బుధవారం 20 జనవరి 2021
Adilabad - Dec 03, 2020 , 00:08:40

గోల్డెన్‌ ఐడియా!

గోల్డెన్‌ ఐడియా!

  • స్కూల్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌లో బంగారుగూడ విద్యార్థుల ప్రతిభ
  • ఆర్గానిక్‌ చాక్‌పీస్‌లు తయారు చేసి,  జాతీయ స్థాయి ఎంపిక

 ఆదిలాబాద్‌ రూరల్‌ : పాఠశాలలు, కళాశాలల్లో.. ఉపాధ్యాయులు, అధ్యాపకులు చాలా వరకు బోర్డులపై చాక్‌పీస్‌లనే వాడుతుంటారు. వీటిని పెద్దమొత్తంలో జిప్సంతో తయారుచేస్తారు. వాటిని ఉపయోగించినప్పుడు వాటి కణాలు విద్యార్థులపై పడుతుంటాయి. తద్వారా శ్వాసనాళాల్లోకి వెళ్లి అనేక రకాల దుష్ప్రభావాలను చూపిస్తాయి. దీనిని గమనించిన బంగారుగూడ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు.. వినూత్నంగా ఆలోచించి ఆర్గానిక్‌ చాక్‌పీస్‌లను తయారు చేశారు. ఈ ప్రాజెక్టు జాతీయస్థాయికి సైతం ఎంపికైంది. 

ఆలోచన ఇలా..

కరోనా వైరస్‌ నేపథ్యంలో విద్యార్థులు ఇండ్లకే పరిమితమయ్యారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం.. విద్యాశాఖ, యూనిసెఫ్‌తో కలిసి స్కూల్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌ 2020ని ప్రారంభించింది. ఇందుకు ప్రతి పాఠశాల నుంచి ప్రాజెక్టులను పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. కాగా, బంగారుగూడ మోడల్‌ స్కూల్‌ 9వ తరగతి విద్యార్థులు హర్షిత్‌, రుద్రా.. సైన్స్‌ ఉపాధ్యాయుడు రామును సంప్రదించారు. తమకు వచ్చిన ఆలోచనను వివరించారు. తయారీకి అవసరమైన మెటీరియల్‌ను ఆయన సమకూర్చగా, విద్యార్థులు తయారు చేశారు.

తయారీ ఇలా..

వీటి తయారీ కోసం రోజ్‌వాటర్‌, జాస్మిన్‌ ఆకులు, తులసీ ఆకులు, దవణం ఆకులు, సం పెంగ నూనె, కొబ్బరి నూనె వైట్‌ సిమెంట్‌ను ఉపయోగించినట్లు విద్యార్థులు వివరించారు. ఇందు లో ఎల్లో కలర్‌ కోసం.. పసుపు, కొబ్బరి నూనె, రోజ్‌వాటర్‌.., గ్రీన్‌ కలర్‌ కోసం తులసి ఆకులు, దవనం ఆకులు, కొబ్బరి నూనె.., రెడ్‌ కలర్‌ కోసం కుంకుమ పువ్వు, బీట్‌ రూట్‌ జ్యూస్‌, కొబ్బరి నూ నెను ఉపయోగించామని పేర్కొన్నారు. కాగా, బ యట దొరికే డస్ట్‌ లెస్‌ చాక్‌పీస్‌కు 80 పైసలు, మా మూలు చాక్‌పీస్‌కు 60 పైసలు, వీటికి మాత్రం 20 పైసలు ఖర్చు అవుతుందని వెల్లడించారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక..

జిల్లా నుంచి 120 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లాయి. మొత్తంగా 6,700 ప్రాజెక్టులు పోటీపడ్డాయి. వాటిని 3 దశల్లో పరిశీలించారు. అత్యుత్తమమైన 25 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. ఇందులో జిల్లా నుంచి ఆర్గానిక్‌ చాక్‌పీస్‌ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైం.

విద్యార్థులకు అభినందనలు..

జాతీయస్థాయి పోటీలకు ఎంపికవడంపై విద్యార్థులు హర్షిత్‌, రుద్రాను ఆదిలాబాద్‌ డీఈవో రవీందర్‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గైడ్‌ టీచర్‌ రాము సహాయంతో ప్రిన్సిపాల్‌ సుధారాణి ప్రోత్సాహంతో విద్యార్థులు ప్రాజెక్టును తయారుచేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ప్రత్యేక అభినందనలు తెలిపారన్నారు. వీరిని మిగతా విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జిల్లాలో సైన్స్‌ కార్యక్రమాల అభివృద్ధికి కృషిచేస్తున్న సైన్స్‌ అధికారి రఘురమణను డీఈవో అభినందించారు.


logo