ఆదివారం 29 మార్చి 2020
Agriculture - Jan 08, 2020 , 17:00:53

ఐదెకరాల్లో సేద్యం.. 30 లక్షల లాభం

ఐదెకరాల్లో సేద్యం.. 30 లక్షల లాభం

మూస పద్ధతిలో కాకుండా కొత్త పంటల సాగు దిశగా ఆ రైతు ఆలోచించాడు. బొప్పాయి సాగు చేపట్టి నీటి కొరతతో.. తొలి ఏడాదే నష్టాలు చవిచూశాడు. అయినా భయపడకుండా వరుసగా బొప్పాయి సాగు చేపడుతున్నాడు. ఏటికేడు క్రమంగా పెరుగుతూ వస్తున్న లాభం.. తాజాగా రికార్డుస్థాయి లాభాలను తెచ్చి పెట్టింది. ఐదు ఎకరాల్లో బొప్పాయి సాగు చేపట్టిన ఆ రైతుకు.. రూ. 30 లక్షలకు పైగా లాభం వచ్చింది. వైరల్‌ జ్వరాలతో ఒకేసారి బొప్పాయికి డిమాండు పెరుగడంతో పాటు.. దిగుబడి సైతం భారీగా వచ్చిన నేపథ్యంలో రైతు రికార్డు ఆదాయం ఆర్జించారు. 35 ఏండ్ల వయసున్న యువ రైతు.. తాను నివాసం ఉండే గ్రామం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామంలో బొప్పాయి సాగు చేపట్టి.. నిత్య పర్యవేక్షణతో మంచి దిగుబడి పొంది సాధించిన ఈ విజయం.. నల్లగొండ జిల్లా అంతటా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. లాభం రూపంలో భారీ విజయం అందుకున్నా.. తానెప్పుడూ ధర కంటే దిగుబడి గురించే ఎక్కువ ఆలోచిస్తానని.. నాణ్యత, దిగుబడి తగ్గకుండా చూసుకుంటే వ్యవసాయంలో కచ్చితంగా విజయం సాధిస్తామని చెప్తున్నాడు యువ రైతు చింతరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి.

నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని ధర్మాపురం మా స్వగ్రామం. ధర్మాపురంతో పాటు మా ఊరికి 25 కిలోమీటర్ల దూరాన ఉన్న తోపుచర్లలోనూ నేను వ్యవసాయం చేస్తుంటాను. మా చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు ఎక్కువగా పత్తి, వరి, మిర్చి, బత్తాయి వంటి పంటలు సాగు చేస్తుంటారు. మా ఊరి రైతులు మాత్రం కూరగాయల సాగును ఎక్కువగా చేపడతారు. గ్రామంలో కొందరు రైతులను చూసి నేను కూడా అందరి కంటే భిన్నమైన పంటల సాగు చేపట్టాలనే ఆలోచనతో.. 2013లో బొప్పాయి సాగు మొదలు పెట్టాను. ఇతర రైతుల నుంచి 25 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని బొప్పాయి మొక్కలు వేసినా.. నీళ్లు సరిపోక సరైన దిగుబడి రాలేదు. తొలి ఏడాదే రూ. లక్షల్లో నష్టం చవి చూశాను. 2016 నుంచి తోపుచర్లలో ఉన్న మా సొంత భూమిలో కూడా బొప్పాయి వేయడం మొదలు పెట్టాను. సుమారు 5 ఎకరాల భూమిలో 4000 మొక్కలు నాటి సాగు చేపడుతున్నాను. తొలి ఏడాది 100 టన్నుల దిగుబడి వచ్చింది. రెండో ఏడాది 200 టన్నులకు దిగుబడి పెరిగింది.

