గురువారం 02 ఏప్రిల్ 2020
Agriculture - Jan 08, 2020 , 17:02:09

యాసంగిలో మక్కజొన్న మేలు

యాసంగిలో మక్కజొన్న మేలు

యాసంగిలో రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంట లు సాగు చేసుకోవడం మేలు. దీనివల్ల శ్రమ తక్కువ, దిగుబడి ఎక్కువ. వానకాలంలో వరి పంటను సాగు చేసిన రైతులు యాసంగిలో మక్కజొన్నను సాగు చేయడం వల్ల పంట మార్పిడి జరుగుతుంది. ఫలితంగా వ్యవసాయ భూములకు కూడా మేలు జరుగుతుంది. తగిన యాజమాన్య పద్ధతులతో మక్కజొన్నను సాగు చేస్తే దిగుబడి అధికంగా సాధించవచ్చు.

అనువైన నేలలు : సారవంతమైన, నీరు ఇంకే నల్లరేగడి నేలలు, ఎర్రనేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలలు ఈ సాగు చేయడానికి అనుకూలం. చౌడుభూములు, నీరు నిలువ ఉండే భూములు మక్కజొన్న సాగుకు పనికిరావు. నేలలోఉదజని సూచిక 6.5 నుంచి 7.5 ఉండాలి.

నేలతయారీ: విత్తడానికి ముందు 3 -4 సార్లు దుక్కిని బాగా కలియదున్నాలి. ఎకరాకు దాదాపు 10 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి.

విత్తన రకాలు: మక్కజొన్నలో కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక(105-120 రోజులు), మధ్యకాలిక(90-100) రోజు లు, స్వల్పకాలిక(90 రోజులలోపు) రకాలు అందుబాటు లో ఉంటాయి. నేలలను బట్టి స్థానిక వ్యవసాయ అధి కారుల సూచించిన రకాలను సాగు చేసుకోవాలి.

విత్తనమోతాదు, విత్తేదూరం: సంకర రకం విత్తనాలను ఎకరాకు 8 కేజీలు సాళ్ల మధ్య దూరం 60- 75 సెంటీమీటర్లు, మొక్కల మధ్యదూరం 20 - 25 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి.

విత్తేపద్ధతి: మొదట బోదె నాగలితో వరసల మధ్య 60 -75 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్లు బోదెలు చేసుకోవాలి. తరువాత సాళ్లలో మొక్కకు, మొక్కకు మధ్య 20 -25 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్లు విత్తనాన్ని బోదెకు కుడివైపున విత్తితే నీటి పారుదల సులభంగా ఉండటమే కాకుం డా వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు నీరు బయటకు పోవడానికి కూడా వీలు ఉంటుంది,

విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రా. మాంకోజెట్‌ లేదా థైర మ్‌ లేదా కాప్టాన్‌తో విత్తనాలను శుద్ధి చేసుకుంటే లేత దశ లో మొక్కలు తెగుళ్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

ఎరువుల యాజమాన్యము: సంకర రకాలకు ఎకరాకు 80 నుంచి 100 కేజీలు నత్రజని, 24 కేజీలు భాస్వరం, 24 కేజీల పొటాష్‌ను చల్లుకోవాలి. విత్తనాలను విత్తేటప్పుడు నత్రజనిని 1/4 వంతు వేసుకోవాలి. 25 నుంచి 30 రోజుల మధ్య, 45 నుంచి 50 మధ్య, 60 నుంచి 65 రోజుల మధ్య లో మిగతా నత్రజనిని 1/4 వంతు వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువును విత్తే సమయంలో వేయాలి. సగం పొటాష్‌ ఎరువును విత్తే సమయం, మిగతా సగం పొటాష్‌ ఎరువును 60 నుంచి 65 రోజుల మధ్యలో వేసుకోవాలి. ఎకరాకు 20 కిలోల జింక్‌సల్ఫేట్‌ను మూడు పంటలకు ఒకసారి దుక్కిలో వేసుకోవాలి. మొక్కలలో జింకు లోపం కనిపిస్తే లీటరు నీటికి 2 గ్రాముల జింక్‌సల్ఫేట్‌ను కలిపి పైరుపై పిచికారీ చేసుకోవాలి.

యాజమాన్య పద్ధతులు: పంట విత్తిన తరువాత రెండు రోజులలోపు కలుపు మందు తేలిక నేలలో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలలో అయితే ఎకరాకు 1200 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు 24 నుంచి 48 గంటల వ్యవధిలోపు పిచికారీ చేయాలి. దీనివల్ల వెడల్పాటి ఆకులు గల కలుపు మొక్కలను దాదాపు నెల వరకు మొలువకుండా అదుపు చేయవచ్చు.

అంతరకృషి: విత్తిన 30 నుంచి 45 రోజులకు కల్టివేటర్‌తో అంతరకృషి చేస్తే కలుపు మొక్కలను నివారించవచ్చు. తరువాత నత్రజని ఎరువును వేసినచో పంట పెరుగుదలకు సక్రమంగా వినియోగపడుతుంది.

