e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home ఆదిలాబాద్ దిశ దిశలా నమస్తే

దిశ దిశలా నమస్తే

దిశ దిశలా నమస్తే

తెలంగాణ మానస పుత్రిక
నాడు స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం అలుపెరగని పోరాటం
బంగారు తెలంగాణ నిర్మాణంలో తనవంతు పాత్ర
ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక భూమిక
సంచలనాత్మక కథనాలతో అక్రమార్కుల గుండెల్లో హల్‌చల్‌
స్వరాష్ట్ర సాధన తర్వాత ప్రజలు, ప్రభుత్వానికి వారధి
నేడు పదో వార్షికోత్సవం

ఆదిలాబాద్‌, జూన్‌ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ మానస పుత్రిక ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రిక, అప్పుడే పది వసంతాలు పూర్తి చేసుకున్నది. స్వరాష్ట్ర నిర్మాణంలో కీలకపాత్ర పోషించి, నేడు పదకొండో వసంతంలోకి అడుగుపెట్టబోతున్నది. 2011 జూన్‌ 6న తొలి సంచిక మొదలైప్పటి నుంచి నేటి వరకు జనం వెంటే ఉన్నది. రాష్ట్రం సిద్ధించే వరకు ఉద్యమ పత్రికగా మనందరి ‘ప్రత్యేక’ ఆకాంక్ష కోసం అలుపెరుగని పోరాటం సాగించింది. నాటి ఉమ్మడి పాలనతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కండ్లగట్టింది. రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా వివరించింది. సీమాంధ్ర మీడియా చేస్తున్న దగాను, మన ఉద్యమాన్ని వక్రీకరిస్తున్న తీరును బహిర్గతం చేసింది. నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు, రాస్తారోకోల చిత్రాలను మన కండ్లముందుంచింది. స్వరాష్ట్ర ఆకాంక్షను గల్లీ నుంచి ఢిల్లీ దాకా బలంగా వినిపించింది. రాష్ట్ర ఆవిర్భావం ఓ వైపు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న తరుణం.. స్వరాష్ట్ర కాంక్ష కోసం ఉధృతమైన పోరాటం.. రాస్తారోకోలు, ర్యాలీలు, హోరెత్తిన నిరసనలు.. మరోవైపు సీమాంధ్ర కుట్రలు.. ఏ పత్రిక తిరగేసినా విషపు రాతలు.. అలాంటి సందర్భంలోనే నాలుగున్నర కోట్ల ప్రజల గొంతుకై వచ్చింది ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక. 2011 జూన్‌ 6న తొలి పొైద్దె పొడిచి, తెలంగాణ వాణిని గల్లీ నుంచి ఢిల్లీదాకా బలంగా వినిపించింది. దశాబ్దాలుగా జరిగిన అన్యాయాలను, అవహేళనలను, అవమానాలను వివరిస్తూనే, ఉద్యమంలో కీలకంగా వ్యవహరించింది. ఇదే సమయంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, నిరుపేదలు, నిర్వాసితుల గొంతుకైంది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రజలకు, సర్కారుకు వారధిలా ఉంటూ, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నది.
బర్లను మింగిన అనకొండ..
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 90 బర్లను మాయం చేశాడో ఘనడు.. నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలోని కౌట్ల(బీ) మ్యాక్స్‌ కేంద్రంగా పశుక్రాంతి పథకాన్ని పక్కదోవ పట్టించిన ఓ ప్రజాప్రతినిధి.. 83 మంది లబ్ధిదారుల పేరిట విడుదలైన రూ.30.50 లక్షలను స్వాహా చేశాడు.. తర్వాత ఆ బర్లనూ అమ్మి సొమ్ము చేసుకున్నాడు.. ఆ మాయగాని బాగోతానికి నివ్వెరపోయిన లబ్ధిదారులు.. ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.. ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల తీరూ పలు అనుమానాలకు తావిస్తోంది.. దీనిపై అప్పటి ఏజేసీ, పశు సంవర్ధకశాఖ కరీంనగర్‌ జేడీ విచారణ పూర్తిచేశారు. రెండు నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కథనం 2014లో ‘నమస్తే తెలంగాణ’ జిల్లా టాబ్లాయిడ్‌లో ప్రచురితం కాగా.. జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. అధికారులపై విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
‘మరో ఖనిజం’ పై కదలిక..
లాటెరైట్‌.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నార్నూర్‌ అడవుల్లో కొత్తగా వెలుగు చూసిన మరో ఖనిజం. సిమెంట్‌ తయారీలో వాడే ఈ మూలకం మార్కెట్లో లక్షలాది రూపాయలు పలుకుతుంది. ఈ విషయం తెలిసిన ఓ టీడీపీ నేత కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు వ్యూహం పన్నాడు. తను భవిష్యత్‌లో పెట్టబోయే సిమెంట్‌ ఫ్యాక్టరీ కోసం ఓ మైనింగ్‌ డాన్‌ కనుసన్నల్లో తతంగాన్ని నడిపించాడు. నిక్షేపాలు లభ్యమైన భూ యజమానుల వెంట ఉండి మరీ రహస్యంగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందినట్లు తెలుస్తుండగా, గుట్టుచప్పుడు కాకుండా ఖనిజాన్ని వెలికి తీసి అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తూ పట్టుబడ్డారు. ఈ కథనం 2012, జనవరి 12న ‘నమస్తే తెలంగాణ’ జిల్లా సంచికలో ప్రచురితమైంది. దీనిపై ఎట్టకేలకు జిల్లా ఉన్నతాధికారుల్లో చలనం వచ్చింది. నార్నూర్‌ మండలం చిత్తగూడ అడవుల్లో లాటెరైట్‌ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని అప్పటి జేసీ సుజాతశర్మ పరిశీలించారు. తవ్వకాలకు అనుమతి ఉన్న మాట వాస్తవమేననీ, రెవెన్యూ, అటవీశాఖ మధ్య నడుస్తున్న భూ పంచాయితీని త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు సంయుక్త సర్వేకు రెండు శాఖల అధికారులను ఆదేశించారు.
భూ సమస్యల పరిష్కార వేదిక ‘ధర్మగంట’
రెవెన్యూ శాఖ అంటేనే అవినీతి అక్రమాలకు పెట్టింది పేరుగా ఉండేది.. ఈ శాఖలో ఏ పని కావాలన్నా చేయి తడపనిదే కాదన్నది అందరికీ తెలిసిందే.. పేదోడికి ఇక్కడ ఏదైనా పని పడిదంటే చెప్పులరిగేలా తిరగాల్సిందే.. ఈ క్రమంలో 2019లో ‘నమస్తే తెలంగాణ’ ప్రజా గొంతుకగా నిలిచింది. ధర్మగంట పేరిట వందలాది కథనాలు ప్రచురించింది. వాట్సాప్‌, మెయిల్‌ ద్వారా అర్జీలు, ఫిర్యాదులను స్వీకరించింది. సమస్య అధికారుల దృష్టికి వెళ్లేలా చేసింది. ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపింది. అధికార యంత్రాంగమే స్వయంగా రంగంలోకి దిగి బాధితులకు న్యాయం చేసేలా కథనాలు ప్రచురించింది. 2019 ఏప్రిల్‌లో ‘పట్టాల కోసం ఏడాదిగా ఎదురుచూపు’ శీర్షికన వార్త ప్రచురితమైంది. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటిలో దళితబస్తీ పథకంలో భాగంగా ప్రభుత్వం 56 కుటుంబాలకు 167 ఎకరాల భూమిని ఉచితంగా పంపిణీ చేసింది. రెవెన్యూ అధికారులు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడంతో తీవ్రజాప్యం చేశారు. దీంతో లబ్ధిదారులు సర్కారు పథకాలు పొందలేకపోయారు. ధర్మగంటలో భాగంగా నమస్తే తెలంగాణలో ప్రచురించిన వార్తకు స్పందించిన అధికారులు 15 రోజుల్లో పట్టాలు అందించారు.
బాసర క్షేత్రాన అవినీతి జాతర
దక్షిణ భారతదేశంలోనే ఏకైక సరస్వతీ ఆలయం బాసరలో ఉంది. ఈ క్షేత్రానికి 2015లో అవినీతి మరక అంటుకుంది. సిబ్బంది నియామకాలు మొదలు.. డిప్యుటేషన్ల దాకా అక్రమాల పర్వం కొనసాగినట్లు తేలింది. అనుకూలమైన వారికి కీలక బాధ్యతలు అప్పగించి.. బోగస్‌ బిల్లులతో లక్షలాది రూపాయలు స్వాహా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. పుష్కరాలు ముగిసినా ఏఈవో, తాత్కాలికంగా తీసుకున్న సిబ్బందిని కొనసాగించడంపై తీవ్ర దుమారం రేపింది. ఈ ఆలయంపై వరుస కథనాలు నమస్తే తెలంగాణ జిల్లా టాబ్లాయిడ్‌లో రావడం కలకలం రేపింది. అధికారులు, ఉద్యోగుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఈ అంశానికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టారు.
త్రిషకు అండ..
నిర్మల్‌ జిల్లా పెంబి మండల కేంద్రానికి చెందిన అశోక్‌-అంజలి దంపతుల కూతురు త్రిష(15) దీర్ఘకాలిక క్లోమం వాపు వ్యాధితో బాధపడు తున్నది. వైద్యులకు సూచించగా రూ.5 లక్షలు ఖర్చవు తాయని తెలిపారు. కూలీ పని చేసుకుం టేనే నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్తాయి. ఇగ వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో బిడ్డను ఎలా బతికించుకోవాలని మదనపడుతున్నారు. వీరి తరఫున నమస్తే తెలంగాణ గొంతుకగా నిలిచింది. వీరి బాధను టాబ్లాయిడ్‌ మినీలో ప్రచురించింది. ఆపన్న హస్తం అందించడానికి చాలా మంది ముందుకొచ్చారు. దాదాపు రూ.2 లక్షలకుపైగా దాతలు విరాళంగా ఇచ్చారు.
జలపాతాలు వెలుగులోకి..
ఆదిలాబాద్‌ జిల్లా జలపాతాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా 14 జలపాతాలు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్‌ జిల్లాలో కుంటాల, కొర్టికల్‌, పొచ్చెర, గుండాయి, పారేఖాతి, పెద్దగుండాల, గాయత్రీ, కనకాయ, మైసమాల్‌.. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో గుండాల, చింతలమాదర, మిట్టె, బాబేఝరి.. నిర్మల్‌ జిల్లాలో వస్తవపూర్‌ జలపాతాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఈ జలపాతాల వద్దకు వర్షాకాలం ప్రారంభం నుంచి పర్యాటకుల సందడి మొదలవుతుంది. ఇందులో చాలా వరకు అరణ్యగర్భంలో, మారుమూల ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో చాలా జలపాతాలను నమస్తే వెలుగులోకి తెచ్చింది. ఫలితంగా పర్యాటకుల సందడి యేడాదికేడాది పెరుగుతున్నది. తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషిస్తున్నది.
