బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Jan 15, 2020 , 00:38:40

పోరుకు సై బరిలో 286 మంది

పోరుకు సై బరిలో 286 మంది

మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు మంగళవారం 96 మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా మూడ్రోజుల్లో 112 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో మునిపాలిటీ పరిధిలో 49 వార్డుల్లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు 286 బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులకు నాయకులు బీ ఫారాలు అందజేయగా వారు వాటిని రిటర్నింగ్‌ అధికారులకు అందించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు నేటి నుంచి తమ ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. 22న పోలింగ్‌, 25 కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం 3 గంటలకు ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసేనాటికి పరిశీలన అనంతరం 398 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. ఆదివారం నుంచి నామినేషన్ల విత్‌డ్రా ప్రారంభం కాగా మొదటి రోజు ఇద్దరు, రెండో రోజు 12 మంది, చివరి రోజు మంగళవారం 96 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో మూడ్రోజుల్లో నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్న వారి సంఖ్య 112 చేరుకుంది. మున్సిపల్‌ పరిధిలో 49 వార్డులు ఉండగా టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు అన్ని వార్డుల్లో, కాంగ్రెస్‌ 46 వార్డుల్లో పోటీ చేస్తున్నాయి. వీరితో పాటు ఎంఐఎం, సీపీఐ, సీపీఎం అభ్యర్థులు, ఇండిపెండెంట్‌లు బరిలో ఉన్నారు. నామినేషన్లు దాఖలు చేసే సమయానికి అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి ఎక్కువగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. ముందుగా నామినేషన్‌ వేసి తర్వాత బీ ఫారాల కోసం ప్రయత్నాలు చేశారు. వార్డుల్లో తమకున్న ప్రాధాన్యం, గతంలో స్థానికుల సమస్యల పరిష్కారంలో తాము చూపిన చొరవ లాంటి అంశాలను నాయకులకు వివరించే ప్రయత్నాలు చేశారు. రెండు పార్టీల నుంచి ఎక్కువ సంఖ్యలో ఆశావహులు ఉండడంతో నాయకులు ఆచితూచి వ్యవహరించారు. సర్వేలతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని బీ ఫారాలు అందేజేశారు.


నేటి నుంచి ప్రచారం

నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో 49 వార్డుల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు నేటి నుంచి తమ ప్రచారాన్ని చేపట్టనున్నారు. పలు వార్డుల్లో నామినేష్లను వేసి విత్‌డ్రా చేసుకున్న వారితో పాటు వారి అనుచరుల సహాయంతో ప్రచారం నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి అన్ని వార్డుల్లో నేడు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నట్లు నాయకుల తెలిపారు. అన్ని వార్డుల్లో జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి లోక భూమారెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్నతోపాటు స్థానిక నాయకులు, నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు పలు వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఇప్పటికే వార్డుల కమిటీలను ఏర్పాటు చేయగా వారు ప్రచారం బాధ్యతలతో పాటు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయనున్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి ప్రధాన నాయకులు సైతం వచ్చే అవకాశాలున్నాయని జిల్లా నేతలు తెలిపారు.


logo