e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home ఆదిలాబాద్ ఎరువుల గుట్టలు

ఎరువుల గుట్టలు

ఎరువుల గుట్టలు

ప్రాథమిక సహకార సంఘాలకు సరఫరా
కొరత లేకుండా అధికారుల ముందస్తు చర్యలు
అందుబాటులో 12,496 టన్నులు
త్వరలో అమ్మకాలు ప్రారంభం
డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు

ఆదిలాబాద్‌, మే 26 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాడు.. సమైక్య పాలనలో విత్తనాలు, ఎరువులు కావాలంటే రోడ్డెక్కాల్సిన దుస్థితి. ఎండలో మాడుతూ.. చలిలో వణుకుతూ రైతన్న జాగారం చేయాల్సి వచ్చేది. చాంతాడంత చెప్పులు, పాస్‌పుస్తకాల క్యూలు దర్శనమిచ్చేవి.నేడు.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో సీజన్‌కు ముందే ఎరువులు గోదాముల్లో నిల్వ చేస్తుండగా.. గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. అన్నదాతలు ఇలా వచ్చి అలా ఆధార్‌, పాస్‌పుస్తకం చూపించి ఎరువులు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లాలో 12,496 టన్నుల డీఏపీ, యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. త్వరలో అమ్మకాలు ప్రారంభించనుండగా.. డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్‌లో రైతులు 5.70 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందుకు గానూ సీజన్‌కు 94 వేల టన్నుల ఎరువులు అవసరమవుతాయి. వీటిల్లో ఎక్కువగా యూరియా 34 వేల టన్నులు, డీఏపీ 13 వేల టన్నులు, ఎంవోపీ 7 వేల టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 36 వేల టన్నులు, ఎస్‌ఎస్‌పీ 4 వేల టన్నులను రైతులు ఈ సీజన్‌లో పంటల సాగుకు వినియోగించే అవకాశాలున్నాయి. సీజన్‌లో ఎరువుల కొరత రాకుండా అధికారులు పకడ్బందీ ప్రణాళికలు తయారు చేశారు. పంటల సాగుకు అవసరమైన ఎరువులను తీసుకువచ్చి గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారు. ఏటా వానకాలం సీజన్‌ పంటలకు గానూ ప్రైవేట్‌ డీలర్లు ఏప్రిల్‌ నెల నుంచి ఎరువుల విక్రయాలు ప్రారంభిస్తారు. ఈ ఏడాది సైతం ప్రైవేట్‌ దుకాణాల్లో యజమానులకు ఎరువులను విక్రయిస్తున్నారు. ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మార్క్‌ఫెడ్‌, వ్యవసాయశాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తూ స్టాక్‌ వివరాలు, అమ్మకాలు, రైతుల వివరాలను పరిశీలిస్తున్నారు. ఎరువుల అమ్మకాల్లో డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు.

మార్క్‌ఫెడ్‌ గోదాముల్లో నిల్వలు
రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా అధికారులు గ్రామాల్లోనే పీఏసీఎస్‌లు, రైతు ఆగ్రో సేవా కేంద్రాల ద్వారా అమ్మకాలను జరుపుతున్నారు. జిల్లాలోని 42 ప్రాథమిక సహకార సంఘాలు, రైతు ఆగ్రో సేవా కేంద్రాల్లో ఎరువులను నిల్వచేశారు. ఏప్రిల్‌ 1 నుంచి బుధవారం వరకు 823 టన్నుల డీఏపీ, 762 టన్నుల ఎన్‌పీకే, 2833 టన్నుల యూరియాలను మార్క్‌ఫెడ్‌ అధికారులు ప్రాథమిక సహకార సంఘాలు, రైతు ఆగ్రో సేవ కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌ గోదాముల్లో 12,496 టన్నులు ఎరువుల నిల్వలు ఉన్నాయి. 9853 టన్నుల డీఏపీ, 791 టన్నుల యూరియా, 1850 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. గోదాముల్లో ఉన్న నిల్వలను గ్రామాల్లో విక్రయ కేంద్రాలకు తరలిస్తే రైళ్ల ద్వారా వచ్చే ఎరువులను నిల్వ చేసుకునేందుకు ఇబ్బందులు ఉండవు. ఇప్పటికే పీఏసీఎస్‌లు, ఏఆర్‌ఎస్‌కేలకు ఎరువులను చేరవేశామని రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మార్క్‌ఫెడ్‌ అధికారులు తెలిపారు. విక్రయాలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని ఇందుకోసం పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మిషన్‌ను ఉపయోగిస్తున్నట్లు అధికారు లు తెలిపారు. గ్రామాల్లో రైతులు ఆధార్‌కార్డు, పట్టా పాసు పుస్తకం తీసుకుని వచ్చి ఎరువులు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎరువుల గుట్టలు

ట్రెండింగ్‌

Advertisement