వరి సాగులో సందేహాలు - సమాధానాలు

ప్రస్తుత యాసంగి సీజన్‌కు జలాశయాలలో సమృద్ధిగా నీళ్లు అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల రైతులు ఎక్కువ మొత్తంలో వరి సాగు చేస్తూ ఆదాయంపైనే దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది రైతు లు వరినాట్లు పూర్తి చేశారు. ఇంకా కొన్నిచోట్ల నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. అయితే వరిని సాగు చేస్తున్న రైతులు నారుమడిలో, నాట్లు వేసిన తర్వాత ప్రధాన పొలంలో కొన్ని ముఖ్యమైన కిటుకులు పాటించాలి. ఫలితంగా అధిక దిగుబడులు పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. అయితే యాసంగి వరిలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై గడ్డిపల్లి కృషివిజ్ఞాన కేంద్రం మృత్తికా శాస్త్రవేత్త అరిగెల కిరణ్‌తో నట్టె కోటేశ్వర్రావు జరిపిన ముఖాముఖిలో వారు తెలిపిన వివరాలు.. అదనపు సమాచారం కోసం కిరణ్ గారిని 7893989055 నెంబర్లో సంప్రదించవచ్చు.
- భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులు వాడాలి..
- సమయానికి తగిన మోతాదులోనే పొలానికి నీరు పెట్టాలి..
- కలుపు నివారణకు తగిన పద్ధతులను అనుసరించాలి
నారుమడిలో కలుపును ఎలా నివారించుకోవాలి?
నారుమడిని చల్లిన 15 రోజులకు సెహలోపాప్ పి బ్యూటైల్‌ను పంపుకు 25-30 మి.లీ.ల చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే కలుపును నివారించుకోవచ్చు.
నారుమడి నుంచి నారుతీతకు ముందు చేపట్టాల్సిన చర్యలేమిటి?
నారుమడి నుంచి నారుతీతకు వారం, పది రోజుల ముందు 2.5 సెంట్ల నారుమడికి 400 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలు వేయాలి.
దీనివల్ల కలిగే లాభం ఏమిటి?
నాటు వేసిన 20-25 రోజుల వరకు పంటకు చీడపీడలు కలిగించే పురుగుల నుంచి రక్షణ కలుగుతుంది. ఒకవేళ పురుగులు ఆశించినా నష్టపరిమితి స్థాయిని దాటదు.
నాటే ముందు పొలంలో ఏ జాగ్రత్తలు పాటించాలి?
నాటే ముందు గట్లపైన, పొలం చుట్టూ ఉండే గడ్డి, ఇతర జాతి కలుపు మొక్కలను తొలిగించి శుభ్రం చేసుకోవాలి. చివరి దమ్ము చేసిన తర్వాత ప్రతీ మడిలో సమతలంగా ఉండేలా చూసుకోవాలి.
దమ్ము చేసిన పొలంలో ఎంత వయసు గల నారును నాటాలి? ఎలా నాటాలి?
దమ్ము చేసిన పొలంలో 25-30 రోజుల వయసు గల నారును నాటుకోవాలి. నాటేటప్పుడు కుదురుకు ఒకటి లేదా రెండు చొప్పున చదరపు సెంటీమీటరుకు 44 మొక్కలు ఉండేలా నాటుకోవాలి. ఒకవేళ నారు ముదిరితే (60-70 రోజులు) కుదురుకు 3-4 మొక్కలు నాటాలి.
నాటే ముందు పొలంలో నీరు ఎలా ఉండాలి?
నాటే ముందు పొలంలో నీరు పలుచగా ఉండాలి. పైపైనే నాటాలి.
నాటే ముందు పొలంలో నీరు పలుచగా ఉండాలి. పైపైనే నాటాలి.
ముదురు నారును నాటేటప్పుడు వరి నారు కొనలు తుంచి వేయాలంటారు ఎందుకు?
ముదురు నారును నాటేటప్పుడు కొనలు తుంచి వేయడం వల్ల ఆకు చివరిభాగంలో గుడ్లు పెట్టే కాండం తొలుచు పురుగు, ఆకు ముడత పురుగులను నివారించవచ్చు.
వరి పొలంలో యాసంగి సీజన్లో కాలిబాటలు ఎలా వదలాలి? వాటివల్ల కలిగే లాభం ఏమిటి?
