e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home ఆదిలాబాద్ మేమున్నాం

మేమున్నాం

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రంగంలోకి అధికారులు, ప్రజాప్రతినిధులు
అనుక్షణం.. అప్రమత్తంగా ఎన్డీఆర్‌ఎఫ్‌ టీం
నిర్మల్‌లో స్వయంగా పర్యవేక్షించిన మంత్రి అల్లోల
ఐజీ నాగిరెడ్డి, జిల్లా ఉన్నతాధికారుల పర్యటన
క్షేత్రస్థాయిలో రంగంలోకి ప్రజాప్రతినిధులు, అధికారులు
సురక్షిత ప్రాంతాలకు బాధితుల తరలింపు
పరీవాహక ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన
ఆయా చోట్ల పరిశీలించిన ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్‌ రెడ్డి

ఆదిలాబాద్‌ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ నిర్మల్‌ అర్బన్‌, జూలై 23:ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగాయి, చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. ప్రాజెక్టుల గేట్లు తెరవడంతో పలు గ్రామాల్లోకి వరద పోటెత్తింది. దీంతో ముంపు ప్రభావ ప్రజలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు రంగంలోకి దిగారు. నిర్మల్‌ పట్టణంలోని జీఎన్‌ఆర్‌ కాలనీ వరదలో చిక్కుకోగా, ఎన్డీఆర్‌ఎఫ్‌ టీం, ఇతర అధికా రులతో కలిసి, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. అనుక్షణం అధికారులను అప్రమత్తం చేస్తూనే, ఆందోళన వద్దు.. అండగా ఉంటామని బాధితులకు భరోసానిచ్చారు. శుక్రవారం, నిర్మల్‌ పట్టణంతో పాటు సోన్‌, సారంగాపూర్‌ మండలాల్లో ఆయన పర్యటించారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్‌రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించారు. వరద ఉధృతితో పాటు నదుల పరీవాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్‌ చేశారు. –

అమాత్యుడి పర్యవేక్షణ
నిర్మల్‌ జిల్లా చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా వర్ష బీభత్సం సృష్టించింది. నిర్మల్‌ పట్టణంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లా ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. పలు కాలనీల్లో ఇండ్లలోకి నీరు చేరడంతో, సామగ్రంతా తడిసి పోయింది. స్వర్ణ ప్రాజెక్ట్‌ గేట్లు తెరవడంతో సిద్ధాపూర్‌ సమీపంలోని జీఎన్‌ఆర్‌ కాలనీలోకి వరద పెద్ద ఎత్తున చేరింది. తక్షణమే స్పందించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజలను రక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. వెంటనే గజ ఈతగాళ్లను రప్పించడంతో పాటు స్థానికులు, పోలీసుల సహకారంతో బాధితులను సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ఉన్నతాధికారులతో మాట్లాడి అత్యవసరమైన ఏర్పాట్లు అప్పటికప్పుడు చేశారు. వృద్ధులు, బాలింతలు, గర్భిణులను నాటు పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గురువారం ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. నిర్మల్‌ పట్టణంతో పాటు సారంగాపూర్‌లో శుక్రవారం వరద పరిస్థితిని మంత్రి ఐకేరెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. పట్టణంలోని జీఎన్‌ఆర్‌ కాలనీలో ఐజీ నాగిరెడ్డితో కలిసి తిరుగుతూ పరిస్థితిపై ఆరా తీశారు. నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

- Advertisement -

నిర్మల్‌పై ప్రభావం..
నిర్మల్‌ పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీ, రాంనగర్‌, ఆదర్శనగర్‌, మంచిర్యాల చౌరస్తా రోడ్డు, జీఎన్‌ఆర్‌ కాలనీలపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. మంచిర్యాల చౌరస్తాలో గట్టు తెగిపోయి ఇంటి ముందు ఉన్న కారు ఆ గుంతలో పడిపోయిం ది. నిర్మల్‌ మండల పరిధిలో స్వర్ణ వాగు ఉప్పొంగడంతో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. ఆయా చోట్ల పంట పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. నిర్మల్‌ మండలంలోని రాణాపూర్‌ గ్రామానికి చెందిన ఆడె గణేశ్‌ (30) మంజులాపూర్‌ గ్రామం వద్ద జాతీయ రహదారిపై వరదలో చేపలు పట్టేందుకు తన స్నేహితులతో కలిసి వెళ్లి, కాలువ గుంతలో పడి కొట్టుకుపోయాడు. పోలీసు లు, కుటుంబసభ్యులు వరదలో వెతుకగా.. కొద్దిదూరంలో గణేశ్‌ మృతదేహం లభించింది. ముథోల్‌ నియోజకవర్గ పరిధిలో రంగారావ్‌ పల్సికర్‌ బ్యాక్‌ వాటర్‌ తో ముంపునకు గురైన గుండెగాం గ్రామస్తులకు భైంసా పట్టణంలోని ఎస్సీ వసతి గృహంలో అధికారులు తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. 89 కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సదుపాయం కల్పిస్తున్నారు. గుండెగాం గ్రామ స్తులకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో..
ఆదిలాబాద్‌ పట్టణంలోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పర్యటించి, ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పలు మండలాల పరిధిలో పెనగంగ ఉధృతంగా ప్రవహిస్తున్నది. పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జైనథ్‌ మండలంలోని సాత్నాల ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి 6వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయినీటి మట్టం 286.50మీటర్లకు గాను ప్రస్తుతం 285.50 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులోకి 2900 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. బోథ్‌ మండలంలోని ధన్నూర్‌ (బీ), అందూర్‌, మందబొగుడ, ఖండిపల్లె, పెద్దవాగు, పొచ్చెర, నక్కలవాడ, మర్లపెల్లి, కన్గుట్ట, సాంగ్వి వాగుల కింద పంట పొలాలు నీట మునిగాయి. బోథ్‌ మండలంలోని నక్కలవాడ, ధన్నూర్‌ (బీ) ముంపు ప్రాంతాలతో పాటు పొచ్చెర జలపాతం, కరత్వాడ ప్రాజెక్టును ఇన్‌చార్జి ఎస్పీ రాజేశ్‌ చంద్ర సందర్శించారు. నక్కలవాడ వాగు వంతెనపై నుంచి ప్రవహిస్తుండడంతో నాలుగు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించి వెంటనే రోప్‌ (తాడు) కట్టించారు. వాగు దాటుకుంటూ వెళ్లి గిరిజనులతో మాట్లాడారు. నేరడిగొండ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ పర్యటించి, ప్రజలను అప్రమత్తం చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana