నెన్నెల, డిసెంబర్ 1 : నెన్నెల మండలం నార్వాయిపేట గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన సైన్స్ టీచర్ జలంపల్లి శ్రీనివాస్ వినూత్న బోధన చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. యూనిఫాం వేసుకొని.. విద్యార్థుల్లో ఒకడిగా కలిసిపోయి సులభంగా అ ర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నాడు. పిల్లలను నేరుగా పొలాల వద్దకు తీసుకెళ్లి సాగుపై అవగాహన కల్పిస్తుంటాడు. మానవ శరీర భాగాలు, అవయవాలు తెలిసే లా టీ-షర్టులపై బొమ్మలను ముద్రింపజేసిన ఆయన, వాటి ద్వారా విద్యార్థులకు బోధన చేస్తున్నాడు.
నార్వాయిపేట పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉండగా, 80 మంది విద్యార్థులు ఉన్నారు. శ్రీనివాస్ ప్రతి విద్యార్థికి సైన్స్‌పై ఆసక్తి పెరిగేలా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాడు. ప్రాథమిక దశలోనే సైన్స్‌పై అవగాహన ఉండాలనే లక్ష్యంతో ఇటీవల సొంత ఖర్చులతో టీషర్టులపై మానవ శరీర ఆకృతులు ముద్రింపజేశాడు. శరీర అంతర్భాగంలో ఉన్న ప్రతి అవయయం ఎలా ఉంటుందో తెలిసేలా టీ షర్టులపై రంగు రంగుల బొమ్మలను వేయించాడు. ఒక్కో దానికి రూ. 300 వెచ్చించి, మొత్తం 10 రకాల టీ షర్టులను తయారు చేయించాడు. ఒక్కో తరగతికి ఒక్కో రకమైన టీ షర్టు వేసుకొని సైన్స్ బోధిస్తున్నాడు. శరీర అంతర్భాగంలో ఉన్న ప్రతి అవయవం ఎలా ఉంటుందో తెలిసేలా రంగు రంగులతో బొమ్మలను ముద్రింపజేశారు. శరరం ఎలా ఉంటుంది.. అందులో ఏ అవయవం ఎలా పని చేస్తుందో తెలిసేలా దృశ్య రూపకంగా వివరిస్తున్నాడు.
‘బడిమనదే.. బడిని మార్చే బాధ్యత మనదే’ అనే అంశంతో ముందుకెళ్తూ పాఠశాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశాడు శ్రీనివాస్. అనేక కార్యక్రమాలు చేపట్టి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఎస్సీఈఆర్టీ తెలంగాణ, ఎన్ఐఈపీఏ న్యూ ఢిల్లీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన రైస్అండ్ షైన్ ఇన్సైట్స్ ఆఫ్ న్యూ ఏజ్ స్కూల్ లీడర్స్అనే పుస్తకంలో శ్రీనివాస్ అందించిన సేవలపై ముద్రించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నాడు. పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులు పొందాడు.
ప్రతి విద్యార్థి ప్రతి అంశాన్ని సులభంగా నేర్చుకోవలనే దే నా తపన. ఏ అంశమైనా సరే బోధన సరళంగా ఉంటేనే పిల్లలు మక్కువ చూపుతారు. ప్రాథమిక దశ నుంచే వారికి సైన్స్‌పై అవగాహన అవసరం. మంచిర్యాలకు చెందిన నా స్నేహితుడు రాజు దగ్గర ప్రత్యేకంగా టీ షర్టులను తయారు చేయించాను. మానవ శరీరం- అవయవాల పనితీరు గురించి విద్యార్థులకు సులభంగా అర్థం కావాలనేదే నా ఉద్దేశం. ఈ విధానం పిల్లలకు నచ్చింది. – జలంపల్లి శ్రీనివాస్, ఉపాధ్యాయుడు