శనివారం 28 మార్చి 2020
Agriculture - Feb 19, 2020 , 22:35:10

కోతదశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోతదశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గరిడేపల్లి: వాణిజ్యపరంగా విలువైన పంట మిరప. ఈ పంట సాగు చేసిన రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఫలితంగా ఆశించిన దిగుబడులు పొందవచ్చు. అట్లనే రైతులు ఆర్థికంగా నిల దొక్కుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం మిరపలో కోతలు అవుతున్నాయి. వాటిని కోసే ముందు, కోసిన తర్వాత సరైన పద్ధతులు అవలంబించాలి. దీనివల్ల విలువతో కూడి న దిగుబడులను సాధించవచ్చు. తద్వారా మార్కెట్‌లో మంచి రేటు ను పొందవచ్చునని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త సీహెచ్‌.నరేష్‌ వివ రించారు. అదనపు సమాచారం కోసం 9603268682 నెంబర్‌ను సంప్రదించవచ్చు. మిరపలో కోతదశ నుంచి నిల్వ చేసే వరకు పాటించాల్సిన విధానాల  గురించి ఆయన తెలిపిన వివరాలు...

మొక్కలపైన మిరప కాయలను ఎక్కువగా పండనివ్వకూడదు.

ఎక్కువగా పండితే మిరప నాణ్యత తగ్గుతుంది. ఎప్పటికప్పుడు పండిన కాయలను కోయడం వలన దిగుబడులు పెరుగుతాయి.

కాయలు కోసే ముందు సస్యరక్షణ మందులు పిచికారీ చేయ కూడదు. పిచికారీ చేస్తే కాయల మీద అవశేషాలు ఉండి ఎగుమతికి ఆటంకాలు ఏర్పడతాయి. 

మిరపకాయలను పాలిథీన్‌ పట్టాల మీద లేదా సిమెంట్‌ గచ్చు మీద ఎండబెట్టాలి. లేకపోతే అప్లోటాక్సిన్‌ అనే విషపదార్థం ఎక్కువగా వృద్ధి చెందుతుంది. 

రాత్రిపూట మంచుబారిన పడకుండా కాయలను కప్పి ఉంచా లి. 10 శాతానికి మించి ఎక్కువ తేమ లేకుండా ఎండబెట్టాలి.

ఎండబెట్టేటప్పుడు దుమ్ము,ధూళి, చెత్త చేరకుండా వాటిని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

తాలు కాయలను, మచ్చకాయలను గ్రేడింగ్‌ చేసి వేరుచేయాలి.

నిల్వ చేయడానికి తేమ లేకుండా ఉన్న శుభ్రమైన గోనె సంచుల లో కాయలను నింపాలి.

తేమ తగలకుండా వరిపొట్టు లేదా చెక్కబల్లాల మీద గోడలకు అరమీటర్‌ దూరంలో నిల్వ చేయాలి.

అవకాశం ఉన్నచోట్ల శీతల గిడ్డంగులలో నిల్వ చేస్తే రంగు, నాణ్యత తగ్గిపోకుండా లాభదాయకంగా ఉంటుంది.

అకాల వర్షాలకు గురికాకుండా, మంచుబారిన పడకుండా రంగు కోల్పోకుండా ఆధునిక డ్రయ్యర్‌లలో ఎండబెట్టి నాణ్య మైన మిరప దిగుబడులు పొందవచ్చు.  


logo