నీటియాజమాన్యం: ఈ పంటకు పూతకు ముందు, పూతదశలో, గింజ పాలుపోసుకునే దశలో బాగా నీరు పెట్టడం అవసరం. 30 నుంచి 40 రోజులలోపు ఉన్న లేత పంటకు అధిక నీళ్లు హనికరం. సాధారణంగా పంట కాలంలో 6 నుంచి 8 నీటితడులు అవసరం. విత్తిన 15 రోజులకు, 30 నుంచి 35 రోజులకు, పూతదశలో, గింజ పాలు పోసుకునే దశలో తప్పనిసరిగా నీటి తడులను ఇవ్వాలి. ముఖ్యంగా ఆకులు చుట్ట చుట్టుకునేటపుడు నీటి ఆవశ్యకత ఉన్నట్లుగా గమనించి నీటి తడులను ఇవ్వాలి.

సస్యరక్షణ:కాండం తొలుచు పురుగులు: యాసంగిలో ఈపంటను ఎక్కువగా గులాబీరంగు కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. పొలం చుట్టూ 3 లేదా 4 వరుసలలో జొన్నను ఎరపంటగా వేసి 45 రోజుల తరువాత తీసివేయడం, అంతరపంటగా అపరాలను సాగుచేయడం వలన సహజ శత్రువుల సంఖ్య పెరుగుతుంది.

నివారణచర్యలు: మోనోక్రోటోఫాస్‌ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి 10 -12 రోజుల పైరు మీద పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే పంట 20 - 28 రోజు ల వయస్సు ఉన్నప్పుడు కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున ఆకుల సుడులలో వేయాలి.

రసంపీల్చే పురుగులు: 30 రోజుల పైబడిన పంటను పేనుబంక, చిగురునల్లి ఆశించవచ్చు. వీటి ఉధృతి ఎక్కువగా ఉంటే మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ.లు, లేదా డైమిథోయే ట్‌ 2.0 మి.లీ.లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

ఆకుమాడుతెగులు(కమ్మరోగం): ఆకులపై గోలాకారపు బూడిదరంగులో కూడిన ఆకుపచ్చ లేక గోధుమరంగు చిన్నమచ్చలు ఏర్పడుతాయి. వీటి నివారణకు లీటరు నీటి కి 2.5 గ్రాములు మాంకోజెబ్‌ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.

తుప్పుతెగులు: ఆకులపై రెండు వైపులా గుండ్రని లేక పొడవాటి గోధుమ వర్ణం పొక్కుల మాదిరిగా తెగులు లక్షణాలు కనిపిస్తాయి. మాంకోజెబ్‌ 2.5 గ్రాములు లీటరు నీటికి చొప్పున కలిపి తెగులు తీవ్రతను బట్టి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి తెగులును సమర్థవంతంగా అరికట్టవచ్చు.

పంటకోత: పంటకోతకు వచ్చినపుడు బుట్టల పైపొరలో ఎండినట్లు కనిపిస్తాయి. బాగా ఎండిన కాయలు మొక్కల పై కిందకు వేలాడుతూ కనిపిస్తాయి. కండెలలోని గింజల ను వేలి గోరుతో నొక్కినపుడు చాలా గట్టిగా ఉండి నొక్కు లు ఏర్పడవు. అంతేకాకుండా బుట్టలోని గింజలను తీసి అడుగుభాగం పరీక్షిస్తే నల్లని చారలు ఉండటం గమనించవచ్చు. ఈ దశలో గింజలలో సుమారుగా 20 నుంచి 30 శాతం తేమ ఉంటుంది. కండెలను మొక్కల నుంచి వేరుచేసి గింజలలో తేమశాతం 12 నుంచి 15 వరకు 3 లేక 4 రోజులు ఎండలో బాగా ఎండబెట్టాలి. పేలాల రకం వేసినపుడు గింజలలో 30 నుంచి 35 శాతం తేమ ఉన్నప్పు డు కండెలు కోసి నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టితే సరైన పేలాలుగా మారక గింజ పగిలి నాణ్యత తగ్గుతుంది. తీపి రకం వేసినపుడు గింజ పాలుపోసుకునే దశలోనే కండెలు కోసుకోవాలి. మక్కజొన్నను పశువుల మేత కోసం వేసినపుడు 50 శాతం పూత దశలో పంటను కోయాలి. ఈదశలో కంకులను మార్పిడి చేయుటకు ట్రాక్టర్‌తో లేదా కరెంట్‌తో నడిచే మార్పిడి యంత్రాలను ఉపయోగించాలి. మార్పిడి తరువాత గింజలను రెండు లేదా మూడు రోజులు ఎండలో ఆరబెట్టి శుద్ధి చేసి గోనె సంచులలో గాని లేదా పాలిథీన్‌ సంచులలో గాని భద్రపరిచి చల్లని, తక్కువ తేమ గల ప్రాంతాలలో నిల్వచేయాలి. దీనితో పాటు తేమ గాని ఎలుకలు, పురుగులు లేదా శిలీంద్రాలు మొదలైనవి రాకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
-నగిరి హరీష్‌, త్రిపురారం


logo
>>>>>>