శనివారం 06 మార్చి 2021
Adilabad - Jan 27, 2021 , 01:17:24

బాధ్యత పెరిగింది..

బాధ్యత పెరిగింది..

  • గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం గర్వంగా ఫీలవుతున్నా..
  • సేవలు అందించాలని ప్రధానమంత్రి మోదీ సూచించారు..
  • ‘నమస్తే’తో ఢిల్లీ రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొన్న కాత్లే మారుతి

“ఢిల్లీలోని ఎర్రకోటలో మంగళవారం జరిగిన రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొనడం గర్వంగా ఫీలవుతున్నా. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలువడం, ఆయనతో మాట్లాడడం జీవితంలో మరచిపోలేను. మా ఊరోళ్ల సహకారంతోనే ఈ అరుదైన గుర్తింపు దక్కింది. ఇదే స్ఫూర్తితో గిరిజనులకు విద్య, వైద్యం, క్రీడలు, ఉపాధిపై సేవలు అందిస్తా” అని ఆదిలాబాద్‌ జిల్లా చించూఘాట్‌కు చెందిన గిరిజన యువకుడు మారుతి ‘నమస్తే’కు తెలిపాడు.    

ఆదిలాబాద్‌, జనవరి 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పదకొండేళ్లుగా గిరిజనులకు విద్య, వైద్యం, క్రీడలు, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించా. వ్యక్తిగతంగా, ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందిస్తున్నా. నా సేవలను గుర్తించిన కేంద్ర సర్కారు 72వ గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం కావడం, రాఫెల్‌ యుద్ధ విమానాలను చూడడం ఆనందంగా ఉంది” అని ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం చించూఘాట్‌కు చెందిన గిరిజన యువకుడు కాత్లే మారుతి పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ‘నమస్తే’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

నమస్తే తెలంగాణ : దేశ రాజధానిలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం ఎలా అనిపించింది?

కాత్లే మారుతి : ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడం గర్వంగా భావిస్తున్నా. ఈ వేడుకలకు 18 రాష్ర్టాల నుంచి గిరిజన ప్రతినిధులు హాజరయ్యారు. వారి రాష్ర్టాల్లో జరుగుతున్న గిరిజనాభివృద్ధి, ఇతర విషయాలపై చర్చించా. 23న ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. మారుమూల గిరిజన గ్రామానికి చెందిన నేను ప్రధానిని కలువడం, ఫొటోలు దిగుతానని ఊహించలేదు. రాఫెల్‌ యుద్ధ విమానాన్ని చూడడం ఎన్నటికీ మరిచిపోలేను.

నమస్తే : గిరిజనులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు?

మారుతి : నేను పదకొండేళ్లుగా ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజనులకు సేవలు అందిస్తున్నా. గిరిజనులకు విద్య, వైద్యం, క్రీడలు, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడమే కాకుండా వారికి వ్యక్తిగతంగా, ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందిస్తున్నా. గిరిజన పిల్లల కోసం చించూఘాట్‌లో తెలంగాణలోనే మొదటి ఇంగ్లిషు మీడియం పాఠశాలను ఏర్పాటు చేశా. క్రీడల్లో ప్రతిభ ఉన్న వారిని గుర్తించి, వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నా. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందేలా చూస్తున్నా.

నమస్తే : మీరు అందిస్తున్న సేవలకు ఎవరి ప్రోత్సాహం ఉంది?

మారుతి : నేను ఎంఏ(సోషియాలజీ), బీపీఈడ్‌ చేశా. వ్యవసాయం చేసుకుంటూ ఆటో నడుపుతూ ఉపాధి పొందుతున్నా. నాకు చిన్నప్పటి నుంచి సమాజ సేవ చేయాలనే ఆసక్తి ఉంది. నేను చేస్తున్న సేవలకు మా గ్రామస్తుల ప్రోత్సాహం చాలా ఉంది. వారి అండదండలతోనే సామాజిక కార్యక్రమా లు నిర్వహిస్తున్నా. స్నేహితులందరం కలిసి అవసరమైన వా రికి రక్తదానం చేస్తా. నేను ఇప్పటికీ 13 సార్లు రక్తదానం చేశా.

నమస్తే : మీకు లభించిన గుర్తింపుపై స్పందన ఏమిటి?

మారుతి : ప్రతి ఒక్కరూ సమాజ సేవను అలవర్చుకోవాలి. ఆపదలో ఉన్నవారికి తోచిన సాయం చేస్తే వారిని ఆదుకున్న వాళ్లం అవుతాం. ఇన్నాళ్లుగా నేను చేసిన సేవకు లభించిన గుర్తింపు నాలో బాధ్యతను పెంచింది. ఇదే స్ఫూర్తితో గిరిజనులకు మరిన్ని సేవలు అందిస్తా. 

VIDEOS

logo