e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home ఆదిలాబాద్ ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ల జోరు

ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ల జోరు

రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన విద్య
యేటా అత్యుత్తమ ఫలితాలు.. పెరుగుతున్న అడ్మిషన్లు
తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రుల ఆసక్తి
ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9931 మంది చేరిక
ఈ నెలాఖరు వరకూ గడువు n అడ్మిషన్లు పెరిగే అవకాశం

ఆదిలాబాద్‌ రూరల్‌, జూలై 24 : సర్కారు ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తూ నిష్ణాతులైన అధ్యాపకులతో మెరుగైన విద్యనందిస్తున్నది. యేటా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుండగా, అన్ని వర్గాల విద్యార్థులు సైతం వాటిలో చేరేందుకు ఆసక్తి చూపు తున్నారు. ఉచితంగా చదువుకునే అవకాశం ఉండ డంతో స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగు తుండగా, ఇప్పటికే 9,931 మంది చేరారు. ఈ నెలాఖరు వరకు గడువు ఉండగా, అన్ని చోట్లా అడ్మిష న్లు మరిన్ని పెరిగే అవకాశాలున్నాయని ఇంటర్‌ అధికారులు చెబుతున్నారు.
గతంతో పోల్చితే ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు భారీగా జరుగుతున్నాయి. కరోనా ప్రభావంతో కళాశాలలు తెరుచుకోనప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తుండడంతో మొగ్గు చూపుతున్నారు.

జిల్లాల వారీగా సీట్లు భర్తీ..
ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 13 మండల కేంద్రాల్లో జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్‌ పట్టణంలో బాలురు, బాలికలు, ఉట్నూర్‌, నార్నూర్‌, నేరడిగొండ, బజార్‌హత్నూర్‌, బోథ్‌, గుడిహత్నూర్‌, ఇచ్చోడ, తాంసి, తలమడుగు, బేలా, ఇంద్రవెల్లిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి. కొన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో తెలుగుతో పాటు ఆంగ్లం, ఉర్దూ, మరాఠీల్లోనూ ఇంటర్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. మొత్తం 13 కళాశాలల్లో ఈ ఏడాది 3300 సీట్లు అందుబాటులో ఉండగా, ఇప్పటి వరకు 3018 సీట్లు భర్తీ అయ్యాయి. నిర్మల్‌ జిల్లాలో 12 కళాశాలలు ఉండగా, 3400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 2350 సీట్లు భర్తీ అయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 10 కళాశాలలు ఉండగా, 4 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 2290 సీట్లు భర్తీ అయ్యాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 3000 సీట్లకుగాను 2273 భర్తీ అయ్యాయి. అడ్మిషన్ల గడువు ఈనెల 31 వరకు ఉండడంతో దాదాపు అన్ని చోట్ల 100 శాతం సీట్లు భర్తీ అవుతాయని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య..
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో రూపాయి ఖర్చులేకుండా నాణ్యమైన విద్య అందుతుండడంతో విద్యార్థులు వాటిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు పరీక్ష ఫీజు కూడా భరిస్తున్నది. ప్రభుత్వ కళాశాలల్లో ఎప్పటికప్పుడు ప్రిన్సిపాళ్లు, లెక్చరర్ల ఖాళీలను భర్తీ చేస్తున్నది. కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు కూడా భారీగా వేతనాలు పెంచడం వల్ల వారు విద్యార్థులకు మెరుగైన విద్యనందించి మంచి ఫలితాలు రాబట్టేందుకు కష్ట పడుతున్నారు. పరీక్షలకంటే మూడు నెలల ముందు నుంచే విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారు మంచి మార్కులు తెచ్చుకునేలా కృషి చేస్తున్నారు. కొన్ని చోట్ల అధ్యాపకులు ఇంటికి వెళ్లి విద్యార్థులకు సంబంధించిన ప్రగతిని తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇంటర్‌ విద్యార్థులకు వాట్సప్‌గ్రూపులను ఏర్పాటు చేసి వారికి ఆన్‌లైన్‌ తరగతులపై సమాచారం అందిస్తున్నారు. విద్యార్థులకు సబ్జెక్టుల్లో ఏమైనా అనుమానాలుంటే వాట్సాప్‌ గ్రూపుల ద్వారా వారి అనుమానాలను నివృత్తి చేస్తున్నారు.

సకల సౌకర్యాలు..
తెలంగాణ ఏర్పడి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కొత్త భవనాలు నిర్మించి.. కార్పొరేట్‌కు దీటుగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. సైన్స్‌ల్యాబ్‌లను ఆధునీకరిస్తున్నది. యేటా విద్యార్థుల ప్రయోగాలకు అవసరమైన మెటీరియల్‌ను సరఫరా చేస్తున్నది. విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అందించి, వారు వాటిల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నది. ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులు దేశానికి, సమాజానికి ఉపయోగపడే అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలను ఏర్పాటు చేసింది.

మెరుగైన విద్యనందిస్తున్నాం
ఆదిలాబాద్‌ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తుంది. కళాశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తుంది. విద్యార్థులకు సకాలంలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తున్నాం. ప్రతి రోజూ ప్రత్యేక తరగతుల నిర్వహణతో ప్రైవేట్‌ కళాశాలలకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 3018 సీట్లు భర్తీ అయ్యాయి.

  • సీ రవీంద్ర కుమార్‌, డీఐఈవో ఆదిలాబాద్‌

అన్ని సౌకర్యాలున్నాయని..
నేను పదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. ఇప్పుడు ఆదిలాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌(ఎంపీసీ ఇంగ్లిష్‌ మీడియం)లో చేరాను. ఇక్కడ వాతావరణం బాగుంది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అధ్యాపకులు కూడా పూర్తిస్థాయిలో ఉన్నారు. అందుకే ఈ కళాశాలలో చేరాలను నిర్ణయించుకున్నా.

  • ధనుష్‌, ఆదిలాబాద్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana