టీకాస్త్రం

- ఇక కరోనా ఖతం
- వ్యాక్సినేషన్ సక్సెస్
- తొలి రోజు ఉమ్మడి జిల్లాలోని 11 కేంద్రాల్లో 330 మంది ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకా
- 28 రోజుల తర్వాత రెండో డోస్.. అప్పటి నుంచే ఇమ్యూనిటీ పెరుగుదల..
- నిర్మల్‌లో ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
- పలు కేంద్రాల్లో పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
- నిర్భయంగా వేసుకోవచ్చు.. సైడ్ ఎఫెక్ట్ లేవు.. : వైద్యాధికారులు
ఆదిలాబాద్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి), జనవరి 16 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శనివారం చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ సక్సెస్ అయింది. వ్యాక్సిన్‌ను వేసేం దుకు అధికారులు వారం రోజులుగా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న డ్రైరన్ కూడా నిర్వ హించారు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు వచ్చిన టీకాను పోలీస్ బందోబస్తు మధ్య జిల్లా వైద్యా ధికారి కార్యాలయాల్లో భద్రపర్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 11 కేంద్రాల్లో 330 మంది వై ద్య సిబ్బందికి టీకాలు వేశారు. ప్రతి సెంటర్లో 30 మందికి ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేం ద్రంలోని రిమ్స్‌లో 30, ఉట్నూర్ కమ్యూనిటీ ఆస్పత్రిలో 30, ఆదిలాబాద్ శాంతినగర్ అర్బన్ హె ల్త్ సెంటర్లో 30 మందికి.. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏరియా దవాఖానలో 30, భైంసా దవాఖానలో 30, రాంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో 30, నస్పూర్ పీహెచ్సీలో 30.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్రం లోని ప్రభుత్వాసుపత్రిలో 30, కాగజ్‌నగర్ దవాఖానలో 30, సర్‌సిల్క్ కాలనీ ఆస్పత్రిలో 30 మందికి టీకా వేయగా ఈ కార్యక్రమాన్ని అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశారు.
అధికారులు పర్యవేక్షణ
టీకా కార్యక్రమాన్ని కలెక్టర్, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్యశాఖ అధికారులు పర్యవేక్షించారు. వ్యాక్సిన్ సమయంలో ఏమైనా ఇబ్బందులు వస్తే పరిష్కరించడానికి ఏర్పాట్లు చేశారు. కేంద్రాల్లో అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచడంతోపాటు డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో జిల్లాస్థాయి అధికారి ఇన్చార్జిగా వ్యవహరించగా, వ్యాక్సినేటర్తోపాటు నలుగురు వ్యాక్సిన్ అధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మూడు కేంద్రాల్లో ప్రతి కేంద్రంలో ఆరుగురు చొప్పున 18, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడు కేంద్రాల్లో 18, నిర్మల్ జిల్లాలో మూడు కేంద్రాల్లో 18, మంచిర్యాల జిల్లాలో రెండు కేంద్రాల్లో 12 మంది వ్యాక్సిన్ విధులు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందిని అభినందించారు.
టీకా విధానం..
- ఆదిలాబాద్ జిల్లాలో కరోనా పంపిణీకి సంబంధించి ఆదిలాబాద్ శాంతినగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ‘నమస్తే తెలంగాణ’ సందర్శించింది. టీకా వేసే విధానాన్ని పరిశీలించింది.
- శనివారం ఉదయం 10 గంటలకు టీకా తీసుకునే ఆరోగ్య సిబ్బంది వెయిటింగ్ గదికి వచ్చారు.
- ఉదయం 10:15 గంటలకు అదనపు కలెక్టర్ సంధ్యారాణి టీకా కార్యక్రమాన్ని పరిశీలించేందుకు పీహెచ్‌సీకి వచ్చారు.
- వ్యాక్సినేషన్ ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగం వినేందుకు వెయిటింగ్ హాల్లో టీవీ ఏర్పాటు చేశారు.
