మంగళవారం 31 మార్చి 2020
Agriculture - Jan 22, 2020 , 22:42:44

ఉద్యాన పంటల్లో హార్మోన్ల వాడకం

ఉద్యాన పంటల్లో హార్మోన్ల వాడకం

మొక్కలు సక్రమంగా పెరిగి మంచి దిగుబడులు ఇవ్వాలంటే గాలి, నీరు, పోషకాలతో పాటు హార్మోన్లు కూడా కావాలి. హార్మోన్లలో పెరుగుదలకు సహకరించేవి (ఆక్సిన్లు, జిబ్బరిలిన్‌లు, నైటోకైనిన్‌లు). పెరుగుదలను నిరోధించేవి (అబ్‌సిసిక్‌ ఆమ్లం, ఇథిలిన్‌, మాలిక్‌ హైడ్రజైడ్‌లు) ఉన్నాయి.

విత్తన కొమ్మ ముక్కల (కటింగ్స్‌)కు వేర్లు బాగా రావడానికి వాటి అడుగుభాగాన్ని ఇండోల్‌ బ్యూట్రిక్‌ ఆమ్లం ద్రావణంలో ముంచి నారుమడిలో నాటితే వేర్లు త్వరగా వస్తాయి. IAA, NAA వంటి హార్మోన్లు కూడా ఇందుకు దోహదపడుతాయి. 

మిరపలో పూత, పిందె రాలటాన్ని అరికట్టేందుకు నాఫ్తలిన్‌ అసిటిక్‌ యాసిడ్‌  (NAA)ను 20 పి.పి.ఎం. మోతాదు (లీటరు నీటికి 20 మి.గ్రా.)లో తోట నాటాక 45 రోజులకు, ఆ తర్వాత 15 రోజుల వ్యవధి లో 2-3 సార్లు పిచికారీ చేయాలి. 

మామిడిలో పిందెరాలకుండా నివారించేందుకు NAA 20 పి.పి.ఎం. మోతాదుకు ఒక శాతం యూరియా (లీటరు నీటికి 10 గ్రా.) కలిపి పూత పై ఒకసారి, రెండు వారాల తర్వాత మరోసారి పిచికారీ చేయాలి. ప్రస్తు తం ప్లానోఫిక్స్‌ రూపంలో ఇది వాణిజ్యపరంగా ద్రవరూపంలో లభిస్తుంది. 

నిమ్మ, తియ్య నారింజలో 10 పి.పి.ఎం. మోతాదులో 2-4 డి ద్రావణాన్ని పూత సమయంలో, ఆ తర్వాత 2 వారాలకు చల్లితే పిందె రాలడం తగ్గుతుంది. 

కొబ్బరిలో పిందెరాలడం నివారణకు 2,4-డి హార్మోన్‌ను 60 పి.పి.ఎం మోతాదులో చల్లాలి. 

మామిడి, బొప్పాయి, అరటిపండ్లు తర్వగా పండటానికి 500-1000 పి.పి.ఎం. ఇథిరిల్‌ ద్రావణంలో ముంచి తీసి గాలి తగులకుండా ఉంచాలి. 48 గంటల్లో కాయలు ఆకర్షణీయమైన పసుపు రంగులో పండుతాయి. 

పూర్తిగా పెరిగిన సపోటా పండ్లను 100 పి.పి.ఎం. ఇథిరిల్‌ ద్రావణంలో ముంచితే త్వరగా పండుతాయి. 

తీగజాతి కాయగూర పంటలపై 5 పి.పి.ఎం. జిబ్బరిల్లిక్‌ ఆమ్లాన్ని 2 ఆకుల దశలో పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా వస్తాయి. పొట్టి మొక్కల ఎత్తు పెరిగేందుకు కూడా ఈ హార్మోన్‌ను వాడుతారు. 

ఉల్లి, ఆలుగడ్డలు తవ్వకం తర్వాత మొలకెత్తడాన్ని ఆపేందుకు మాలిక్‌ హైడ్రజైడ్‌ 1000 పి.పి.ఎం. ద్రావణాన్ని చల్లాలి. 

పక్వదశకు వచ్చిన నిమ్మ, నారింజ, బత్తాయి కాయలు ఆకర్షణీయమైన పసుపురంగులోకి  మారేందుకు ఇథిరిల్‌ ద్రావణాన్ని వాడొచ్చు. 

గమనిక: నిర్ణీత మోతాదులోనే హార్మోన్లను పిచికారీ చేయాలి. మోతాదు మించితే పూత, పిందెలతోపాటు ఆకులూ రాలిపోతాయి. నీటిలో కరుగని ఆక్సిన్లు, జిబ్బరిన్లకు ముందుగా ఆల్కహాల్‌లో కరిగించి తర్వాత నీటిలో కలుపాలి. మందు ద్రావణం పంటలకు బాగా అంటుకునేందుకు శాండోవిట్‌ లేదా సబ్బు నురగను కలుపాలి. ద్రావణం తయారీకి మంచి నీటినే వాడాలి. ఉప్పు నీళ్లు పనికి రావు. logo
>>>>>>