శనివారం 28 నవంబర్ 2020
Adilabad - Nov 22, 2020 , 00:20:01

మరింత అప్రమత్తంగా ఉండాలి

మరింత అప్రమత్తంగా ఉండాలి

  • ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ 

ఎదులాపురం : కొవిడ్‌-19పై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు.  ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌లో  శనివారం వైద్యాధికారులతో సమావేశమై మాట్లాడారు. కొవిడ్‌-19 వ్యాప్తి రెండో దశ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యం త్రాంగాన్ని అప్రమత్తం చేసిందన్నారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటించేలా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడంతో పాటు  భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రపర్చుకోవాలని సూచించా రు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని డాక్టర్లు, వీఆర్వోలు, కార్యదర్శులు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు టీమ్‌గా ఏర్పడి విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇతర శాఖల సహకారం తీసుకోవాలన్నారు. మాస్క్‌ ధరించకుంటే జరిమానా విధిస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల నుంచి పౌష్టికాహారం అందేవిధంగా వైద్య శాఖ, అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సమావేశంలో ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ సాధన, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా ,డాక్టర్లు వైద్య సిబ్బంది ఉన్నారు.

తక్షణ సహకారం అందించాలి  

వేధింపులకు గురైన మహిళలకు తక్షణ సహకారం అందించి ఆదుకోవాలని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. వేధింపులకు గురైన మహిళలు, పిల్లలకు ఉపశమనం, సహకారం అందించేందుకు సంబంధించి కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమై మాట్లాడారు. లైంగిక వేధింపులు, వరకట్నం, కిడ్నాప్‌కు గురైన మహిళలు, పిల్లలకు పరిహారం అందించే విధంగా సఖీ కేంద్రం సహకరించాలని సూచించారు. బాధితులకు  ఎఫ్‌ఐఆర్‌ కాఫీలు  అందిస్తామని, మెడికల్‌ సర్టిఫికెట్లు అందిస్తామని అదనపు ఎస్పీ ఎస్‌ శ్రీనివాస రావు తెలిపారు. బాధితులకు ఎల్లవేళలా పోలీసుల సహకారం ఉంటుందని చెప్పారు. బాధితులకు నిర్ణీత సమయంలో పరిహారం, సహకారం అందిస్తున్నామని జిల్లా సంక్షేమ అధికారి మిల్కా తెలిపారు. జనవరి నుంచి నమోదైన కేసుల వివరాలు పంపించాలని పోలీస్‌ అధికారులను కోరారు. జిల్లాలో ఇప్పటివరకు 23 మంది బాధితులకు పరిహారం అందించామని సఖీ సెంటర్‌ నిర్వాహకురాలు యశోద తెలిపారు. సమావేశంలో ఉట్నూర్‌ డీఎస్పీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, సీఐలు పీ శ్రీనివాస్‌, పురుషోత్తం, సఖీ సెంటర్‌ సిబ్బంది ఉన్నారు.