- 10:30 గంటలకు ప్రధాని ప్రసంగం ప్రారంభం కాగా.. 11.05 గంటల వరకు కొనసాగింది.
- ప్రధాని రిమోట్ ద్వారా టీకాను ప్రారంభించగా.. పీహెచ్సీలో అధికారులు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయడం ప్రారంభించారు.
- 11:07 గంటలకు వ్యాక్సిన్ గదిలో సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.
- వ్యాక్సినేటర్ వాయిల్ నుంచి 0.5 ఎంఎల్ మందును తీసి శాంతినగర్ పీహెచ్సీ వైద్యుడు కిరణ్‌కుమార్‌కు మొదటి టీకా వేశారు.
- 11:12 నిమిషాలకు వ్యాక్సిన్ తీసుకున్న డాక్టర్ గది నుంచి బయటకు రాగానే చేతికి ఇంకు గుర్తు పెట్టారు.
- బయటకు వచ్చిన వైద్యుడు కిరణ్‌కుమార్ అబ్జర్వేషన్లో గదిలో కూర్చున్నాడు.
- 11:15 నిమిషాలకు ఆశ కార్యకర్త పద్మా టీకా తీసుకుని అబ్జర్వేషన్ గదికి వచ్చారు.
- ప్రతి ఐదు నిమిషాలకు ఒక్కరి చొప్పున పీహెచ్సీ వైద్య సిబ్బంది కరోనా టీకా వేశారు.
- అబ్జర్వేషన్ రూంలో వ్యాక్సిన్ అధికారులు టీకా తీసుకున్న వారికి అవగాహన కల్పించారు.
- ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయని అడిగారు.
- 11:45 గంటలకు టీకా తీసుకున్న వైద్యుడు కిరణ్‌కుమార్ అబ్జర్వేషన్ గది నుంచి తన గదికి చేరుకుని విధులు నిర్వహించారు.
- 11:50 నిమిషాలకు ఆశ కార్యకర్త అబ్జర్వేషన్ గది నుంచి బయటకు వచ్చి తోటి సిబ్బందికి టీకా ఇప్పించడంతో సాయం చేశారు.
- పీహెచ్సీలో ఉదయం 11:09 ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మధ్యాహ్నం 1:10 గంటకు ముగిసింది.
- మొత్తం 30 మందికి టీకా వేశారు.
- టీకా వేసిన వారికి ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు రాలేదు.
మస్తు భయపడ్డ
మంచిర్యాల అర్బన్, జనవరి 16 : నేను బ్లడ్ బ్యాంకులో పనిచేస్తున్న. నాకు కరో నా పాజిటివ్ వచ్చింది. 60 ఏళ్లు దాటినోళ్లకు అంటుకుంటే కష్టమేనని చెబితే మస్తు భయపడ్డ. సార్లు మూతికి మాస్క్, చేతులకు గ్లౌజులిచ్చి పని చేసుకోమని చెప్పారు. అప్పటి నుంచి ధైర్యంగా ఉన్న. కరోనా సూది వేస్తరని చెప్పినప్పుడు చాలా భయపడ్డ. ఇది మంచిగ పని చేస్తదా! లేదా! అనిపించింది. లోపలికి వెళ్లిన తర్వాత డాక్టర్లు ఏం కాదని ధైర్యం చెప్పారు. సూది వేసిన తర్వాత అరగంట రూమ్‌లో ఉండమని చెప్పారు. జ్యూస్ ప్యాకెటిచ్చి తాగుమన్నరు. డాక్టర్లు, నర్సులు చూసి ఇగ ఏం కాదు ఇంటికి పో అని చెప్పారు.
- మిట్ట కౌసల్య, ఐఆర్సీఎస్ బ్లడ్ బ్యాంకు ఆయా, మంచిర్యాల
మొదటి టీకా నాకే..
