రాష్ట్రంలో ఇప్పటికే అవసరానికి మించి వరి సాగవుతున్నది. మరోవైపు యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ వడ్లు పండిస్తే.. కష్టాలు, నష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అందుకే, వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాల్సిన అవసరం ఉన్నది. మార్కెట్లోడిమాండ్ ఉన్న పంటలను ఎంచుకొంటేనే అన్నదాతకు లాభం.
రైతు సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలతో.. వ్యవసాయం పండుగలా మారింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా లెక్కకు మిక్కిలిగా వరి పంట సాగవుతున్నది. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయబోమని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. వ్యవసాయం అంటే ఒక్క వరి మాత్రమే కాదనీ, యాసంగిలో సాగు చేసేందుకు అద్భుతమైన పంటలు అందుబాటులో ఉన్నాయనీ చెబుతున్నారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటిస్తే, వరికి మించి ఆదాయం పొందవచ్చని భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు ఉన్నాయి? వాటి సాగు విధానం, మేలురకపు విత్తనాల గురించి ఇలా వివరిస్తున్నారు…
పప్పు ధాన్యాలు
పెసర
విత్తే సమయం : అక్టోబర్ 15 నుంచి నవంబర్ చివరి వరకు..
విత్తన రకాలు : డబ్ల్యూజీజీ-42, 37, ఎంజీజీ-295, 347, 348, 351
విత్తన మోతాదు : ఎకరానికి 6 నుంచి 8 కిలోలు
శనగ
విత్తే సమయం : అక్టోబర్ 15 నుంచి నవంబర్ చివరి వరకు..
విత్తన రకాలు :
దేశవాళీ రకాలు : జేజీ-11, 130, జేఏకేఐ-9218, ఐసీసీవీ-37, నంద్యాల శెనగ-1, 47
కాబూలీ రకాలు : కేఏకే-2, పూలే, జి-95311, ఐసీసీవి-2
విత్తన మోతాదు : దేశవాళీ రకాలైతే ఎకరానికి 25 నుంచి 30 కిలోలు, కాబూలీ రకాలైతే ఎకరానికి 45 నుంచి 60 కిలోలు
మినుములు
విత్తే సమయం : అక్టోబర్ 15 నుంచి నవంబర్ చివరి వరకు..
విత్తన రకాలు : డబ్ల్యూబీజీ-26, ఎంబీజీ-207, ఎల్బీజీ-20, 623, 752, 787, పీయూ-31
విత్తన మోతాదు : ఎకరానికి 6 నుంచి 8 కిలోలు
కంది
విత్తే సమయం : సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు..
విత్తన రకాలు : ఎల్‌ఆర్‌జీ-41, ఐసీపీఎల్-85063, డబ్ల్యూఆర్‌జీ-27, 53, 65, పీ
ఆర్జీ-158, ఎమ్ఆర్జీ-1004, ఆర్జీటీ-1, టీడీఆర్జీ-4, ఐసీపీహెచ్-2740
విత్తన మోతాదు : ఎకరానికి 6 నుంచి 8 కిలోలు
దిగుబడి : ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్లు
నూనె రకాలు
నువ్వులు
విత్తే సమయం : సెప్టెంబర్ నుంచి జనవరి చివరి వరకు..
విత్తన రకాలు : శ్వేతాతిల్, హిమ (జేసీఎస్-9426), రాజేశ్వరి, చందన, యలమంచిలి-66 (శారద), గౌరి, మాధవి
విత్తన మోతాదు : ఎకరానికి 2.5 కిలోలు
ఆముదం
విత్తే సమయం : అక్టోబర్ చివరి వరకు..
మేలు రకం విత్తనాలు : ప్రగతి, హరిత, సీసీహెచ్-111, డీసీహెచ్-177, 519
విత్తన మోతాదు : ఎకరానికి 2 నుంచి 2.5 కిలోలు
వేరుశెనగ
విత్తే సమయం : సెప్టెంబర్ మొదటి వారం నుంచి నవంబర్ చివరి వరకు..
