సోమవారం 25 జనవరి 2021
Adilabad - Nov 27, 2020 , 00:30:48

లక్కీ డ్రా పేరిట దందా

లక్కీ డ్రా పేరిట దందా

  • తలమడుగు మండలం కజ్జర్లలో పోలీసులు స్వాధీనం చేసుకున్న బ్రోచర్‌
  • ధనార్జనే ధ్యేయంగా మోసాలు
  • విలువైన బహుమతులు అంటూ ప్రచారం
  • వేల సంఖ్యలో సభ్యులు, కోట్లలో దందా
  • నష్టపోతున్న పేద,  మధ్యతరగతి ప్రజలు
  • తాజాగా కజ్జర్లలో నిర్వాహకులపై కేసు 

ఆదిలాబాద్‌ జిల్లాలో కొందరు అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా లక్కీ స్కీం పేరిట సంస్థలను నిర్వహిస్తున్నారు. ప్రజలను మోసం చేస్తూ, అందినకాడికి దండుకుంటున్నారు. గ్రామాల్లో పేద, మధ్యతరగతి ప్రజల ఆశలను అవకాశంగా చేసుకొని కుచ్చుటోపీ పెడుతున్నారు. విజేత లకు విలువైన బహుమతులు, ఇతరులకు గిఫ్ట్‌లు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. ఒక్కో స్కీంలో 2వేల నుంచి 3 వేల మందిని సభ్యులుగా చేర్చుకుంటుం డగా, కోట్లలో దందా కొనసాగిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ ఎంటర్‌ప్రైజెస్‌ల మోసాలు వెలుగులోకి వస్తుండగా, తాజాగా తలమడుగు మండలం కజ్జర్లలో నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.    

- ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ


ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలోని  నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలను ఆసరాగ చేసుకొని కొందరు అక్రమార్కులు సులభంగా డబ్బు సంపాదించాలనే దుర్భుద్దితో లక్కీ స్కీంలకు తెరలేపారు. వివిధ పేర్లతో ఎంటర్‌ ప్రైజెస్‌లను ప్రారంభించి లక్కీ స్కీంలు నడుపుతున్నారు. జిల్లాలోని ఆదిలాబాద్‌, బోథ్‌, ఇచ్చోడ, తలమడుగు, మావల తాంసి ప్రాంతాల్లో ఈ అక్రమ దందా కొనసాగుతోంది.  ఎలాంటి అనుమతులు లేకున్నా ఎంటర్‌ప్రైజెస్‌లను ప్రారంభించి గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకుంటున్నారు. ప్రతి నెల 20 నుంచి 30 బహుమతులు ఉంటాయని వీటితో పాటు కార్లు, గోల్డ్‌కాయిన్లు, బైకులు, ఎల్‌ఈడీ టీవీలు, ఫ్రిజ్‌లతో పాటు ఇతర గృహోపకరణాలను పొందవచ్చంటూ సభ్యులుగా చేర్చుకుంటున్నారు. ప్రతి సభ్యుడు నెలకు రూ.1150 చొప్పున 15 నెలల పాటు చెల్లించాల్సి ఉంటుంది. స్కీం కాల పరిమిత పూర్తయిన తర్వాత లక్కీడ్రాలో పేరు వెళ్లిన వారికి తప్పనిసరిగా వారి చెల్లించిన డబ్బులకు సరిపడా బహుమతి ఇస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ స్కీంలో చేరుతున్నారు. చివరికి ఎలాంటి వస్తువులు ఇవ్వకపోవడంతో బాధితులు మోసపోయి పోలీసులను ఆశ్రయిస్తుండడంతో కేసు నమో దు చేస్తున్నారు. 

వేల సంఖ్యలో సభ్యులు రూ. కోట్లలో దందా..

జిల్లాలోని లక్కీ స్కీంలో వేలాది మంది సభ్యులు ఉండగా, కోట్ల రూపాయల దందా  జరుగుతోంది. ప్రతి స్కీంలో 2 వేల నుంచి 3 వేల మంది సభ్యులు ఉంటారు. ఒక్కో స భ్యుడి నుంచి నెలకు రూ. 1150 చొప్పున 15 నెలల పాటు వసూలు చేస్తారు. ఒకవేళ ఏదైనా నెలలో డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంటే దురుసుగా ప్రవర్తిస్తారు. డబ్బుల వసూళ్ల కోసం ఏజెంట్లను నియమించుకుంటున్నారు. ఇంటర్‌, డిగ్రీ చదువుకునే వారితో పాటు స్థానిక యువకులను పావులుగా వాడుకుంటున్నారు.  ప్రతి నెల వాయిదా చెల్లించాలి. లేకుంటే స్కీం నుంచి వారి పేర్లు తొలగిస్తారు. గ్రామాల్లో ఇలాంటి స్కీంలో చేరిన వారు తమ పేర్లను ఎందుకు తీసివేశారని అడిగితే ఎదురుదాడికి దిగుతారు. దీంతో వారు ఏమి చేయలేని పరిస్థితుల్లో డబ్బులు నష్టపోవాల్సి వస్తుంది. తలమడుగు మండలం కజ్జర్లలో రెండ్రోజుల కిందట పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి నిర్వాహకులు, ఏజెంట్లపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో కొనసాగుతున్న ఈ అక్రమ దందాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.


logo