యాసంగి సీజన్లో వరి పొలంలో ప్రతీ రెండు మీటర్ల నాటుకు 20-25 సెం.మీ. కాలిబాటలు వదలాలి. అది కూడా ఉత్తర, దక్షిణ దిశలలోనే వదలాలి. అలా వదలడం వలన వరి పంటకు గాలి, సూర్యరశ్మి బాగా ప్రసరించి పైరు ఆరోగ్యంగా పెరుగుతుంది. చీడపీడల బెడద తగ్గుతుంది. (ప్రధానంగా సన్నరకాలలో సుడిదోమను చాలావరకు అరికట్టవచ్చు). ఎరువులు కూడా సులభంగా వేసుకోవచ్చు.
నాటిన తర్వాత పొలానికి నీరు ఎలా పెట్టాలి?
నాట్లు పూర్తి అయిన తర్వాత 4-5 రోజుల వరకు 2-3 అంగుళాల నీరు పెట్టాలి. ఇలా చేస్తే మొక్కలు తొందరగా ఎదుగుతాయి. వారం తర్వాత పిలకలు తొడిగే దశ వరకు 2.5 సెం.మీ.లకు మించి నీరు పెట్టకూడదు. నీరు ఎక్కువ పెడితే పిలకలు తక్కువ వస్తాయి. తర్వాత చిరు పొట్ట దశ నుంచి గింజలు పాలు పోసుకొని గట్టిపడే వరకు 5 సెం.మీ. నీరు పొలంలో ఉంచాలి. మధ్యమధ్యలో నీరు తీసి ఆరబెట్టి తిరిగి మరుసటి రోజున సిఫారసు చేసిన మోతాదులో నీరు పెడితే పైరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చీడపీడల బెడద తగ్గుతుంది.
పంటకు ఎరువులను ఎలా వాడాలి?
భూసార పరీక్షలను అనుసరించి ఎరువులు వేయాలి. సాధారణంగా ఎకరాకు ఒక బస్తా డీఏపీ, 35 కేజీల పొటాష్, 75 కేజీల యూరియా వేయాలి. అయితే యూరియా ఒకసారిగా కాకుండా మూడుభాగాలు చేసి 25 కేజీల యూరియాను నాటేటప్పుడు, రెండో భాగం నాటిన తర్వాత 12-15 రోజుల మధ్యలో, మూడోది చిరుపొట్ట దశలో వేయాలి. ఎరువులను వేసే ముందు ముఖ్యంగా యూరియాను వేసేటప్పుడు పొలం నుంచి నీరును తీసివేసి వేపపిండి, కంపోస్ట్‌ను లేదా వర్మీకంపోస్ట్‌ను కలిపి వేసుకోవాలి. ఈ విధంగా వేస్తే యూరియా వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.
కలుపు నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టాలి?
కలుపును నివారించేందుకు గాను 3-5 రోజులలో ఏకవార్షిక గడ్డి, తుంగ జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నైట్లెతే ఎకరాకు ఆక్సాడయార్జిల్, 35-40 గ్రాములు 250 మి.లీ.ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా బ్యూటాక్లోర్ను ఒక లీటరు లేదా అనిలోగార్డ్ 500 మి.లీ.లను 25-40 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి. కలుపు మందు చల్లేముందు పొలంలో సుమారుగా 2-5 సెం.మీ. నీరు మాత్రమే ఉండాలి. ఈ నీరు పూర్తిగా ఇంకిన తర్వాతే తిరిగి పొలానికి నీరు పెట్టాలి.
తాజావార్తలు
- ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం
- సేవలను విస్తరించిన సెటిల్
- రోబో-జోజో.. ఫ్రెండ్స్!
- కార్న్ దోశ
- మహారాష్ట్రలో పది వేలకు చేరిన కరోనా కేసుల నమోదు
- శశికళ సంచలన నిర్ణయం..
- గోల్డెన్ రేజర్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న సెలూన్ ఓనర్
- ఈ శుక్రవారం విడుదలవుతున్న 9 సినిమాలు ఇవే!
- బంగారం వద్దు ఇల్లే ముద్దు.. 70 % మంది మహిళల మనోగతం!
- బొలేరో, ఆటో ఢీ.. ఒకరి మృతి, ఆరుగురికి గాయలు