మంచిర్యాల అర్బన్ : తొమ్మిది నెలల నుంచి కరోనా టీకా కోసం ఎదురు చూస్తున్నం.కరోనా వైరస్‌తో అనేక మంది దవాఖానకు వచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ సమయంలో ఎందరికో సేవ చేశాం. ప్రజలు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు టీకాను మొదలు మాకే ఇవ్వడం సంతోషంగా ఉంది. జిల్లాలో మొదటి టీకా నాకే వేశారు. టీకా వల్ల ఎలాంటి ఇబ్బంది కలుగలే. ఇప్పుడు ధైర్యంగా ఉంది.
- కాంపల్లి రవి కిరణ్, ఆరోగ్యశ్రీ విభాగం, మంచిర్యాల
ఐదు నిమిషాలకోసారి..
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ) : ఆసిఫాబాద్ ప్రభుత్వ దవాఖానలో మొదటి టీకా నాకే వేశారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాతే టీకా ఇచ్చారు. అక్కడే గంట ఉన్న. డాక్టర్లు ఐదు నిమిషాలకోసారి పరిశీలించారు. నేను ఇదే దవాఖానలో రోగుల వార్డులు, ఐసొలేషన్ వార్డులను శుభ్రం చేస్తా. ముందుగా నాకే కరోనా టీకా వేసినందుకు సంతోషంగా ఉంది.
- మురళి, పారిశుధ్య కార్మికుడు, ప్రభుత్వ దవాఖాన
కరోనా కనుమరుగుఅవుతుంది..
ఉట్నూర్: కరోనాతో ప్రపంచం అతలాకుతలం అయింది. ప్రతి ఒక్కరికీ నష్టాన్ని మిగిల్చింది. ఇలాంటి సమయంలో టీకాను రూపొందించి ప్రపంచానికి అందించడం చాలా సంతోషంగా ఉంది. ఈ వ్యాక్సిన్‌తో ప్రజల్లో ఉన్న కరోనా వైరస్ భయం తొలగిపోతుంది. కరోనా కూడా రానున్న రోజుల్లో కనుమరుగవుతుంది. ఆపత్కాలంలో వైద్యసిబ్బంది అందించిన సేవలకు గుర్తింపుగా వ్యాక్సినేషన్ మొదటగా మాకే ఇవ్వడం చాలా మంచి నిర్ణ యం. నాకైతే ఎంతో ఉత్సాహం అనిపిం చింది. మాములు టీకాల్లానే ఇది.
-దేవకుమారి(హెడ్‌నర్సు,ఉట్నూర్)
ఎవ్వరికీ ఏం కాలే..
మంచిర్యాల అర్బన్, జనవరి 16 : నేను ఆయాగా పనిచేస్త. నాకు కరోనా సూదిస్తరని చెప్పారు. ఇక్కడికి వచ్చేదాకా భయపడ్డ. అందర్ని చూసిన తర్వాత ధైర్యమొచ్చింది. మా సార్, మేడం కూడా ఉన్నరు. డాక్టర్లు వ్యాక్సిన్ ఇచ్చారు. నాకు ఏం కాలే. ఎట్లపోయానో.. మళ్లీ అట్లనే ఇంటికి వచ్చిన. అక్కడ ఉన్నంత సేపు డాక్టర్లు వచ్చి చూసిపోయారు. పది మందిమి ఆ రూంల ఉన్నాం. ఎవ్వరికీ ఏం కాలే.
- బోగె లక్ష్మి, ఐఆర్సీఎస్ బ్లడ్ బ్యాంకు ఆయా, మంచిర్యాల
డాక్టర్లు ధైర్యం చెప్పారు
కాగజ్‌నగర్ రూరల్ : నేను కాగజ్‌నగర్ పీహెచ్సీ పరిధిలోని ద్వారకానగర్ కాలనీలో ఆశ కార్యకర్తగా పని చేస్తున్న. లిస్టులో మొదటి పేరు నాదే ఉందని చెప్పారు. దవాఖానకు వచ్చేదాకా మస్తు భయమేసింది. డాక్టర్లు ధైర్యం చెప్పారు. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఏం కాలే. కాసేపు కుర్చీలో కూర్చున్న. ఆ తర్వాత ఇంటికి పోయాను.