ఆది నుంచీ జనం వెంటే..
గడిచిన పదేళ్లలో అడుగడుగునా జనం పక్షానే నిలుస్తున్నది. ఆకాంక్షను గట్టిగా వినిపిస్తూనే జిల్లావాసులెదుర్కొంటున్న వివిధ సమస్యలపై సమరశంఖం పూరించింది. తెలంగాణ రాక ముందు సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరక్క, కరువు పరిహారం అందక, మద్దతు ధర దక్కక, కష్టమొచ్చిన ప్రతిసారీ అన్నదాతకు అండగా నిలబడి, అధికారుల తీరును ఎండగట్టింది. కాంట్రాక్టర్ల నిర్వాకంతో జలయజ్ఞం, జలవిఘ్నంగా మారినప్పుడు.., ‘సింగరేణి’ పదఘట్టనల కింద అమాయకుల బతుకులు ఛిద్రమైనప్పుడు.., ‘హరిత’మంటూ పుట్టుకొచ్చిన ఫ్యాక్టరీలు, ప్రజలపై కాలుష్యపు విషం చిమ్మినప్పుడు.., అధికారుల నిర్లక్ష్యంతో వివిధ ప్రభుత్వ పథకాలు నీరుగారినప్పుడు.., విద్యాశాఖ తీరుతో విద్యార్థుల చదువులు అటకెక్కినప్పుడు.., ‘సంక్షేమం’ సం‘క్షామం’లా మారి జనం అల్లాడుతున్నప్పుడు.., మద్యం మాఫియా ‘మామూళ్ల’ మత్తులో ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖ తూగినప్పుడు.., రెవెన్యూ అధికారులు, సిబ్బందిలో అవినీతి పెచ్చుమీరినప్పుడు.., ‘రియల్‌’ భూదందాలకు పట్టపగ్గాల్లేకుండా పోయినప్పుడు.., చారిత్రక గుట్టలపై గునపం దింపేందుకు అక్రమార్కులు తెగించినప్పుడు.., రహదారులపై అక్రమాల పగుళ్లు తేలినప్పుడు.., వైద్యుల నిర్లక్ష్యంతో రోగుల ప్రాణాలు గాల్లో కలిసినప్పుడు.., కొందరు పోలీసులే వడ్డీల దందా చేస్తూ పీడిస్తున్నప్పుడు.. ఇలా సందర్భమేదైనా ప్రజల పక్షాన నమస్తే తెలంగాణ ‘కల’మెత్తి పోరాడింది. పేదలు, అసహాయులకు భరోసా ఇచ్చింది.
శాఖల్లో పనితీరుపై పాశుపతాస్త్రం..
వివిధ శాఖల పనితీరును ఎండగట్టింది. ముఖ్యంగా రెవెన్యూలో అధికారుల అక్రమాలను బయటపెట్టింది. ఇటు నిబంధనలకు నీళ్లొదిన ప్రైవేట్‌ దవాఖానల తీరును బహిర్గతం చేసింది. ఎన్నో దవాఖానల దోపిడీ తీరును వెలుగులోకి తెచ్చి, ఏకంగా దవాఖానలను సీజ్‌ చేసేలా చేసింది. ప్రభుత్వ వైద్యులే అయినా సేవలందించకుండా ప్రైవేట్‌, ల్యాబ్‌లు హాస్పిటళ్లు నడపడం వంటివి వెలుగులోకి తెచ్చి వేటు పడేలా చేసింది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యులు, సిబ్బంది పనితీరుపై కథనాలను ఇచ్చి, మెరుగైన వైద్య సేవలందేలా చూసింది. విద్యాశాఖలోని అక్రమాలను బహిర్గతం చేసింది. ఉపాధ్యాయుల సాధక బాధకాలను ఇవ్వడంతోపాటు దారితప్పిన పంతుళ్లు దారిన పడేలా చేసింది. సంఘాల వివాదాలను, నకిలీ బిల్లులు, నకిలీ సర్టిఫికెట్ల బాగోతాలను, బది‘లీలలు’, ఇతర దందాలను ఎన్నింటినో బయటికి తెచ్చింది.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత వారధి..
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా ‘నమస్తే తెలంగాణ’ కీలకపాత్ర పోషిస్తున్నది. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్నది. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడమే కాదు, పథకాలు పక్కాగా అమలయ్యేలా చూస్తున్నది. సర్కారు ఏ పథకం తెచ్చినా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ప్రచురిస్తున్నది. అనుమానాలను నివృత్తి చేయడంతోపాటు దరఖాస్తు ఎలా చేసుకోవాలో సూచిస్తున్నది. అలాగే పేదలకు చేరుతున్న పథకాల గురించి సమగ్రంగా ఇస్తున్నది. తెలంగాణ వరదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల గురించి సమగ్ర కథనాలను ఇచ్చి, నీటిని సద్వినియోగం చేసుకునేలా అర్థం చేయించింది. కరోనా నేపథ్యంలో అనవసర భయాలు, అపోహలు తొలగించేలా కథనాలను ఇచ్చింది. ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న సేవలు, ఏయే వైద్యశాలలో ఎలాంటి వసతులున్నాయి ఇలా పూర్తి సమాచారం ఇచ్చింది. అలాగే వైద్యుల సలహాలతోపాటు మానసిక నిపుణులు, కోలుకున్న పేషెంట్ల సూచనలు ఇస్తూ, మానసిక ధైర్యం పెంపొదేలా చేసింది. పేదలు, అభాగ్యులకు అండగా నిలుస్తున్నది.

