శనివారం 30 మే 2020
Agriculture - Feb 26, 2020 , 22:43:14

చేపలకు పౌష్టిక మేతతోనే మంచి లాభాలు

చేపలకు పౌష్టిక మేతతోనే మంచి లాభాలు

చేపల పెంపకం సాగునీటి చెరువులు, కుంటలతో పాటు ప్రత్యేకంగా తవ్వుకున్న చెరువులలో చేపడుతున్నారు. అధిక చేపల దిగుబడుల కోసం రైతులు అనేక రకాలైన కృత్రిమ మేతలను పెంపక సమయంలో చేపలకు అదనపు ఆహారంగా ఇస్తున్నారు. దీంతో దిగుబడులు పెరిగినా చేపల ఉత్పత్తి ఖర్చులు మాత్రం రానురాను గణనీయంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం సుమారు 60 శాతానికి పైగా ఖర్చులు మేత కోసమే ఖర్చుచేస్తున్నారు. కాబట్టి చేపల మేత గురించి రైతులు పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అప్పుడే మేత సక్రమంగా వినియోగించడం ద్వారా లాభాలు సాధించవచ్చని నిపుణులు చెప్తున్నారు. చేపలకు వేసే మేత తయారీ, రకాలు, వాటిలో గల పోషకాలు, వాడే విధానాలను గురించి గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త బూర్గు లవకుమార్‌ వివరించారు. అదనపు సమాచారం కోసం 9849063796 నంబర్‌ ద్వారా వారిని సంప్రదించవచ్చు. చేపల మేత గురించి ఆయన తెలిపిన వివరాలు..

మేత ఆవశ్యకత: పాక్షిక సాంద్రత పద్ధతిలో గానీ, సాంద్ర పద్ధతిలో గానీ చేపల పెంపకం చేపట్టేటప్పుడు నిర్ణీత సమయంలో అవి మార్కెట్‌ సైజుకు రావాలంటే మంచి నాణ్యతతో కూడిన సమతుల్య మేతలను ఇవ్వాలి. దీనివల్ల చేపల పెరుగుదల బాగుంటుంది. అంతేగాక చేపలు వ్యాధి నిరోధక శక్తి పొంది వ్యాధుల బారిన పడవు. ఆక్వా పరిశ్రమలో చేపలకు మేతగా వ్యవసాయ పరిశ్రమ నుంచి వచ్చిన ఉప ఉత్పత్తులైన తవుడు, నూనె తీసిన తవుడు (డీఓబీ), వేరుశనగ చెక్క పిండి (జీఎన్‌సీ), నువ్వుల చెక్క, మక్కజొన్న వగైరా వంటి వాటిని వినియోగించవచ్చు. 


మేత రకాలు: ప్రస్తుతం మార్కెట్‌లో రెండు రకాల మేతలు అందుబాటులో ఉన్నాయి. అవి 1.పొడి మేత 2. పెల్లెట్‌ (కణికలు) మేత.


పొడి మేత: చేపల పెంపకంలో తవుడు, నూనె తీసిన వేరుశనగ చెక్క, పత్తి చెక్కలను చేపలకు ఆహారంగా ఇచ్చే పొడి మేతలు. ఇటీవల అక్కడక్కడ రైతులు బీరు ఫ్యాక్టరీల నుంచి వచ్చే మక్కజొన్న పిప్పిని కూడా చేపలకు ఆహారంగా ఇస్తున్నారు.


పెల్లెట్‌ మేత: చేపల పెంపకంలో ఇటీవలకాలంలో పెల్లెట్‌ మేతలు కూడా వినియోగంలోకి వచ్చాయి. ఇవి వివిధ సైజులలో లభిస్తున్నాయి. అలాగే వివిధ రకాల చేప జాతులకు అవసరమైన మేత రకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో నీటిలో తేలే, నీటిలో మునిగే మేత రకాలు కూడా ఉన్నాయి. 

చేపల పెంపకంలో పెల్లెట్‌ (కణికల) మేతలు, పొడిమేతల కంటే ఉన్నతమైనవి. అలాగే ప్రస్తుతం వీటి వినియోగం కూడా క్రమేణా పెరుగుతుంది. పెల్లెట్‌ మేతలు సరియైన ఎప్‌సీఆర్‌(ప్రీడ్‌ కన్వర్షన్‌ రేషియో)ను కలిగి ఉండి నీటి కాలుష్యాన్ని కలుగజేయవు. కొనుగోలు చేసిన పెల్లెట్‌ మేతలోని పోషక పదార్థాల స్థాయిలను మేత సంచులపై క్షుణ్నం గా పరిశీలించాలి. అవసరమైన మొతాదులోనే వాడాలి.


ఇవ్వాల్సిన విధానం: పొడి మేతలను రంధ్రాలు చేసిన సంచులలో తగిన పరిమాణంలో నింపి చెరువు నీటిలో పాతిన కర్రలకు లేదా ఏర్పాటు చేసుకున్న వైరు తాడుకు నిర్ణీత ప్రదేశాలలో అక్కడక్కడ ఎకరా నీటి విస్తీర్ణానికి కనీసం పది వరకు కట్టుకోవాలి. పెల్లెట్‌ మేతలను నేరుగా చెరువు నీటిపై జల్లుకోవాలి. ప్రతిరోజు ఉదయం 6-7 గంటల సమయంలో చేపలకు మేత ఇవ్వరాదు. ఎందుకంటే చేపలకు ఈ సమయంలో చెరువు నీటిలో ఆక్సిజన్‌ కనిష్ఠస్థాయిలో ఉంటుంది. ఈ సమయంలో మేత వేస్తే చేపల పెరుగుదలకు ఎక్కువ మేత అవసరం అవుతుంది. కాబట్టి పొద్దుగాల 9 గంటల తర్వాతే అంటే 9-10 గంటల మధ్యన ఇవ్వాలి. దీనివల్ల మేత పూర్తిస్థాయిలో చేపలకు ఉపయోగపడుతుంది.


ఇతర యాజమాన్యం

మేత సంచులను ఆరుబయట ఎండ తగిలేటట్లు నిల్వ ఉంచకూడదు. ఎండలో నిల్వ చేస్తే ఎండ వేడిమికి మేతలో పోషకాలస్థాయి తగ్గిపోతుంది. అలాగే మేత సంచులు తేమ లేకుండా లేదా నీటితో తవ్వకుండా చూసుకోవాలి. నీటిలో తడిసిన అధిక తేమగా ఉన్న మేతలో బూజు అభివృద్ధి చెందుతుంది. పలితంగా హానికరమైన అప్లోటాక్సిన్లు అభివృద్ధి చెందుతాయి. ఇవి చేపలకు హానికరం. 

బూజు పట్టిన మేతలను ఎట్టి పరిస్థితులలోనూ చేపలకు ఆహారంగా ఇవ్వరాదు. రైతులు మేతలను ఎక్కువరోజులు నిల్వ ఉంచుకోవద్దు. సాధ్యమైనంత వరకు తాజా మేతలనే కొని వాడుకోవాలి. మేత సంచులను గాలి సోకే షెడ్‌లలో నేలపై గాక చెక్క బల్లలపై అరలుగా నిల్వ చేసుకోవాలి. అలాగే 3-4 వరుస మధ్య ఖాళీ ఉంచాలి. ప్రతిరోజు ఇచ్చే పొడి మేత సంచులను శుభ్రపరుచుకుని దండానికి కట్టి ఆరబెట్టాలి. లేకపోతే ఈ సంచులపై ఫంగస్‌ అభివృద్ధి చెందుతుంది. బాగా ఆరిన తర్వాతనే తిరిగి ఈ సంచులను వాడుకోవాలి.

చెరువు నీటి రంగు ఎక్కువ ఆకుపచ్చ రంగు లేదా గోధుమ రంగులలో ఉంటే నీటిలో ప్లవకాల (ప్లాంక్టాన్‌) స్థాయి అధికంగా ఉన్నట్లు ఇలాంటి చెరువులలో వారంకు ఒకసారి మేతను ఇవ్వడం నిలిపివేయాలి. దానివల్ల చేపలు నీటిలోని ప్లవకాలను ఆహారంగా వినియోగించుకుంటాయి.  ఫలితంగా కొంత మేత ఖర్చు తగ్గుతుంది.

 చెరువు నీటిలో నాణ్యత సరిగా లేనప్పుడు, ప్రతికూల వాతావరణ పరిస్థితులలో మేత ఇవ్వడానికి తాత్కాలికంగా నిలిపివేయాలి. కనీసం ప్రతి నెలకు ఒకసారి ట్రయిల్‌ నెటింగ్‌ చేసి చేపల బరువు, పెరుగుదలను చూసి మేత పరిమాణం నిర్ణయించుకోవాలి.  

మేత పరిమాణం: చేపల సైజును ఉష్ణోగ్రతను అనుసరించి చేపల బరువులో కనీసం 2-10 శాతం వరకు మేతను ఇవ్వాలి. రోజూ చేపలు తీసుకునే ఆహారాన్ని బట్టి ఇవ్వాల్సిన మేత పరిమాణాన్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. చేపలు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ శాతం అంటే పెరిగే కొద్ది తక్కువ శాతం మేత ఇవ్వాలి. అంటే చేపల శరీర పరిమాణం పెరిగేకొద్ది ఇచ్చే మేత శాతం తగ్గిస్తూ పోవాలి.


వివిధ మేత దినుసులలో ఉండే పోషకాలస్థాయి (శాతంలో)


చేపల బరువులో ఇవ్వాల్సిన ఆహార పరిమాణంచేపల శరీర బరువు (గ్రాము)ఇవ్వాల్సిన ఆహార పరిమాణం

5-20 10 శాతం

21-50 8

51-100 6

101-300 5

301-500 3

501-1000 2

మేత తయారీ: సొంతంగా ముడి పదార్థాలు కొనుగోలు చేసి మేతను తయారుచేసుకునే వారు వీలైనంత వరకు ఎక్కువరకాల మేత దినుసులను కలుపుకోవాలి. దీనిద్వారా చేపలకు అవసరమైన సమతుల ఆహారాన్ని తయారుచేసుకుని చేపలకు ఇవ్వాలి.

100 కిలోల మేత తయారీలో వాడాల్సిన దినుసులు మేత దినుసు పరిమాణం

నూనె తీసిన తవుడు 40 కిలోలు

వేరుశనగ చెక్క 40 కిలోలు

చేప పొడి (ఫిష్‌మీల్‌) 15 కిలోలు

మైదా/ గంజిపొడి 4కిలోలు

విటమిన్‌ /ఖనిజ లవణాల        

మిశ్రమం 1 కిలో                                 

మొత్తం 100 కిలోలు

నట్టె కోటేశ్వర్‌రావు, 9989944945

గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా 


logo