నాలుగు నెలల్లో రూ. 30 లక్షల లాభం

గతంలో సగటున టన్నుకు రూ. 7000 నుంచి 8000 ధరకు పంట అమ్ముడుపోయేది. కనిష్ఠంగా రూ. 4 వేలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. గరిష్ఠంగా రూ. 11,000 టన్నుకు ఒకటీ రెండుసార్లు మాత్రమే లభించాయి. ఢిల్లీ మార్కెట్‌, హైదరాబాద్‌ మార్కెట్లకు బొప్పాయిని ఎగుమతి చేస్తుంటాం. ఈ ఏడాది కూడా 4000 మొక్కలు నాటాను. 150 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ఎండాకాలంలో వచ్చే గాలి వానలతో పాటు.. ఈసారి వేసవిలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడి కారణంగా చాలామంది తోటలు నష్టపోయారు. ఫలితంగా చుట్టు పక్కల దిగుబడి తగ్గింది. దీనికితోడు వైరల్‌ జ్వరాల కారణంగా డాక్టర్ల సూచనతో బొప్పాయి తినడానికి ప్రజలు ఎగబడ్డారు. దీంతో ధర అమాంతం పెరిగిపోయింది. గతంలో గరిష్ఠంగా క్వింటాలుకు రూ. 11000 మాత్రమే పొందిన మాకు.. ఈసా రి రూ. 58000 కూడా ఒక సందర్భంలో లభించింది. ఢిల్లీ మార్కెట్‌కు గరిష్ఠంగా రూ. 25000 వరకు అమ్మగా.. హైదరాబాద్‌ మార్కెట్‌లో సగటున రూ. 40,000 వరకు ధర పలికింది. దీంతో 2019లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లోనే రూ. 30 లక్షల లాభం నాకు దక్కింది.
జూలకంటి రాజేందర్‌ రెడ్డి

నమస్తే తెలంగాణ నల్లగొండ జిల్లా ప్రధాన ప్రతినిధి సమగ్ర సస్య రక్షణతో అధిక దిగుబడి 2018 డిసెంబర్‌ 31న 4000 మొక్కలు తోపుచర్లలోని ఐదు ఎకరాల భూమిలో నాటా ను. అంతకుముందే భూమికి పెంట కొట్టడంతోపాటు.. జనుము చల్లి పూత వచ్చే దశలో భూమిలోనే దాన్ని ట్రాక్టర్లతో తొక్కించి.. ఆ తర్వాత మొక్కలు నాటాను. ఏటా మేమే నర్సరీ ఏర్పాటు చేసుకొని బొప్పాయి మొక్కలు పెంచుతున్నా.. ఈసారి మాత్రం బీబీనగర్‌ నర్సరీ నుంచి ఒక్కో మొక్కకు రూ. 18 వెచ్చించి కొనుగోలు చేశాను. థైవాన్‌ రెడ్‌ లెడ్‌ 786 అనే రకం బొప్పాయిని ఎంచుకున్న నేను.. 90 శాతం ఆర్గానిక్‌ పద్ధతిలోనే సాగు చేపట్టాను. ఈ కారణంతోనే గతేడాదితో పోల్చినపుడు 50 టన్నుల దిగుబడి తగ్గినా.. పండు నాణ్యతతో అధిక ధర పలికిన కారణంగా లాభం కలిసొచ్చింది. మొక్క లు నాటిన తొలి నాళ్లలో గడ్డి మందు కొట్టకుండా.. కలుపు కూలీల ద్వారా తీసుకోవడంతోపాటు.. బొప్పాయిలో నిత్యం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. 2018 జూన్‌ 15 నుంచి దిగుబడి ప్రారంభమైంది. ఇప్పటికీ దిగుబడి కొనసాగుతున్నది. సాధారణంగా బొప్పాయి మొక్క నాటిన ఆర్నెళ్లకు దిగుబడి మొదలవుతుంది. ఆ తర్వాత ఆరేడు నెలల పాటు లభిస్తుంది. టన్నుకు గరిష్ఠంగా రూ. 10,000 ధర లభించినా.. బొప్పాయి సాగుతో మంచి ఆదాయమే లభిస్తుంది. బొప్పాయి సాగు చేయాలనుకునే రైతులు.. ధర గురించి కాకుండా మంచి నాణ్యత, దిగుబడి సాధించడం గురించి ఎక్కువ దృష్టి పెడితే ఫలితం ఉంటుందనేది నా విషయంలో రుజువైంది.


-చింతరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ధర్మాపురం గ్రామం,
మాడ్గులపల్లి మండలం, నల్లగొండ జిల్లా. 7702358354


logo