గురువారం 25 ఫిబ్రవరి 2021
Adilabad - Jan 16, 2021 , 01:39:47

నాగోబా వేడుకకు శ్రీకారం

నాగోబా వేడుకకు శ్రీకారం

  • కనిపించిన నెలవంక.. మెస్రం వంశీయుల పూజలు
  • జాతర ప్రచార రథం ప్రారంభం  
  • ఎడ్లబండి(రథం) వెళ్లే మార్గంపై చర్చ
  • సంప్రదాయబద్ధంగా పూజలు చేసి సాగనంపిన పెద్దలు
  • 21న గంగాజలం సేకరణ కోసం పాదయాత్ర

ఇంద్రవెల్లి, జనవరి 15 : ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌ నాగోబా జాతర నిర్వహణకు మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లాలోని మెస్రం వంశీయులు కెస్లాపూర్‌ గ్రామానికి చేరుకొని పురాతన నాగోబా దేవస్థానం(మురాడి)లో గురువారం రాత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాత్రి కనిపించిన నెలవంకకు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫిబ్రవరి 11న నాగోబాకు నిర్వహించే మహాపూజలతోపాటు జాతర నిర్వహణ, మహాపూజలకు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణ కోసం గ్రామాల్లో ప్రచారం నిర్వహించే ఎడ్లబండిని శుక్రవారం ప్రారంభించారు.

ఎడ్లబండిపై ప్రచారం సాగుతుందిలా..

కెస్లాపూర్‌ గ్రామం నుంచి ప్రారంభమైన ప్రచార ఎడ్లబండి ముందుగా సిరికొండ మండలానికి చేరుకుంటుంది. నాగోబా దేవత మహాపూజలకు ఉపయోగించే మట్టికుండల తయారీ కోసం కుమ్మరికి ఆదేశాలు ఇస్తారు. శుక్రవారం సాయంత్రం రాజంపేట్‌ గ్రామానికి చేరుకోగా, రాత్రి అక్కడే బసచేస్తారు. శనివారం(16న) గుడిహత్నూర్‌ మండలం సోయంగూడ, 17న ఇంద్రవెల్లి మండలం గిన్నేరా, 18న ఉట్నూర్‌ మండలం సాలేవాడ, 19న ఇంద్రవెల్లి మండలం వడగాం చేరుకుంటారు. 20న తిరిగి కెస్లాపూర్‌ గ్రామానికి చేరుకుంటారు. కెస్లాపూర్‌ లోని మెస్రం వంశీయుల పెద్దవాడైన మడావి ఇంటి వద్ద రాత్రి బసచేస్తారు. 21న గ్రామంలోని పురాతన నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పవిత్ర గంగాజలం సేకరించడానికి పాద యాత్రగా బయలుదేరి వెళ్లనున్నారు.

ప్రచార రథానికి ప్రత్యేక పూజలు

మెస్రం వంశీయుల మహాపూజలతో ఫిబ్రవరి 11న ప్రారంభం కానున్న కెస్లాపూర్‌ నాగోబా జాతరపై గ్రామాల్లో ముమ్మర ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రచార ఎడ్లబండి(ఛక్డా)ని మెస్రం వంశీయులు కెస్లాపూర్‌లోని పురాతన నాగోబా దేవస్థానం(మురాడి)లో శుక్రవారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. గురువారం రాత్రి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గ్రామాల నుంచి మెస్రం వంశీయులు కెస్లాపూర్‌కు చేరుకున్నారు. నాగోబా ఆలయంలో మెస్రం వంశీయులు సమావేశం నిర్వహించి, ప్రచారం నిర్వహించే ఎడ్లబండి మార్గంపై చర్చించారు. పురాతన నాగోబా ఆలయంలో మెస్రం వంశీయులు సంప్రదాయ ప్రత్యేక పూజలు చేసి, ప్రచార ఎడ్లబండిని ప్రారంభించారు. అనంతరం గ్రామ పొలిమేర వరకు ఎడ్లబండిని సంప్రదాయం ప్రకారం సాగనంపారు. పొలిమేరలో కటోడ హనుమంత్‌రావ్‌, పర్ధాంజీ తుకోడోజీలు సంప్రదాయ రీతిలో నేలపై తంబాకు, బీడీలు వేసి అక్కడి నుంచి నాగోబాను మొక్కుకున్నారు. అనంతరం వారు ప్రచార ఎడ్లబండిలో కటోడ హనుమంత్‌రావ్‌, పర్ధాంజీ తుకోడోజీలు కూర్చొని ప్రచారానికి బయల్దేరి వెళ్లారు. మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్‌పటేల్‌, మెస్రం వంశీయులు చిన్నుపటేల్‌, బాధిరావ్‌పటేల్‌, కోశరావ్‌, లింబారావ్‌, దేవ్‌రావ్‌, సోనేరావ్‌, నాగోరావ్‌, హనుమంత్‌రావ్‌, తుకోడోజీ, దాదారావ్‌, గణపతి, తిరుపతి, శేఖర్‌బాబు, నాగ్‌నాథ్‌, ఆనంద్‌రావ్‌, తుకారామ్‌, శేఖు, సీతారామ్‌, ధర్ము పాల్గొన్నారు.

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ పూజలు

కెస్లాపూర్‌ నాగోబా ఆలయంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ గురువారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీ యులతో పాటు ఆదివాసీ గిరిజన పెద్దల ఆధ్వ ర్యంలో ఆమెను శాలువాతో సన్మానించారు. అనం తరం ఆలయ ఆవరణలో గుస్సాడీ దండారీకి సం బంధించిన ఫొటో ఆల్బంను ఆవిష్క రించారు. ఆమె మాట్లాడుతూ ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీ గిరిజనులు నిర్వహించే గుస్సాడీ దండారీ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ఎస్పీ విష్ణు వారియర్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, సర్పంచ్‌ మెస్రం రేణుకానాగ్‌నాథ్‌, ఆదివాసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు సిడాం భీమ్‌ రావ్‌, కెస్లాపూర్‌ గ్రామపటేల్‌ మెస్రం వెంకట్‌రావ్‌, మెస్రం వంశీయులు దేవ్‌రావ్‌, సోనేరావ్‌, శేఖర్‌బాబు, తుకారామ్‌, ఆనంద్‌రావ్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo