శనివారం 29 ఫిబ్రవరి 2020
తీగజాతి కాయగూరల సాగు సమయమిదే

తీగజాతి కాయగూరల సాగు సమయమిదే

Jan 27, 2020 , 23:04:37
PRINT
తీగజాతి కాయగూరల సాగు సమయమిదే

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన పంటలను సాగు చేయాలి. వాటిలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. తద్వారా మంచి దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం తీగజాతి కూరగాయల సాగుకు అనుకూలం. వాటిని సాగు చేసి మంచి ఫలితాలను పొందవచ్చంటున్నారు. వీటిని నేలపైనే కాకుండా వెదురు కర్రలు, తాళ్లతో పందిరిలు ఏర్పాటు చేసి మొక్కలను వాటిపైకి ఎక్కించి ఆశించిన దిగుబడులను సాధించవచ్చని తెలిపారు. తీగజాతులను సాగు చేయడం వలన సాగుకు అయ్యే ఖర్చులు తగ్గడంతో పాటు మంచి లాభాలను గడించవచ్చన్నారు. తీగజాతి కూరగాయలైన సొర, బీర, కాకర, దోస, పొట్ల, దొండ పంటల సాగు అందులో అవలంబించాల్సిన విధానాలను గురించి వారు తెలిపిన వివరాలు

సాగు సులభం ఆదాయం అధికం...   పందిళ్ళ ఏర్పాటుతో  అధిక దిగుబడులు..

సాధారణంగా ఈ పంటలన్నీ తేమతో కూడిన వేడి వాతావరణంలో బాగా పెరుగుతాయి. నేలల ఎంపిక: తేలికపాటి బంకమట్టి నేలలు అనుకూలం.


రకాల ఎంపిక

సొర:  అమిత, శ్రామిక్‌, వారాద్‌ అనుకూలమైనవి.

బీర: సురేఖ, యన్‌యస్‌-3, యన్‌యస్‌-4, మహిమ రకాలు అనుకూలం.

కాకర: మహికో 13,15, రేష్మ, అభిషేక్‌, శ్రేయ, శ్వేత మొదలైనవి.

కూరదోస: ఆర్‌యస్‌యస్‌యం-1,3

కీరదోస: జపనీస్‌ లాంగ్‌గ్రీన్‌, స్ట్రెయిట్‌ఎయిట్‌, పూసా సన్‌యోగ్‌, హిమాలి, పునేలికీర, మాలిని మొదలయినవి అనుకూలం.

దొండ: చూపుడువేలు మందం కాండం ముక్కలు, నాలు గు కణుపులతో కూడి ఉండాలి. దీనిలో సన్న, లావు రకాలుంటాయి.

పొట్ల: ఎపిఎయుశ్వేత, కో-1, కో-2, పికెయం-1 మొదలయిన రకాలు.


విత్తే సమయం: సొర, దోస, కాకరలను ఫిబ్రవరి చివరి వర కు విత్తుకోవచ్చు.

బీర: దీనిని  ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు.

పొట్ల: డిసెంబర్‌ నుంచి జనవరి వరకు విత్తుకోవచ్చు.


విత్తన మోతాదు: ఎకరానికి సొర వేసవిలో 1.2 కిలోలు, బీర 0.6 నుంచి 0.8 కిలో, కాకర 0.8 నుంచి 1కిలో, పొట్ల 0.6 నుంచి 0.8 కిలో, దోస 1.0 నుంచి 1.4 కిలో లు, దొండ చూపుడు వేలు మందం కలిగి నాలుగు కణుపులు గల కాండం ముక్కలు 1333 నుంచి 2000 అవసరమౌతాయి.


విత్తేదూరం: బీర, కాకర, దోసలకు వేసవిలో రెండు వరుసలలో మొక్క మొక్కకు మధ్యదూరం పొడవు 2 మీటర్లు, ఒక వరుసలో మొక్క మొక్కకు మధ్య వెడల్పు 0.5 మీట ర్లు ఉండాలి, సొరలో 2.5 మీటర్లు పొడవు, అరమీటర్‌ వెడల్పు ఉండాలి. దొండ, పొట్లలో పొడవులలో 2 మీట ర్లు వెడల్పులలో 1-2 మీటర్లు ఉండాలి.

ఎరువుల యాజమాన్యం: ఎకరానికి 6-8 టన్నుల మాగిన పశువుల ఎరువు లేదా 1.5 టన్నుల వానపాముల ఎరు వు, 4కిలోల పాస్పొబాక్టీరియా, 4కిలోల అజోస్పైరిల్లమ్‌ను ఆఖరు దుక్కిలో వేయాలి.


రసాయన ఎరువులు: 32-40 కిలోల భాస్వరం, 16-20కిలోల పొటాష్‌, 32-40 కిలోల నత్రజనిని ఎకరానికి వేయాలి. భాస్వరం, పొటాష్‌లను పాదులలో వేయాలి. నత్రజనిని రెండు సమ భాగాలుగా చేసుకొని విత్తిన 25-30 రోజులకు ఒకసారి, పూత, పిందె సమయంలో మరోసారి వేయాలి. వేసవిలో ఆడపూలు ఎక్కువగా వచ్చేందు కు 2-4 ఆకుల దశలో లీటర్‌ నీటికి 2 గ్రాముల బోరాక్స్‌ ను కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.


సస్యరక్షణ 

గుమ్మడి పెంకు పురుగు: ఇవి మొక్క మొలిచిన వెంటనే ఆశించి నష్టపరుస్థాయి. కాబట్టి వాటి నివారణకు 2 శాతం పాలిడాల్‌ పొడి మందును వారంలో రెండుసార్లు చల్లాలి. వీటి ప్రభావం ఎక్కువగా ఉంటే ప్రొఫినోపాస్‌ను 2 మి.లీ. లు లేదా మలాథియాన్‌ 2 మి.లీ.లను లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.