శనివారం 30 మే 2020
Agriculture - Mar 18, 2020 , 22:18:29

తమలపాకు సాగు లాభాలు బాగు

తమలపాకు సాగు లాభాలు బాగు

  • బెంగాలీ క్యాంపులో కలకత్తా తమలపాకుల పెంపకం
  • చేతికొచ్చిన పంట. వారానికి రెండుసార్లు విక్రయాలు
  • ఒక్కో ఆకుకు 50 పైసల చొప్పున లాభం

బెంగాలీ క్యాంపులో అమృత్‌ బిస్వాస్‌ కుటుంబం విభిన్న పంటలు సాగుచేస్తూ లాభాలు గడిస్తున్నది. కలకత్తా తమల పాకులు పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నది. సుమారు 20 గుంటల్లో తమలపాకు పంట సాగు చేస్తున్నారు. వారానికి రెండు సార్లు ఆకులు తెంపుతూ, ఒక్కో తమలపాకును యాభై పైసల చొప్పున అమ్ముతున్నారు. 


బెంగాల్‌కు చెందిన అమృత్‌బిస్వాస్‌ కుటుంబం కొన్నేండ్ల కిందట సిర్పూర్‌(టి) మండలం బెంగాలీ క్యాంప్‌నకు వచ్చి స్థిరపడింది. ప్రభుత్వం ఇచ్చిన నాలుగెకరాల భూమిలో పలు పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నది. అమృత్‌ బిస్వాస్‌ తనకున్న నాలుగెకరాల్లో వరి పండించేవాడు. నాలుగేండ్ల కిందట బిస్వాస్‌ కలకత్తాలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ కలకత్తా తమలపాకులు పెంచుతున్న విధానాన్ని చూశాడు. తమలపాకులను సాగుచేసే విధానం, ఎలాంటి మందులు వాడాలి, ఏ కాలంలో సాగు చేయాలనే వివరాలు తెలుసుకున్నాడు. రూ.20తో తమలపాకుల నారు కొనుగోలు చేసి 20 గుంటల భూమిలో నాటాడు. తమలపాకుల తీగలను నేల మీద పారించకుండా నీడ కోసం ఈతచెట్ల కమ్మలు, మునగ (వెదురు) కర్రలతో పందిళ్లు వేసి మొక్కలను పందిళ్ల పైకి ఎక్కించాడు. తమలపాకుల దిగుబడి అధికంగా వచ్చి పెద్ద మొత్తంలో లాభాలు పొందుతున్నాడు. ఈ సారి ఐదు నెలల కిందట పంట వేయగా, ప్రస్తుతం తమలపాకులు కోతకొస్తున్నాయి. తమలపాకులను వారానికి రెండుసార్లు మార్కెట్లోకి తెస్తున్నాడు రైతు అమృత్‌ బిస్వాస్‌.

- బొల్లు చిరంజీవి, 9505882766 

-కాగజ్‌నగర్‌ రూరల్‌


నేను కలకత్తా పోయినప్పు డు అక్కడ మసాలా ఆకుల, కలకత్తా తమలపాకుల సాగును చూసి న. అప్పుడే నాకున్న పొలంలో వేయాలనుకున్న. కలకత్తా నుంచి నారును కొనుక్కొచ్చి 20 గుంటల్లో నాటిన. వాటిని బతికించుకునేందుకు మస్తు తిప్పలైంది. తమల పాకులు చల్లటి వాతావరణంలోనే పెరుగుతా యి. అందుకే ఎండ తాకకుండా పందిళ్లు వేసి న. ఈ తమలపాకులకు మంచి గిరాకీ ఉన్నది. ఒక్కో ఆకు యాభై పైసలకు అమ్ముతున్న. వానకాలం అయితే రూపాయికొక్క ఆకు అమ్ముతా. ఇప్పుడు భాగాల, మసాలా ఆకులకు సంబంధించిన మొక్కలను కూడా పెంచుతున్నా. 

- అమృత్‌ బిస్వాస్‌, రైతు, బెంగాలీ క్యాంప్‌


logo