మంగళవారం 09 మార్చి 2021
Adilabad - Nov 04, 2020 , 00:26:02

కొలాంల సంక్షేమానికి కృషి

కొలాంల సంక్షేమానికి కృషి

ఉట్నూర్‌ రూరల్‌ : కొలాంల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. మండలంలోని కొలాంగూడ గ్రామంలో కుమ్రం సూరు 23వ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ఐటీడీఏ పీవో భవేశ్‌ మిశ్రా, ఎస్పీ విష్ణు వారియర్‌తో కలిసి  సూరు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొలాం గిరిజనులకు ఐటీడీఏ ద్వారా వ్యవసాయ, స్వయం ఉపాధి కింద రాయితీ పథకాలు అందిస్తున్నామన్నారు. అనంతరం ఆదివాసీ కొలాం సేవా సంఘం ఆధ్వర్యంలో  కలెక్టర్‌, పీవోకు వినతి పత్రం అందించారు. సూరు వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. నిబంధనలు లేకుండా ఏజెన్సీ సర్టిఫికెట్‌ ఇవ్వాలని, మన్నేవార్లకు ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రా లు రద్దుచేయాలని, సీసీడీపీ నిధులతో రూ. 30 లక్షల్లోపు పనులకు టెండర్లను రద్దు చేసి వీడీసీ కమిటీలకు కేటాయించాలని కోరారు. బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులైన కొలాం విద్యార్థులను సీఆర్టీలుగా నియమించాలన్నారు. పెసా కోఆర్డినేటర్‌ను కొలాంలకు కేటాయించి, బ్యాంక్‌ లింకేజీ లేకుండా రూ. 2 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించాలని విన్నవించారు. ఐటీడీఏ ఆధీనంలో ఉండే సంక్షేమ పథకాలు బ్యాంక్‌తో సంబంధం లేకుండా పీటీజీ అధికారికి పూర్తి బాధ్యత అప్పగించాలని, భూమిలేని కుటుంబాలకు మూడెకరాలు కేటాయించాలని అన్నారు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నవించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంతకు ముందు గ్రామస్తులు సాంప్రదాయ పద్ధతిలో గుస్సాడీలతో  వారికి ఘనంగా స్వాగతం పలికారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, డీఎస్పీ ఉదయ్‌రెడ్డి, సీఐ నరేశ్‌, వైస్‌ ఎంపీపీ దావులే బాలాజీ, ఐటీడీఏ మాజీ డైరెక్టర్‌ ఈశ్వరీ బాయి, పెసా జిల్లా కోఆర్డినేటర్‌ వెడ్మ బొజ్జు,  ఆదివాసీ కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టేకం భాస్కర్‌, ప్రధాన కార్యదర్శి ఆత్రం భీంరావు, రాష్ట్ర ప్రతినిధి కొడప నగేశ్‌, బాలేరావు, రామారావు, ఆత్రం శ్రీనివాస్‌, ఈత్రం బొజ్జు, నాయకులు మర్సుకోల తిరుపతి, కమిటీ అధ్యక్షుడు జగన్నాథ్‌రావు, సోనేరావు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.      

VIDEOS

logo