మంగళవారం 31 మార్చి 2020
Agriculture - Feb 19, 2020 , 22:45:49

పిక్స్‌ సంచుల్లో పక్కాగా పల్లి నిల్వ

పిక్స్‌ సంచుల్లో పక్కాగా పల్లి నిల్వ

ప్రస్తుతం రాష్ట్రం పల్లి పంట చేతికి వచ్చింది. వెంటనే మార్కెటింగ్‌ సాధ్యం కాదు. ఈలోపు పల్లి కాయలను బ్రూచిడ్‌, నల్లబూజు ఆశించి గింజల నాణ్యతను దెబ్బతీస్తాయి. దీంతో రైతులు గిట్టుబాటు ధరలు రాక నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి పల్లీల నిల్వ కోసం మూడుపొరల సంచులు మన్నిగా ఉంటాయి. రైతులు వీటిని వినియోగించుకుని మార్కెట్‌లో మంచి ధర ఉన్నప్పుడే అమ్ముకునే అవకాశం ఉన్నది.

పంట కోత అనంతరం వివిధ ధాన్యాలు, పప్పు దినుసులు నిల్వచేసినప్పుడు 15-40 శాతం వరకు నష్టం జరుగుతుంది. ముఖ్యంగా పల్లి లాంటి ధాన్యాన్ని సంప్రదాయ పద్ధతిలో జనపనార/ గోనె సంచులను ఉపయోగించి నిల్వచేసినప్పుడు బ్రుచిడ్‌ పురుగు త్వరితగతిన వృద్ధి చెందుతుంది. దీనివల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుంది.  ఈ సమస్యలను అధిగమించేందుకు ఇక్రిశాట్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ హరికిషన్‌ సూదిని మొదటిసారిగా 2011 నుంచి భారతదేశంలో పల్లీల నిల్వ కోసం ఈ సంచుల వినియోగంపై పరిశోధనలు చేశారు. పర్డ్యూ యూనివర్సిటీ సహకారంతో చేసిన ఈ పరిశోధనలు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఈ సంచులను వివిధ పంటల నిల్వల కోసం లక్షలాదిమంది రైతులు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఈ సంచులు అందుబాటులోకి వచ్చాయి. పిక్స్‌ (PICS ) సంచులు పంట  కోత అనంతరం పురుగుల తాకిడికి గురై నష్టపోకుండా గింజలు, ధాన్యాలు, పప్పు దినుసులు ఇతర వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను కాపాడుతాయి. మొదటిసారిగా పశ్చిమాఫ్రికా దేశంలో బొబ్బర్ల నిల్వకు ఈ సంచులను వాడారు. తర్వాత ఆసియా, ఇతర ఆఫ్రికా దేశాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో ఈ సంచులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని తెలుసుకొని సక్రమంగా వాడుకునే విధానం తెలుసుకుందాం.


పల్లీల నిల్వకు

డాక్టర్‌ హరికిషన్‌ సూదిని పరిశోధనలో విత్తన అంకురోత్పత్తి ఏ మాత్రం తగ్గకుండా ఈ సంచులు కాపాడినట్లు తేలింది. దీంతో అనంతపురం జిల్లాలోని కొద్దిమంది ఎంపిక చేసిన రైతులకు ఈ మూడు పొరల సంచులను ప్రయోగాత్మకంగా ఇచ్చి వారిని పల్లి నిల్వకు వినియోగించమని ప్రోత్సహించారు. ఆ తర్వాత రైతుల అభిప్రాయాలను సేకరించినప్పుడు వారు ఈ సంచులు చాలా బాగా పనిచేశాయని చెప్పారు. జనపనార/గోనె సంచులను ప్రత్యామ్నాయంగా ఈ మూడు పొరల సంచులలో పల్లి కాయలను నిల్వ చేశారు. దీంతో పురుగు, కీటకాలను సమర్థవంతంగా నిలువరించి, పల్లికాయల నాణ్యతను కాపాడుకోవచ్చని తేలింది. అంతేగాకుండా పల్లిలో విత్తన మోతాదు అధికం. ఎకరానికి దాదాపు 60-80 కిలోల విత్తనం వాడాలి. రైతులు తాము పండించిన పల్లి కాయలను మళ్లీ వచ్చే కాలానికి అంటే దాదాపు 6-8 నెలల వరకు ఈ సంచులలో నిల్వ చేసుకున్నట్లయితే విత్తనంపై పెట్టే ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చు. ఇక్రిశాట్‌ వారి పరిశోధనలో విత్తన మొలక శాతం కూడా ఏ మాత్రం తగ్గకుండా ఈ సంచులు పల్లి కాయలను కాపాడినట్లు తేలింది. నల్లబూజును కూడా సమర్థవంతంగా తగ్గించింది. ఈ సంచులు కావాల్సిన రైతులు 9177178001 సంప్రదించగలరు.logo
>>>>>>