e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home ఆదిలాబాద్ సూపర్‌ స్ప్రెడర్లకు టీకా

సూపర్‌ స్ప్రెడర్లకు టీకా

సూపర్‌ స్ప్రెడర్లకు టీకా

కరోనా కట్టడికి సర్కారు బహుముఖ వ్యూహం
నేటి నుంచి నిత్య సేవకులకు వ్యాక్సినేషన్‌
వివరాలు సేకరణ.. ఏర్పాట్లు పూర్తి..

ఆదిలాబాద్‌, మే 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొవిడ్‌ వ్యాప్తి ప్రధాన కారకులు(సూపర్‌ స్ప్రెడర్స్‌)గా భావిస్తున్న వారికి వ్యాక్సిన్‌ వేయాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు అధికార యంత్రాంగం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివరాలు సేకరించింది. ఆదిలాబాద్‌ జిల్లాలో 23,384, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 10 వేలు, మంచిర్యాల జిల్లాలో 2,595గా గుర్తించింది. వీరికి మూడ్రోజులపాటు(28,29,30 తేదీలు) వ్యాక్సిన్‌ వేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఉదయం 9-12 గంటలు, మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నది.

కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతున్నది. వ్యాప్తికి అవకాశాలున్న వారిని గుర్తించి టీకాలు వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పలు విభాగాల్లో పనిచేస్తున్న వారిని గుర్తించారు. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, రేషన్‌ డీలర్లు, జర్నలిస్టులు, గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌, విత్తనాలు, ఎరువుల, పురుగు మందులు దుకాణాదారులు, పెట్రోల్‌ బంకుల్లో పనిచేసే వారు, పండ్లు, కూరగాయలు, ఇతర చిరు వ్యాపారాలు, మద్యం దుకాణాల్లో పనిచేసే వారందరికీ వ్యాక్సిన్‌ వేయనున్నారు. వీరికి వ్యాక్సిన్‌ ఇవ్వడంతో వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చని వైద్యశాఖ అధికారులు అంటున్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల ఆధ్యర్యంలో సూపర్‌ స్ప్రెడర్లను అధికారులు గుర్తించారు. 23,384 మంది ఉన్నట్లు తేలగా.. వారికి నేటి నుంచి మూడ్రోజులపాటు వారికి సమీపంలో ఉన్న ప్రభుత్వ టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్‌ ఇస్తారు.

వివిధ శాఖల ఆధ్వర్యంలో సేకరణ..
ఆదిలాబాద్‌ జిల్లాలో 355 రేషన్‌ దుకాణాలు ఉండగా 1,88,486 కార్డులు ఉన్నాయి. డీలర్లు ప్రతి నెలా 1-15వ తేదీ వరకు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తారు. దుకాణాల డీలర్లు, వర్కర్లు 634 మంది, గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేసేవారు 910 మంది, పెట్రోల్‌ బంకుల్లో పనిచేసేవారు, నిర్వాహకుల వివరాలను పౌర సరఫరాలశాఖ అధికారులు సేకరించారు. 12 వేల మంది ఆటో, మోటార్‌ క్యాబ్‌ల డ్రైవర్లు ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. వీరితోపాటు కూరగాయలు, తోపుడు బండ్ల వ్యాపారులు, మాంసం విక్రయించేవారు, ఇతర చిరు వ్యాపారులు 8,500 మంది వరకు ఉండగా మున్సిపల్‌ సిబ్బంది వివరాలు కూడా సేకరించారు. మద్యం దుకాణాల్లో పనిచేసే వారు 200 మంది వరకు ఉంటారని అంచనా వేశారు. విత్తనాలు, ఎరువుల దుకాణాదారులు 1,140 మందిని గుర్తించారు.

ఈ కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌..
ఎంపిక చేసిన కేంద్రాల్లో ఉదయం 9-12 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సిన్‌ ఇస్తారు. జర్నలిస్టులు అక్రిడేషన్‌తోపాటు ఆధార్‌ కార్డులు, ఇతరులు వారి గుర్తింపుకార్డులు, ఆధార్‌కార్డులు తీసుకుని వెళ్లాలి. జిల్లాలోని ఆదిలాబాద్‌ అర్బన్‌ మండలానికి చెందిన వారు హమాలీవాడ యూపీహెచ్‌సీలో.. ఆదిలాబాద్‌ రూరల్‌, మావల మండలాలకు చెందినవారు శాంతినగర్‌ యూపీహెచ్‌సీలో.. బజర్‌హత్నూర్‌, ఇచ్చోడ, నేరడిగొండ, సిరికొండ మండలాలకు చెందిన వారు ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో.. బేల, జైనథ్‌ మండలలాకు చెందిన వారిరు జైనథ్‌ పీహెచ్‌సీలో.. భీంపూర్‌, తాంసి, తలమడగు మండలాలకు చెందిన వారికి తాంసి పీహెచ్‌సీలో.. బోథ్‌ మండలం వారికి బోథ్‌ సీహెచ్‌సీలో, గుడిహత్నూర్‌ వారికి స్థానిక పీహెచ్‌సీలో.. గాడిగూడ, నార్నూర్‌ మండలాలకు చెందిన వారికి నార్నూర్‌ పీహెచ్‌సీలో.. ఇంద్రవెల్లి మండలానికి చెందిన వారికి ఇంద్రవెల్లిలో.. ఉట్నూర్‌ మండలానికి చెందిన వారికి ఉట్నూర్‌ సర్కారు దవాఖానలో వ్యాక్సిన్‌ ఇస్తారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సూపర్‌ స్ప్రెడర్లకు టీకా

ట్రెండింగ్‌

Advertisement