లో డ్రాగన్‌ఫ్రూట్‌ తొలి పంట చేతికి రాబోతున్నది.  

డ్రాగన్‌ఫ్రూట్‌ ప్రత్యేకతలు

ఇది ఎడారి జాతికి చెందిన మొక్క కావడంతో పెద్దగా నీటి అవసరం ఉండదు. ఎడారిలో 50 సెంటీమీటర్ల వర్షం సరిపోతుంది. సేంద్రియ ఎరువులు వేస్తే మంచి దిగుబడి వస్తుంది. ఒక్కసారి డ్రాగన్‌ మొక్కను నాటినట్లయితే 20 నుంచి 30 ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది. 15 రోజులకోసారి తేలికపాటి నీటి తడిని డ్రిప్‌ ద్వారా అందించాలి. నీరు నిలిచే బంక నేలలు మినహా అన్ని నేలలూ డ్రాగన్‌ఫ్రూట్‌ సాగుకు అనుకూలంగా ఉంటాయి. 


ఏడాది మొత్తం కాత వస్తుంది

సాధారణంగా డ్రాగన్‌ మొక్కలు తొలి కాత కాయడానికి రెండు నుంచి మూడేండ్ల సమయం పడుతుంది. కానీ డబుల్‌ గ్రాఫ్టింగ్‌ పద్ధతిని ఉపయోగించి పంట సాగు చేసినట్లయితే కేవలం ఎనిమిది నెలల్లోనే తొలి దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సహజంగా డ్రాగన్‌ ఫ్రూట్‌ దిగుబడి కాలం జూన్‌-అక్టోబర్‌ మధ్యకాలం. కానీ నవంబర్‌-జనవరి మధ్యకాలంలో డ్రాగన్‌ మొక్కలకు విద్యుత్తు లైట్ల ద్వారా కాంతిని అందిస్తే, జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే మొక్కలు పూతకు వచ్చే లా చేయవచ్చు. ఇలా చేస్తే 30 శాతం అధిక దిగుబడి వస్తుంది.


ఇలా సుభాష్‌రెడ్డి చేసిన సాహసం రాష్ట్రంలోని పలువురు యువకు లకు స్ఫూర్తినిస్తుందని వ్యవసాయాధికారులతో పాటు స్థానికులు అంటున్నారు. 

- కొత్తూరి మహేశ్‌, 9182777507, జగిత్యాల ప్రతినిధి

- బానుక శ్రీనివాస్‌, 9490530001, జగిత్యాల టౌన్‌

ఎకరాకు ఏడాదికి రూ.9 లక్షల ఆదాయం  

డ్రాగన్‌ ఫ్రూట్‌ పూత వచ్చిన 45 రోజుల్లో పండు తయారవుతుంది. నాటిన ఏడాదిలోనే దిగుబడి ప్రారంభం అవుతుంది. జూన్‌ మాసం నుంచి పూత రావడం ప్రారంభమై మూడవ సంవత్సరంలో ఆరు టన్నుల దిగుబడి లభిస్తుంది. పిలకలను కత్తిరించి నర్సరీలో మొక్కలు పెంచి రైతు అమ్ముకోవచ్చు. టన్ను ధర రూ. లక్షా 50 వేలు ఉంటుంది. ఒక సంవత్సరంలో వచ్చే ఆరు టన్నుల దిగుబడికి రూ.9 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. 


logo