మేలు రకపు విత్తనాలు : కదిరి-1812 (లేపాక్షి), కదిరి-6, 7, 8, 9, అనంత, కదిరి హరితాంధ్ర, ఐసీజీవీ-91114, ధరణి, టీఏజీ-24
విత్తన మోతాదు : ఎకరానికి 60 నుంచి 80 కిలోలు
కుసుమ
విత్తే సమయం : నవంబర్ 15 వరకు..
విత్తన రకాలు : మంజీరా, టీఎస్ఎఫ్-1, నారి-6, పీబీఎన్ఎస్-12,
జేఎస్ఎఫ్-414, డీఎస్‌హెచ్-185
విత్తన మోతాదు : ఎకరానికి 4 కిలోలు
పొద్దు తిరుగుడు (సన్‌ఫ్లవర్)
విత్తే సమయం : నవంబర్ నుంచి జనవరి వరకు..
విత్తన రకాలు : కేబీఎస్‌హెచ్-44, ఎన్డీ ఎస్‌హెచ్-1, డీఆర్‌ఎస్‌హెచ్-1.
విత్తన మోతాదు : ఎకరానికి 2.5 నుంచి 3 కిలోలు
ఆహార ధాన్యాలు
మక్క జొన్న
విత్తే సమయం : అక్టోబర్ నుంచి నవంబర్ చివరి వరకు..
విత్తన రకాలు : 900 ఎం.గోల్డ్, ఎన్కే-30, ఎన్కే-6240 (దీర్ఘ
కాలిక), కోహినూర్, ప్రబల్, బిస్కో-855 (మధ్యకాలిక), పయొనీర్-3342, కేహెచ్-5991, డీకేసీ-7074 (స్వల్ప కాలిక).
విత్తన మోతాదు : ఎకరానికి 10 కిలోల వరకూ..
ఆవాలు
విత్తే సమయం : నవంబర్ చివరి వరకు..
విత్తన రకాలు : పూస అగ్రాని, పూస మహాక్, వరుణ, నరేంద్ర, అగేతి
విత్తన మోతాదు : ఎకరానికి 2 నుంచి 2.5 కిలోలు
జొన్న
విత్తే సమయం : డిసెంబర్ చివరి వరకు..
విత్తన రకాలు : సీఎస్వీ-29, సీఎస్వీ-216, ఆర్ అండ్ పీఎస్‌హెచ్-13, 16
విత్తన మోతాదు : ఎకరానికి 3 నుంచి 4 కిలోలు
రాగులు
విత్తే సమయం : అక్టోబర్ చివరి వారం వరకు..
విత్తన రకాలు : హిమ
విత్తన మోతాదు : ఎకరానికి 3 నుంచి 4 కిలోలు
పొద్దు తిరుగుడు, మక్కజొన్న పంటలను వరి కోసిన తర్వాత దుక్కి దున్నకుండానే విత్తుకోవచ్చు. దీనివల్ల దున్నకపు ఖర్చు ఆదా అవుతుంది.
ఏ నేలలో.. ఏ పంటలు!
నీటి సౌకర్యం గల ఎర్ర నేలలు.. వేరుశెనగ, ఆముదం, సన్‌ఫ్లవర్, కంది, పెసర, మినుము, అలసంద, జొన్న, మక్కజొన్న, కుసుమ, నువ్వులు
నీటి సౌకర్యం గల నల్ల రేగడి నేలలు.. ఆముదం, సన్‌ఫ్లవర్, మక్కజొన్న, పెసర, మినుము, నువ్వులు.
వర్షాధారపు ఎర్ర నేలలు ..ఉలువలు, జొన్నలు.
వర్షాధారపు నల్ల రేగడి నేలలు.. శనగ, కుసుమ, ఆవాలు.
-స్వామిరెడ్డి కొమ్మిడి