- లక్ష్మి, ఆశ కార్యకర్త, పీహెచ్సీ, కాగజ్‌నగర్
లిస్టులో మొదటి పేరు నాదే..
కాగజ్‌నగర్ రూరల్ : నేను సర్‌సిల్క్ యూపీహెచ్‌సీలో పని చేస్తున్న. వ్యాక్సిన్ ఇచ్చే లిస్టులో మొదట నా పేరే ఉందని చెప్పడంతో ఉదయమే ఇక్కడికి వచ్చాను. సిబ్బంది మొదట థర్మల్ స్క్రీనింగ్ చేసి లోనికి పంపించారు. మొదటి టీకా నాకే వేశారు. అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకున్నా. ఆ తర్వాత ఇంటికి వచ్చిన. టీకా వేసే సమయంలో భయమేమీ అనిపించలేదు.
- స్వప్న, ఏఎన్ఎం, యూపీహెచ్సీ సర్‌సిల్క్, కాగజ్‌నగర్
మొదటి టీకా తీసుకోవడం నా అదృష్టం
నిర్మల్ అర్బన్ : నిర్మల్ జిల్లాలో మొదటి టీకా నేనే తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. కొవిడ్ వైరస్‌ను తరిమికొట్టేందుకు నిపుణులు ఇంత త్వరగా వ్యాక్సిన్‌ను కనుగొనడం శుభపరిణామం. చాలా సంతోషంగా ఉంది. టీకా వేసుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావని తెలిపేందుకు ముందుగా వైద్య సిబ్బందికి వేయాలని నిర్ణయించారని అనుకుంటున్నా. రానున్న రోజుల్లో అందరికీ ఈ వ్యాక్సిన్ వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 28 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారు. దానిని కూడా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నా. చిన్న చిన్న ప్రభావాలు అన్ని వ్యాక్సిన్లలో ఉంటాయి. కాని ప్రాణానికి హానీ మాత్రం జరగదు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా, ధైర్యంగా టీకా వేయించుకోవాలి.
-దేవేందర్ రెడ్డి, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్
వ్యాక్సిన్ రావడం శుభపరిణామం..
ఆదిలాబాద్ అర్బన్: కరోనా కారణంగా చాలా మందికి ఎంతో నష్టం జరిగింది. ఈ సమయంలో ఇంత త్వరగా వ్యాక్సిన్ రావడం శుభపరిణా మం. ఆదిలాబాద్ జిల్లాలో మొదటి వ్యాక్సిన్ నేనే వేసుకో వడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ ఎలాంటి సందేహాలకు పోకుండా ఈ టీకాను వేసుకో వచ్చు. ఉదయం 10.30 గంటలకే టీకా వేయించు కున్న, తర్వాత అరగంట పాటు పర్యవేక్షణలో ఉంచా రు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత నా పని నేను చేసుకుంటున్నా. జిల్లాలో వ్యాక్సిన్ వేయించుకున్న వారందరూ ఎలాంటి ఇబ్బందులకు గురికాలేదు.
-డాక్టర్ వైసీ శ్రీనివాస్, డీఎస్వో ఆదిలాబాద్
సంతోషంగా టీకా వేయించుకున్నా..
భైంసా : కరోనా వ్యాక్సిన్‌ను మొదట వైద్య సిబ్బందికి అందించడం బాగుంది. నేనైతే సంతోషంగా టీకా వేయించుకున్నా. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు, భయాలు వద్దు. కొవిడ్‌పై పోరుకు టీకానే మార్గం. టీకా రావడంతో కొంత ఇబ్బందులు తప్పనున్నాయి. ప్రజల్లో ఉన్న భయాందోళనను తొలగించేందుకే ప్రభుత్వం మొదటగా వైద్య సిబ్బందికి ఈ టీకా వేసింది. వ్యాక్సిన్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపదు. ఇంతకుముందు వ్యాక్సిన్లలాగే ఇది పనిచేస్తుంది. వైరస్ నియంత్రణలో ఇది విజయవంతమవుతుందని అనుకుంటున్న.
