e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 20, 2021
Home ఆదిలాబాద్ సంక్షేమం.. చేయూత

సంక్షేమం.. చేయూత

  • అడవి బిడ్డలకు సర్కారు దన్ను
  • స్వయం ఉపాధిపై ప్రత్యేక దృష్టి
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు రూ. 45.32కోట్లు
  • రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్పొరేషన్‌ ద్వారా విడుదల
  • వివిధ యూనిట్లు అందించేందుకు కసరత్తు
  • నాలుగు జిల్లాల్లో కలిపి 16,958 దరఖాస్తులు
  • ఎంపిక కోసం ఇప్పటికే ప్రారంభమైన గ్రామసభలు

అడవి బిడ్డల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు భారీగా నిధులను వెచ్చిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను స్వయం ఉపాధి యూనిట్లు, వివిధ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు వీటితో అండగా నిలువనున్నది. రెండేళ్లకు కలిపి రాష్ట్ర గిరిజన కార్పొరేషన్‌ ద్వారా రూ. 45.32 కోట్లు విడుదల చేసింది. నాలుగు జిల్లాల్లో కలిపి ఇప్పటికే 16,958 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామసభలను నిర్వహిస్తున్నది. వీటితో వారికి ఆర్థిక స్వావలంబన కల్పించాలని సర్కారు భావిస్తుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

- Advertisement -

నిర్మల్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 24: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో స్వయం ఉపాధి యూనిట్లు, వివిధ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నిధులు విడుదలయ్యాయి. ఈమేరకు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి తెలిపారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి రూ. 10.04 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 35.28 కోట్లు విడుదల చేశారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజనులు ఈ రెండేళ్లకు గాను వివిధ పథకాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఐటీడీఏ ఆధ్వర్యంలో స్వీకరించగా, మొత్తం 16958 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఆదిలాబాద్‌ జిల్లాలో 8804, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 4155, మంచిర్యాల జిల్లాలో 2072, నిర్మల్‌ జిల్లాలో 1927 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే నిరుద్యోగ యువతీయువకులతో పాటు రైతులకు పారిశ్రామిక వర్గాల వారికి స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో గిరిజన కార్పొరేషన్‌ ద్వారా రుణాలను పొందేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో రూ. 50 వేలు, రూ. లక్ష, రూ. 2 లక్షలు, రూ. 4 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 9 లక్షలు, రూ. 10లక్షల యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా స్వయం ఉపాధి కోసం నర్సరీల పెంపకం, టైలరింగ్‌, వస్త్ర దుకాణాలు, కిరాణా దుకాణాలు, క్రీడా సామగ్రి, ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ, కుటీర పరిశ్రమలు, మహిళలకు గ్రామాల్లోనే స్వయం ఉపాధి కల్పించే పథకాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. అదే విధంగా రైతులు వ్యవసాయ అనుబంధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎడ్లబండ్లు, పాడి గేదెలు, వ్యవసాయ పంపుసెట్లు, పండ్ల తోటల సాగు, బిందు సేద్యం, తుంపర్ల సేద్యం వంటి పథకాలకు దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. త్వరలోనే ఎంపిక పూర్తి చేసి నిధులను వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

ప్రారంభమైన గ్రామసభలు..

నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో గిరిజన కార్పొరేషన్‌ ద్వారా రుణసాయం పొందేందుకు వివిధ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 1705 గ్రామపంచాయతీల్లో స్థానిక ఎంపీడీవో నేతృత్వంలో మండలస్థాయి అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాల ఆధారంగా ఇందులో అర్హులను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వివిధ కులాల్లో ఇది వరకు ప్రభుత్వం ద్వారా సాయం పొందని వారిని గుర్తించి మొదటి ప్రాధాన్యత కింద ఎంపిక చేస్తున్నట్లు మండలస్థాయి అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే సుమారు 900 గ్రామపంచాయతీల్లో గ్రామసభలను నిర్వహించి లబ్ధిదారుల ఎంపికను కూడా పూర్తి చేసినట్లు మండలస్థాయి అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం రెండేళ్లకు కలిపి ఒకేసారి నిధులు విడుదల చేయడంతో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్రైకార్‌ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నా

దండేపల్లి, సెప్టెంబర్‌24 : నా పేరు కుడిమెత రవీందర్‌. మాది దండేపల్లి మండలం జైతుగూడ గిరిజన గ్రామం. కూలీ పనులు చేస్తుంటా. ట్రైకార్‌ పథకంలో గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఇస్తున్నారని తెలిసి దరఖాస్తు చేసుకున్నా. రూ.2 లక్షల రుణం కోసం అన్ని పత్రాలు అందించిన. రుణం మంజూరైతే కిరాణం పెట్టుకుంటా. నాతో పాటు మా గూడెంలో 30 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. రుణం అందితే గిరిజనులకు స్వయం ఉపాధితో పాటు, ఆర్థిక పరిస్థితులు మెరగుపడుతాయి. ఐటీడీఏ అధికారులు త్వరగా రుణాలు మంజూరు చేస్తే మేలు జరుగుతుంది.

గిరిజన బిడ్డలకు ఉపాధి అవకాశాలు..

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. మొన్ననే దళితులందరికీ రూ. 10 లక్షల ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. ఇప్పుడు గిరిజనులకు కూడా స్వయం ఉపాధి యూనిట్ల కోసం నిధులను విడుదల చేయడం సంతోషంగా ఉంది. రెండేళ్లుగా వివిధ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్న గిరిజన యువతకు సంబంధించిన బడ్జెట్‌ను ఒకేసారి విడుదల చేసి, ఉపాధి కల్పించడం చాలా సంతోషంగా ఉంది.
భూక్యా అమర్‌సింగ్‌, తాటిగూడ, పెంబి మండలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement