బుధవారం 08 ఏప్రిల్ 2020
Agriculture - Mar 18, 2020 , 22:21:18

వరిలో కరివేత

వరిలో కరివేత

  • వెదజల్లే పద్ధతిలో సాగు

ఖమ్మం జిల్లాలో మెట్ట, మాగాణీలో సైతం (కరివేత) వెదజల్లే పద్ధతి ద్వారా సాగుచేసే విధానం పెరుగుతున్నది. దీంతో ఈ ఏటా జిల్లావ్యాప్తంగా దాదాపు 59,361 హెక్టార్లలో వాన కాలంలో వరిపంట సాగయింది. దీంట్లో వెదజల్లే పద్ధతిలోనే సుమారు 8 వేల హెక్టార్లలో సాగుచేసి మంచి ఫలితాలు సాధించారు. సీజన్‌ ఆరంభంలో ఆశించిన మేర వర్షపాతం లేనప్పటికీ కృషి విజ్ఞాన శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించిన సత్తుపల్లి, వైరా, ఖమ్మం నియోజకవర్గం పరిధిలోని ముప్ఫై వేల మంది రైతులు ఈ పద్ధతి ద్వారా సాగుచేశారు. కొందరు రైతులు ఆయిటి మొదట్లో దుక్కుల్లోనే విత్తనాలు చల్లి సాగు చేయగా, మరికొందరు రైతులు మాత్రం విత్తనాలు ఎదబెట్టే యంత్రాల సాయంతో విత్తనాలు నాటుకున్నారు. 

అనంతరం కురిసిన వానలతో ఆశించిన దానికంటే అధికంగా దిగుబడులు వచ్చాయి. గతేడాది జిల్లావ్యాప్తంగా పదుల సంఖ్యలో ఈ విధానం సాగుచేసిన రైతాంగం, ఈయేడు సీజన్‌ ఆరంభంలో వానలు రాకపోవడంతో ఇదే విధానం మరికొంత మంది రైతు లు పాటించారు. రైతుల ఆసక్తిని పరిగణనలోకి తీసుకున్న వ్యవసాయశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సైతం క్షేత్రస్థాయిలో పర్యటన చేసి పరిశీలన చేశారు. ఈ పద్ధతి ద్వారా అనేక ప్రయోజనాలున్నాయని గ్రహించిన అధికారు లు, రైతులకు కావాల్సిన విత్తనాలు, ఇతర యంత్ర పరికరాలు అందజేశారు. అలాగే ఇతర మండలాల రైతులను సైతం ఫీల్డ్‌ విజిట్‌ చేయించి అవగాహన కల్పించారు.

సాగు చేసే విధానం..

సాధారణంగా వరి సాగుకు దమ్ము చేసి కూలీలతో నాట్లు వేస్తారు. అలాగే నాటే యంత్రాలతో వరి నాట్లు వేసుకోవడం, దమ్ముచేసిన పొలంలో డ్రమ్ము సీడర్‌ పద్ధతి ద్వారా విత్తుకోవ డం, వెదజల్లడం ద్వారా విత్తుకోవడం వంటి విధానాలు పాటిస్తారు. చెరువుల కింద, బావుల దగ్గర దమ్ముకు సరిపడా నీరు అందుబాటులో లేని సమయంలో వెదజల్లే పద్ధతి అనుసరించవచ్చు. వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేసుకోవాలంటే సీజన్‌ ఆరంభంలోనే పొడి దుక్కులు దున్నుకొని నేరుగా గానీ, సీడ్‌ డ్రిల్‌తో కానీ విత్తుకోవచ్చు. వరి విత్తనాలకు సంబంధించి 1001, బీపీటీ 5204 వంటి విత్తన రకాలను విత్తుకోవచ్చు. ఎకరానికి 14-16 కిలోల విత్తనాలు మాత్రమే అవసరం పడు తాయి. తొలుత 30 సెంటీమీటర్ల లోతు ఉండేవిధంగా దున్నుకోవాలి. విత్తనాలు నాటిన తర్వాత ఎకరానికి ఒక లీటర్‌ నీటి లో సరిపడా పెండీమిథాలిన్‌ కలుపుమందును పిచికారీ చేసుకోవాలి. 20-25 రోజుల వ్యవధిలో కలుపు ఉధృతిని బట్టి బిస్‌పైరీ, బాక్‌ సోడియం మందులో కలుపుకొని ఎకరానికి 100-120 మి.లీ. పిచికారీ చేయాలి.

వెదజల్లే పద్ధతి ద్వారా కలిగే ప్రయోజనాలు..

  • సాధారణ వరి సాగుతో పోల్చుకుంటే వెదజల్లే పద్ధతి ద్వారా రైతులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. సీజన్‌లో ఒకేసారి వరినాట్లు మొదలవటంతో కూలీల కొరత ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా ఆ కొరతను అధిగమించవచ్చు.
  • సన్న, చిన్నకారు రైతులకు కూలీల భారం తగ్గడంతో పాటు, పెట్టుబడి తగ్గించుకోవచ్చు.
  • వానలు పడనప్పుడు సకాలంలో వరి సాగు చేసుకునేందుకు మార్గం సుగమమవుతుంది. తద్వారా రెండవ పంటను సైతం సకాలంలో సాగు చేసుకోవచ్చు.
  • సాగు ప్రారంభించిన తర్వాత అడపా, దడపా వచ్చే జల్లుల (తక్కువ నీటి)తో పంటను కాపాడుకోవచ్చు. 
  • వెదజల్లే పద్ధతి ద్వారా నారుమడి పెంపకం భారం ఉండదు.

- మద్దెల లక్ష్మణ్‌, 9010723131

-ఖమ్మం వ్యవసాయం

వెదజల్లే పద్ధతితో వరి సాగు చేపట్టేందుకు రైతులు ముం దుకువస్తున్నారు. ఈయేడు సకాలంలో వర్షాలు రాకపోవడంతో సత్తుపల్లి, వైరా, ఖమ్మం నియోజకవర్గం పరిధి లో దాదాపు 8 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. పంట విత్తుకునే సమయంలో ఇతర ప్రాం తాల రైతులను అవగాహన కోసం పంపించాం. దీంతో ఈ పద్ధతి ద్వారా నే సాగు చేపట్టాలని రైతులు నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ఎప్పటికప్పుడు కేవీకే, డాట్‌ సెంటర్ల శాస్త్రవేత్త ల ద్వారా రైతుల్లో అవగాహన పెంచ డం కోసం సదస్సులు కూడా ఏర్పా టుచేశాం.

- ఎ.ఝాన్సీ లక్ష్మీకుమారి

-ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి 

వరి సాగుకు వెదజల్లే పద్ధతిని అనుసరిస్తే బహుళ ప్రయోజనాలుంటాయి. ప్రతికూ ల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవచ్చు. తక్కువ నీరు, పెట్టుడితో ఆశించిన మేర దిగుబడులు పొందవచ్చు. మెట్ట, మాగాణీ భూముల రైతులు కూడా వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేసుకోవచ్చు. 

- డాక్టర్‌ హేమంత్‌ కుమార్‌

-వైరా కృషి విజాన కేంద్రం కో ఆర్డినేటర్‌ 


logo