శనివారం 23 జనవరి 2021
Adilabad - Nov 26, 2020 , 00:48:21

జలం పుష్కలం

జలం పుష్కలం

  • యాసంగికి ఢోకా లేదు..
  • ఈ యేడాది సమృద్ధిగా వర్షాలు
  • ఉబికి వస్తున్న భూగర్భ జలాలు
  • ఆదిలాబాద్‌ జిల్లాలో 1.32 లక్షల ఎకరాల్లో సాగు

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా 1,047 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ప్రతి సంవత్సరం మే నెలలో భూగర్భ జలాలు అడుగంటుతుండగా.. ఈ ఏడాది మేలో 9.32 మీటర్ల లోతుకు పడిపోయింది. జూన్‌లో కురిసిన వర్షాలకు 9.17 మీటర్లు, జూలైలో 6.73, ఆగస్టులో 3.70 మీటర్ల పైకి నీరు చేరింది. సెప్టెంబర్‌లో వర్షాలు లేకపోవడంతో 4.09 మీటర్లు, అక్టోబర్‌లో 4.33 మీటర్ల లోతులో భూగర్భజలాలలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో 1,32,328 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ సారి భూగర్భజలాలు పైనే ఉండడం వ్యవసాయ బావులు, బోర్‌లలో నీరు పుష్కలంగా ఉండడంతో సాగు విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రాజెక్టుల పరిధిలో  పెరగనున్న ఆయకట్టు

జైనథ్‌ మండలం సాత్నాల, తాంసి మండలం మత్తడి ప్రాజెక్టు కాలువల ద్వారా నాలుగు విడుతలుగా అధికారులు సాగుకు నీరందిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు సమస్య ఉండదు. రెండు ప్రాజెక్టుల పరిధిలో 32వేల ఎకరాలకు నీరు అందుతుంది. జిల్లాలో 452 చెరువుల పరిధిలో 80 వేల ఎకరాలు సాగవుతాయి. వీటికి అదనంగా  17,301 బోర్లు, వ్యవసాయబావులు ఉన్నాయి. వీటి కింద కూడా రైతులు యాసంగిలో సాగు చేస్తారు. ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తుండడం, ఈ ఏడాది వానకాలంలో కురిసిన వర్షాలతో సాగునీటి వనరుల్లో సమృద్ధిగా నీరు చేరడంతో రెండో పంట బాగా పండే అవకాశాలున్నాయి. జిల్లాలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో రైతులు పత్తి పంటను తీసేసి శనగ, గోధుమ వేస్తున్నారు. గతంలో బోర్లు, వ్యవసాయ బావుల్లో నీరు ఉన్నా కరెంటు లేకపోవడంతో భయంగా రెండో పంట పండించ లేకపోయామని, మూడేళ్లుగా ఫుల్‌ కరెంట్‌తో యాసంగిలో సాగు చేస్తున్నామని రైతులు పేర్కొంటున్నారు.


logo