కాశీనాథ్, భైంసా ఏరియా దవాఖాన సూపరింటెండెంట్
వారియర్స్‌గా గుర్తింపు రావడం బాగుంది..
నిర్మల్ అర్బన్ : దాదాపు 10 నెలల పాటు కొవిడ్ రోగులకు రక్త పరీక్షలు నిర్వహించాం. భయం భయంగా విధులు నిర్వర్తించాం. మాకూ కుటుంబాలు ఉన్నాయి. కానీ సర్కారు మమ్మల్ని వారియర్స్‌గా గుర్తించడం చాలా సంతోషమనిపించింది. ఆరోగ్య సిబ్బందికి మొదటి దశలో టీకాను ఇవ్వడం శుభపరిణామం. ఇన్ని రోజులు విధులు నిర్వర్తించిన కష్టం దూరమైందనిపించింది. టీకా వేసుకున్నాక ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఆరోగ్య సిబ్బంది అందరూ టీకాను వేసుకోవాలి. అన్ని విధాల పరిశీలించాకే ఈ టీకాను పంపిణీ చేస్తున్నారు. మొదటి విడుత టీకా వేసుకున్నాను. అంతా బాగానే ఉంది. ఎలాంటి ప్రభావం, ఇబ్బంది కనిపించలేదు.
-టీ సంతోష్, ల్యాబ్ టెక్నీషియన్, నిర్మల్
ఎలాంటి భయం లేదు..
ఉట్నూర్: కరోనా వ్యాక్సిన్‌పై ఎలాంటి భయాలు అవసరం లేదు. టీకాతో మన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం లేదు. ప్రభుత్వం పూర్తిగా పరిశీలించాకే వ్యాక్సిన్‌ను అందజేసింది. వ్యాక్సినేషన్ పూర్తయ్యాక కూడా అరగంట వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. టీకాతో కరోనాను తరిమివేయవచ్చు. అందుకే మొదటగా వైద్యసిబ్బందికే వేస్తున్నారు. ముందుగా వైద్య సిబ్బంది టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం.
-మహేందర్, ఉట్నూర్ వైద్యుడు
ఎలాంటి సమస్యలు రాలేదు..
శాంతినగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో 30 మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేశాం. టీకా తీసుకున్న వారికి ఆరోగ్యపరమైన సమస్యలు రాలేదు. సిబ్బంది ఉత్సాహంగా వ్యాక్సిన్ వేసుకున్నారు. ముందు జాగ్రత్తల్లో భాగంగా సెంటర్లో వైద్యుడు, అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచాం. ఈ నెల 18న ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు మరోసారి టీకా వేస్తాం.
- సాధన, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్.
తాజావార్తలు
- మనకు కావాల్సింది నిమిషాల్లో తెచ్చిస్తారు
- మరణించీ.. మరొకరికి బతుకునిద్దాం
- అందుబాటులోకి కొవిన్ యాప్ కొత్త వర్షన్
- చిన్నారులను రక్షించిన కాచిగూడ పోలీసులు
- అరుదైన మండలి ఎన్నిక నిర్వహణ..! దినపత్రికంత బ్యాలెట్
- మొండి బకాయిలపై లోక్ అదాలత్
- వదలం..కదలం
- ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలి: మంత్రి సబితాఇంద్రారెడ్డి
- బీజేపీకి ఉద్యోగుల సమస్యలపై మాట్లాడే హక్కు లేదు
- గ్రేటర్లో టీఆర్ఎస్ ప్రచార భేరి