గురువారం 09 ఏప్రిల్ 2020
Agriculture - Feb 19, 2020 , 22:52:34

మినుము, పెసర సాగు మేలు

మినుము, పెసర సాగు మేలు

యాసంగి పంటగా పెసరను నీటి పారుదల కింద ఆరుతడి పంటగా తేలిక భూముల్లో కూడా సాగు చేసుకోవచ్చు. తేమ బాగా నిలుపుకును భూముల్లో నీటి తడులు బాగా ఇచ్చే పరిస్థితి ఉంటే మినుము సాగు చేసి అధిక దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పెసర, మినుము సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి వారు తెలిపిన వివరాలు... 

విత్తే సమయం: వేసవిలో మినుము, పెసర పంటలను ఫిబ్రవరి నుంచి మార్చి 15 వరకు విత్తుకోవచ్చు. వరి మాగాణుల లో అయితే వేసవి పంట తర్వాత మార్చి చివరివరకు విత్తుకోవచ్చు. 

రకాల ఎంపిక: తక్కువకాలంలో కాపునకు వచ్చి ఎండ కాలంలో వేడిని, నీటిఎద్దడిని తట్టుకొనే రకాలను ఎంపిక చేసుకోవాలి. అలాగే ఎండకాలంలో వచ్చే ప్రధానమైన వైరస్‌ తెగుళ్ళను తట్టుకొనే రకాలను ఎంపిక చేసుకోవాలి. 


అనువైన రకాలు

పెసర: డబ్ల్యూజిజి 42, టి.ఎం 96-2, ఐపియం 2-14 అనువైనవి. ఈ రకాలు 60-65 రోజులలో కాపునకు వస్తాయి.

మినుము: అన్నికాలాల్లో సాగు చేయడానికి బాగా అనువైన టి.బి.జి 104, ఎల్‌.బి.జి 787, పి.యు 31 అనువైనవి. ఈ రకాలు 70-80 రోజులలో కాపునకు వస్తాయి. 

విత్తన మోతాదు: పెసర ఆరుతడి మెట్ట పంటకు ఎకరాకు 6-7 కిలోలు, వరి మాగాణుల్లో అయితే 12 కిలోల విత్తనాలు వాడాలి. మినుమును వేసవిలో ఆరుతడి పంటగా సాగు చేసినైట్లెతే ఎకరాకు 8-10 కిలోలు, వరి మాగాణుల్లో అయితే 14-16 కిలోలు సాగుకు వాడాలి.

విత్తనశుద్ధి: పంట విత్తుకునే 24-48 గంటల ముందుగా ఒక కిలో విత్తనానికి 5 మి.లీల ఇమిడాక్లోప్రిడ్‌ లేదా థయోమిథాక్సిమ్‌ 70 డబ్ల్యూఎస్‌ 5 గ్రాములు+ కార్బెండిజమ్‌ 2.5 గ్రాములు చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి.  దీనివల్ల తొలిదశలో వైరస్‌ తెగుళ్ళను వ్యాపింపజేసే రసంపీల్చే పురుగులు, వేరుకుళ్ళు తెగుళ్ళ బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. 


కలుపు నివారణ: మెట్ట భూముల్లో ఆరుతడి పంటగా సాగుచేసినప్పుడు పెండిమిథాలిన్‌ 30శాతం ఎకరాకు 1.3 నుంచి1.6 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే గానీ విత్తిన మరుసటిరోజుగానీ పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులలో గొర్రుతో అంతర కృషి చేయాలి. వరి మాగాణుల్లో గడ్డిజాతి వెడల్పాటి మొక్కలు ఉంటే ఇమాజిథాపిర్‌ 10శాతం ద్రావణం ఎకరాకు 250 మి.లీ.ల చొప్పున విత్తిన 20-25 రోజుల మధ్య పిచికారీ చేయాలి. ఊద, చిప్పర, గరికె లాంటి గడ్డిజాతి మొక్కలు నిర్మూలనకు పెనాక్సోప్రాప్‌ ఇథైల్‌ 9శాతం ద్రావణం ఎకరాకు 250 మి.లీ, లేదా క్విజలాపాప్‌ ఇథైల్‌ 5శాతం ద్రావకం ఎకరాకు 400 మి.లీ,ల చొప్పున ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 20-25 రోజుల మధ్య పిచికారీ చేసి కలుపు నివారించవచ్చు. 


ఎరువుల యాజమాన్యం: ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను వేయాలి. వరి మాగాణులలో ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. 

నీటి యాజమాన్యం విత్తిన 20-25 రోజులలో ఒకసారి తదుపరి 40-45 రోజులలో మరోసారి అవసరమైతే మూడవ తడి ఇస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. 

సస్యరక్షణ: వేసవిలో సాగు చేసే పెసర, మినుము పైర్లను వైరస్‌ తెగుళ్ళు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 


పల్లాకు తెగులు: ఈ తెగులు తెల్లదోమ దోమ ద్వారా మినుము, పెసర పంటకు వ్యాప్తి చెంది అధిక నష్టం కలుగజేస్తుంది. తెగులు సోకిన మొక్కల్లోని ఆకులపై పసుపు ఆకుపచ్చ రంగు మచ్చలు కన్పిస్తాయి. అందువల్లే దీనిలో ఎల్లో మొజాయిక్‌ అనే పేరు వచ్చింది. తొలిదశలో ఈ తెగులు ఆశిస్తే పైరంతా పసుపు రంగులోకి మారిపోయి పూత, పిందె ఏర్పడదు. పిందె లు, కాయలు కూడా పసుపు రంగులోకి మారిపోయి వంకలు తిరిగి తాలు కాయలుగా మారతాయి. 


ఆకుముడత తెగులు: ఈ తెగులు ఉధృతి వర్షభావ పరిస్థితుల్లో ఎక్కువ. ఈ తెగులు తామర పురుగులు, త్రిప్స్‌ ద్వారా ఒక మొక్క నుంచి మరోమొక్కకు వ్యాపిస్తాయి. తెగులు సోకిన ఆకుల అంచులు వెనుకకు ముడుచుకుని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. అతి తక్కువ కాపు ఉండి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.

సీతాఫలం తెగులు (బొబ్బర తెగులు):   వైరస్‌ తెగులు పేనుబంక ద్వారా ఒక మొక్క నుంచి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుం ది. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులకాడలు, ఆకులు  పెద్దవి గా అయ్యి ఆకుపై ఉబ్బెత్తుగా ఏర్పడి ముడతలు పడి సీతాఫలం కాయల్లాగా కన్పిస్తుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారుతాయి. పూత, పిందె అభివృద్ధి చెందక కాయ లు ఏర్పడవు. ఈ తెగులు చాలావరకు విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది. కనుక ఈతెగులు సోకని పంట నుంచి విత్తనం సేకరించుకోవాలి. తెగులు వ్యాప్తికి కారణమైన పేనుబంక పురుగులను నివారించుకోవాలి.


సమగ్ర యాజమాన్యం: వైరస్‌ తెగుళ్ళు తెల్లదోమ, తామర పురుగుల, పేనుబంక ద్వారా కలుపు మొక్కల నుంచి పంట మొక్కలకు వ్యాప్త్తి చెందుతాయి. ఈ తెగుళ్ల నివారణకు ఎటువంటి క్రిమిసంహారక మందులు లేవు. కాబట్టి ఈ తెగులు వ్యాప్తికి కారకాలైన తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక పురుగులను అరికట్టడం ద్వారానే ఈ తెగుళ్ళను నివారించగలం.

1) పల్లాకు తెగులును తట్టుకునే రకాలను సాగు చేయాలి. 2) విత్తనశుద్ధి తప్పకచేయాలి. 3) పంట విత్తే సమయంలో పొలం చుట్టూ నాలుగు వరుసలలో మక్కజొన్న, జొన్న, సజ్జ పంటలను విత్తుకుంటే పక్కపొలాల నుంచి తెల్లదోమ, తామరపురుగుల, పేనుబంక పురుగులను రాకుండా నివారించవచ్చు. 4) పొలం గట్ల మీద కలుపు లేకుండా చేయాలి. 5) పొలంలో తెగులు సోకి మొక్కలను గమనించి వెంటనే పీకి నాశనం చేయాలి. 6) పొలంలో అక్కడక్కడ ఎకరాకు తెల్లదో మ నివారణకు 20 చొప్పున పసుపు రంగు జిగురు అట్టాలు/ రేకులు, తామరపురుగులకు ఎకరాకు 20 చొప్పున నీలిరంగు జిగురు అట్టాలను ఉంచి ఆయా పురుగుల ఉనికిని, ఉధృతిని అంచనా వేసుకుని సస్యరక్షణచర్యలు చేపట్టవచ్చు. 7)విత్తిన 15-20 రోజులకు ఒకసారి వేపనూనె 5 మి.లీ.లు లీటరు నీటికి లేదా 5శాతం వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసి పంటకు రసం పీల్చే పురుగులు ఆశించకుండా కాపాడుకోవచ్చు.