వారి కష్టాలను, కన్నీళ్లను అక్షర రూపం చేసి, ఎందరికో సాయం అందేలా చేసింది. ఇవేగాక, ప్రతి రోజూ ప్రత్యేక శీర్షికలతో ఇంటిల్లిపాదినీ అలరిస్తున్నది. రోజువారీగా శీర్షికలతో వివిధ రంగాలు, వృత్తి జీవితాలు, వ్యక్తుల విజయగాథలు, చారిత్రక ప్రదేశాలు, వింతలు, విశేషాల గురించి సమగ్ర కథనాలు ఇచ్చింది. ముఖ్యంగా సీమాంధ్రుల వివక్ష కారణంగా పాఠ్యపుస్తకాలకెక్కని అసలు సిసలు జిల్లా చరిత్రను ‘చరిత్రకెక్కని చరిత్ర’ పేరుతో వెలుగులోకి తెచ్చింది. ప్రముఖ కళాకారుల గురించి వివరిస్తూనే, ఎంతో మంది కవులు, కళాకారులను పరిచయం చేసింది. ఇక ప్రతి ఆదివారం ‘సండే స్పెషల్‌’ పేరిట ప్రత్యేక కథనాలను ప్రచురించింది. నాటి సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు, పల్లె జీవనం జీవనశైలి, టెక్నాలజీ.. ఇలా ఎన్నింటినో ముందుంచుతున్నది. యథేచ్ఛగా కల్తీ విక్రయాల శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికారులు ఉక్కుపాదం మోపారు. సీసీఐ తీరును ఎండగట్టడంతో రైతులకు న్యాయం జరిగింది. కరోనా విజృంభణపై అలర్ట్‌ చేస్తూ కథనాలు ప్రచురిండంతో సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దిశ దిశలా నమస్తే

ట్రెండింగ్‌

Advertisement