తెల్లదోమ నివారణ: అంతర్వాహిక కీటకనాశనులైన ట్రైజోఫాస్‌ 1.5 మి.లీ లేదా ఎసిఫేట్‌ 1 గ్రాము లీటరు నీటికి కలిపి వాడాలి.

తామర పురుగుల నివారణ: ఎసిఫేట్‌ 1 గ్రాముల లేదా ఫిప్రోనిల్‌ 1.5 మి.లీ. లేదా థయోమిథాక్సిమ్‌ 0.2 గ్రాములు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 

పేనుబంక నివారణ: ఎసిఫేట్‌ 1 గ్రాముల లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.4 మి.లీ. లేదా థయోమిథాక్సిమ్‌ 0.2 గ్రాములు లేదా 

డైమిథోయేట్‌ 2 మి.లీ.లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


మారుకా మచ్చల పురుగు: ఈ పురుగు మొగ్గ, పూత, పిందె దశ లో ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తాయి. దీని నివారణకు పూత దశలో తప్పని సరిగా 5శాతం వేప గింజల కాషాయాన్ని లేదా వేపనూనె 5.0 మి.లీ.లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే రెక్కల పురుగు గుడ్డు పెట్టకుండా నివారించవచ్చు. పెట్టిన గుడ్లు పొదగవు. పురుగు గుడ్డు పెట్టడానికి ఇష్టపడదు. తక్కువ కాలపరిమితి గల పైర్లలో ఇది అత్యంత ఉపయోగకరం. 

మొగ్గ, పూత దశలో కొన్ని మొగ్గలను సేకరించి వాటిని తెరచి పిల్ల పురుగులు ఉన్నాయో లేదో గమనించి ఉన్నట్లయితే వెంటనే క్లోరోఫైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా థయోడికార్బ్‌ 

1 గ్రాము లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంటలో గూళ్ళు గమనించినైట్లెయితే ఎసిఫేట్‌ 1.5 గ్రాము లేదా క్వినాల్‌పాస్‌ 2.0 మి.లీ. లేదా క్లోరోపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా నోవోల్యురాన్‌ 1.0 మి.లీ.లు ఏదో ఒకదానిని ఊదర స్వభావం కలిగిన డైక్లోరోవాస్‌ మందును 1.0 మి.లీ.లను లీటరు నీటికి పైమందులతో కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి బాగా ఉంటే సైనోశాడ్‌ 0.3 మి.లీ. లేదా ఎమామిక్టిన్‌ బెంజోయేట్‌ 0.4 గ్రాములు లేదా 

ప్లూబెండిఎమైడ్‌ 0.2 మి.లీ.లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 

పొగాకు లద్దె పురుగు: దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్య లు చేపట్టి మంచి ఫలితాలను పొందవచ్చు. పురుగు ఉధృతిని బట్టి నోవోల్యూరాన్‌ 1.0 మి.లీ. లేదా థయోడికార్బ్‌ 

1 గ్రామును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

నట్టె కోటేశ్వర్‌రావు, 9989944945

గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా 


యాజమాన్య పద్ధతులతో సాగు లాభదాయకం

యాసంగి పెసర, మినుమును విత్తుకునే రైతులకు ఇది మంచి సమయం. వీటిని నాటిన తర్వాత యాజమాన్య పద్ధతులు పాటించాలి. వీటి సాగు రైతులకు లాభదాయకం. సాధారణంగా ఎండకాలంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. అలాగే తక్కువ కాలవ్యవధి ఉన్న రకాలు ఎంచుకుంటే మంచిది. వీటిని నాటడానికి ముందు విత్తనశుద్ధి చేసుకోవాలి. నాటిన తర్వాత కలుపు నివారణ చర్యలు చేపట్టి అవసరమైన మేరకు నీటి తడులు ఇవ్వాలి. తెగుళ్ల నివారణకు నిపుణులు సూచనల మేరకు తగిన మందులు పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.   

- అరిగెల కిరణ్‌,7893989055, కేవీకే మృత్తికా శాస్త్రవేత్త, గడ్డిపల్లి


logo